మీ లాంటి జేజమ్మలని మస్త్ మందిని చూశా: షర్మిల

మీ లాంటి జేజమ్మలని మస్త్ మందిని చూశా: షర్మిల

ప్రజల పక్షాన పోరాడటమే తప్పా....? అని వైఎస్ఆర్టీపీ చీప్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సెక్రెటేరియట్ లో ఏదో జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాక్ డ్రిల్ జరిగితే ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల... మీ లాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. గతంలో నర్సంపేటలో తమ బస్సును తగలబెట్టి, తమపై దాడి చేశారని ఆరోపించారు. నిన్న వర్ధన్నపేటలో ప్రజా ప్రస్థానం యాత్రపై దాడి చేశారని, ఏం జరిగినా తన పాదయాత్ర తిరిగి మొదలుపెట్టానని చెప్పారు. ఫ్లెక్సీలు చింపి, కవరేజ్ చేస్తున్న మీడియాపై దాడికి యత్నించారన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై దాడులు చేస్తారా? అని ఆమె నిలదీశారు.

ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ అని షర్మిల చెప్పారు. ప్రజలు చేస్తున్న ఆరోపణలనే తాను ప్రస్తావించానని, అరూరి రమేష్ రైతులపై థర్డ్ డిగ్రీ చేపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కబ్జాలు చేయడం నిజం కాదా, ఏకంగా మందకృష్ణ భూమినే కబ్జా చేశారు అని వాదించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ అవినీతిపై సొంత పార్టీ కౌన్సిలర్ల నిరసన నిజం కాదా? అని నిలదీశారు. మీ అక్రమాలను ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారని, ప్రజా సేవ చేయాలనే సోయి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని విమర్శించారు. పర్వతగిరి నుండి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి గ్రామానికి ఏం చేశారని ప్రశ్నించానని చెప్పారు. అప్పులపాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న షర్మిల.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఏం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులకు నిధులు అందించాల్సింది పోయి ఖాళీ బీరు సీసాలు అమ్మమంటారా...? అంటూ మండిపడ్డారు. వీళ్ళని ఎవరూ నిలదీయకపోవడంతోనే ఇలా తయారయ్యారన్న షర్మిల.. ఎవరు మాట్లాడితే వాళ్లపై దాడులు, కేసులు పెడుతున్నారని, దమ్ముంటే మంచి పాలన అందించండని సవాల్ విసిరారు.