ప్రపంచంలోనే పెద్ద అవినీతిపరుడి చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

ప్రపంచంలోనే పెద్ద అవినీతిపరుడి చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

హైదరాబాద్:  ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ నలిగిపోతోందని,  సీఎం కేసీఆర్ అన్ని కులాల వాళ్లకు పంగనామాలు పెట్టాడని మాజీ ఎంపీ రవీందర్ నాయక్  ఆరోపించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జనాభా దామాషా ప్రకారం ఎస్టీ రిజర్వేషన్ ను ఆరు శాతం నుండి పది శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని గుర్తు చేశారు. 1569 మంది ప్రాణ త్యాగాల తో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందన్నారు.  8 ఏళ్ల పాలన కాలం మొత్తం అవినీతి మయంగా పాలిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  ప్రజల హక్కులను కాలరాస్తున్నాడని, టీఆర్ఎస్ గూండాలతో పోలీసులతో దాడి చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో వందలాది బెల్టుషాపులు ఏర్పాటు చేసి  ప్రజలను తాగుబోతులుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో  ఏ ఒక్కటి కూడా సీఎం కేసీఆర్ అమలు చేయలేదని, రాబోయే రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. 
రాష్ట్ర గవర్నర్ గిరిజన సమస్యలను సుమోటోగా తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు పెంచకపోతే క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామన్నారు. గిరిజన రిజర్వేషన్ ఉద్యమం కోసం అందరూ కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా ప్రాతిపదికగా ప్రతి గ్రామ పంచాయతీలలో తీర్మానం చేయించి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఉద్యోగ సంఘాలు గిరిజన సమస్యలపై  తీర్మానం చేసి డిమాండ్లను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు పంపాలన్నారు. రాష్ట్ర గవర్నర్ గిరిజన సమస్యల మీద సుమోటోగా తీసుకోవాలని కోరారు. 
భారత్ చౌహాన్ మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ గిరిజన రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో లేవనెత్తారని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిరిజనులకు అందవలసిన రిజర్వేషన్లు  అందడం లేదన్నారు. ఎన్టీ రామారావు 127 జీవో ప్రకారం 4 శాతం రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్లు 6 శాతం చేశారని తెలిపారు. గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే 9.8 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కేసీఆర్ కు  గిరిజనులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

సింగరేణిలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?

స్విస్ ఓపెన్ టైటిల్ పీవీ సింధు కైవసం

యాదాద్రి జిల్లాలో కోతికి అంత్యక్రియలు