పునరావాసం స్థలాలు పరిశీలించిన ఆర్అండ్ఆర్ కమిషనర్ : ఆర్అండ్ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు

పునరావాసం స్థలాలు పరిశీలించిన ఆర్అండ్ఆర్ కమిషనర్ : ఆర్అండ్ఆర్  కమిషనర్  శివ కుమార్ నాయుడు

నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్​ రిజర్వాయర్  నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఆర్అండ్ఆర్  కమిషనర్  శివ కుమార్ నాయుడు శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. నార్లపూర్  రిజర్వాయర్  ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఇందులోభాగంగా కొల్లాపూర్  మండలంలోని సున్నపు తండా, అంజనగిరి, బోడబండ తండా ప్రాంతాలను సందర్శించారు. 

ముంపునకు గురైన 117 కుటుంబాలకు ఆర్అండ్ఆర్  ప్యాకేజీ కింద పరిహారం అందించినప్పటికీ, ఆర్అండ్ఆర్  కాలనీ ఏర్పాటు చేయలేదు. దీంతో 117 నిర్వాసిత కుటుంబాల వివరాలను సేకరించారు. అంజనగిరి వద్ద ఫారెస్ట్  భూములు, కొల్లాపూర్  పట్టణంలోని ఈదమ్మ దేవాలయం సమీపంలో 622, 623 సర్వే నంబర్లలో 10 ఎకరాల 18 గుంటల భూమిని పరిశీలించారు.

 కేఎల్ఐ,  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిసరాల మధ్య ఉన్న బోడబండ తండాను ఎగువ ప్రాంతానికి మార్చే ప్రతిపాదనలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఆర్అండ్ఆర్  ప్యాకేజీ కింద తమకు న్యాయం చేయాలని నిర్వాసిత కుటుంబాలు కమిషనర్  శివకుమార్ నాయుడును వేడుకున్నారు. అడిషనల్  కలెక్టర్  అమరేందర్, స్పెషల్  కలెక్టర్లు మధుసూదన్  నాయక్, యాదగిరి, ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్​ విష్ణువర్ధన్ రావు ఉన్నారు