అమెరికా తీరుపై మౌనం తగదు.. భారత్ నిశ్శబ్దం విద్యార్థులకు నష్టం..?

అమెరికా తీరుపై మౌనం తగదు.. భారత్ నిశ్శబ్దం విద్యార్థులకు నష్టం..?

ప్రపంచ పాలనా వేదికలు ఒకవైపు,  సామాజిక వేదికలు మరోవైపు.. అధికారాలూ, అభిప్రాయాలూ రెండూ కొత్త మలుపులు తిరుగుతున్నకాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్ మధ్య నెలకొన్న  వైఖరుల తేడా ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్‌‌కు అనుకూలం ఎవరు?  వ్యూహాత్మకంగా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.  

2024లో ట్రంప్ గెలుపునకు మస్క్ మద్దతు తెలిపినా అనంతరం కొద్దికాలంలోనే  ట్రంప్ తీసుకున్న విధానాలపై మస్క్ పరోక్షంగా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల నియంత్రణలు పెరగడం, ప్రజల అభిప్రాయ స్వేచ్ఛపై  పరిమితులు విధించడాన్ని  మస్క్ తన భావజాలానికి విరుద్ధంగా చూశారు.  ఇలా ప్రత్యక్ష రాజకీయ పార్టీల్లో భాగం కాకపోయినా  మస్క్  ప్రజల అభిప్రాయాలపై ప్రభావం చూపగలగడం ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తున్నారు.  ఒకవైపు అధికారంతో ట్రంప్  మరోవైపు వేదికలపై మస్క్ రాజకీయ వ్యూహాలు చేస్తున్నారు.  అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ పాలనా అధికారాన్ని వినియోగిస్తుంటే, మస్క్ మాత్రం సామాజిక మాధ్యమాలపై తన ఆధిపత్యాన్ని వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నారు.  

ఎక్స్​ (మాజీ ట్విట్టర్) వంటి వేదికల ద్వారా  మస్క్  ప్రజా చర్చల్లో ప్రత్యక్షంగా భాగస్వామి అవుతున్నారు.  ఈ వ్యత్యాసం  ‘స్వేచ్ఛా వ్యాఖ్యల’ హద్దులపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్  ప్రవేశపెట్టిన ‘వన్​ బిగ్ బ్యూటిఫుల్​ బిల్’ ద్వారా  అక్కడి  పౌరుల  నియామక విధానాల్లో  విప్లవాత్మక  మార్పులకు  నాంది పలికారు.  అయితే,  ఈ బిల్లులోని అంశాలు  ఫెడరల్  నియామకాలపై నియంత్రణ, వలస విధానాల్లో  కఠినత, డీసీ పాలనపై జోక్యాలు.  మస్క్ వంటి ప్రభావవంతుల అభ్యంతరాలకు దారితీశాయి. ఇది కేవలం 
విధానపరమైన వ్యతిరేకత కాదు.  భావజాలస్థాయిలో నెమ్మదిగా పెరుగుతున్న ఘర్షణకు సూచిక.

భారత్ నిశ్శబ్దం.. విద్యార్థులకు నష్టం?

భారత  విద్యార్థులు  ప్రతి సంవత్సరం  అమెరికాలో ఉన్నత విద్యకోసం సుమారు 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  ఇది  అమెరికా విద్యాసంస్థలకు, ఆర్థిక వ్యవస్థకూ ఎంతో దోహదపడుతోంది.  అయితే,  విద్య అనంతరం ఉద్యోగ అవకాశాల విషయంలో  వీసాల పరిమితుల వల్ల భారత విద్యార్థులు నష్టపోతున్నారు.  ట్రంప్ పాలనలో H1-B వీసాలపై నియంత్రణలు, OPT అవకాశాలపై కత్తిరింపులు,  భారత యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.  ఇప్పుడు ప్రశ్న.. భారత్ ఎందుకు స్పందించడం లేదు? ఈ మౌనం  దేశ వదనాన్ని తక్కువ చేస్తుంది. 

 ట్రంప్ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత   అమెరికాలో పరిస్థితులు మారాయి.  2025లో మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్  మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వలసదారులపై నియంత్రణ,  ఫెడరల్ ఉద్యోగ నియామక, తొలగింపు విధానాల్లో మార్పులు,  వాషింగ్టన్ డీసీ పాలనపై నేరుగా జోక్యాలు. 
ఈ చర్యలు అమెరికా రాజ్యాంగ వ్యవస్థపై  ప్రశ్నలు మిగిల్చాయి.  ఇదే సమయంలో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ పొందిన వ్యక్తి కావడం. అంతర్గత పరస్పర విరుద్ధతకు సంకేతం.

మస్క్‌‌కు అధ్యక్ష పదవిపై అమెరికా రాజ్యాంగం  ఏం చెబుతోంది?

అమెరికా రాజ్యాంగం ప్రకారం (Article II, Section 1): అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే “Natural Born Citizen” అయి ఉండాలి. ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు, అమెరికా పౌరసత్వం తర్వాత పొందారు. అందువల్ల అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు సాధ్యం కాదు.  కానీ,  భావజాలపు ప్రభావాన్ని, ఆర్థిక బలాన్ని వినియోగిస్తూ  మస్క్ రాజకీయ వైఖరులపై తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు.  భారత్-– అమెరికా సంబంధాలు, మాటల్లో మిత్రత్వం, విధానాల్లో ఒత్తిడి కొనసాగుతోంది.  ట్రంప్ ప్రధాని మోదీని తరచూ ‘మై డియర్ ఫ్రెండ్’ అని పేర్కొన్నప్పటికీ  అమెరికా విధానాలు మాత్రం భారత్‌‌పై ఒత్తిడి కొనసాగించాయి. దిగుమతులపై అధిక టారిఫ్‌‌లు,   వీసాలపై ఆంక్షలు,  ప్రవాస భారతీయులపై పరిమితులు, ఈ విధానాలు మిత్రత్వపు మాటలకు వ్యతిరేకంగా కనిపించాయి.

 భారత్‌‌పై మస్క్ ప్రత్యేక దృష్టి

టెస్లా, స్టార్​లింక్ వంటి  సంస్థల ద్వారా  మస్క్ భారత్ మార్కెట్‌‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారు.  ఇక్కడి యువ జనాభా, విస్తృతమైన డిజిటల్ ప్రవర్తన,  విస్తరిస్తున్న బజార్.. మస్క్ వ్యూహానికి అనుకూలంగా మారాయి. రాజకీయ అధికారానికి అర్హత లేకపోయినా  బౌద్ధిక,  ఆర్థిక వ్యూహాల ద్వారా ప్రభావాన్ని కొనసాగించాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. యూఎస్​ బిపార్టిజన్ మద్దతు  ఇక కొనసాగుతుందా?  ఇప్పటివరకు అమెరికాలో భారత ప్రయోజనాలకు రెండు పెద్ద పార్టీలూ మద్దతిచ్చాయి.  అయితే, సోషల్ మీడియా ప్రభావం, మస్క్ వంటి వ్యక్తుల అభిప్రాయ ఆధిపత్యం పెరగడం వల్ల ఈ బిపార్టిజన్ మద్దతు భవిష్యత్‌‌లో ఎలా మారుతుందో చెప్పలేం..

వ్యూహాత్మక వైఖరి అవసరం

భారత్ దారి  మౌన వ్యవహారం కాకూడదు, సమతుల్య వ్యూహం కావాలి.  ప్రపంచ పాలనలో శక్తుల మధ్య పోటీ ముదిరిపోతున్నవేళ  భారత్ తటస్థంగా కాక,  స్పష్టమైన వ్యూహాత్మక వైఖరి చూపాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఎవరు అధికారం చేపట్టినా  భారత  విద్యార్థుల  ప్రయోజనాలు,  వాణిజ్య  నైతికత,  ప్రవాస భారతీయుల హక్కులు,  అంతర్జాతీయ చర్చల్లో ప్రధానాంశాలుగా నిలవాలి.  మస్క్ అనుకూలతను వ్యాపార విస్తరణకే పరిమితం చేయకుండా, ఆయన భావజాల దిశను  అర్థం  చేసుకోవాలి.  ట్రంప్ విధానాలను కూడా వ్యక్తిగత మైత్రితో కాకుండా వ్యవస్థాపిత నిర్ణయాల ఆధారంగా మదింపు చేయాలి. ఇదే భారత్‌‌కు దీర్ఘకాలిక 
ప్రయోజనాలు తీసుకొచ్చేమార్గం.

డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
పొలిటికల్​ ఎనలిస్ట్, మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్