తేనెటీగలు లేకపోతే మన బతుకు నాలుగేండ్లే

తేనెటీగలు లేకపోతే మన బతుకు నాలుగేండ్లే

తియ్యని తేనెను పంచే తేనెటీగల గురించి చేదు నిజాలు చెప్పారు సైంటిస్టులు. భూమిపై అంతరించిపోతున్న జీవులు జాబితాలో తేనెటీగలు కూడా చేరాయట. అవి అంతరించిపోతే.. ఆ తర్వాత మనిషి బతికేది నాలుగేళ్లేనట. అందుకే తేనెటీగలు బతకాల్సిందేనని, వాటిని బతికించుకోవాల్సిందేనంటున్నారు.

ఈ భూమ్మీద బతికే హక్కు మనిషికి ఎంతుందో.. మిగతా జీవరాశికి కూడా అంతే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే… మనిషికంటే మిగతా జీవరాశికే ఎక్కువుంది. ఎందుకంటారా? మనిషి కేవలం తన కోసమే బతుకుతున్నాడు. కానీ మిగతా జీవరాశులు మాత్రం అలా కాదు.. అవి బతుకుతూ సహచర ప్రాణులకు జీవనాధారంగా మారుతున్నాయి. అందుకే.. ఈ భూమ్మీద తప్పనిసరిగా బతకాల్సిన జీవుల లిస్ట్​లో అవి మనిషికంటే ముందే ఉన్నాయి. ఇక ఈ లిస్ట్​లో అన్నింటికంటే ముందున్నది తేనెటీగ.

తేనెటీగా…? అని ఆశ్చర్యపోకండి. అవి లేకపోతే నాలుగేళ్లలో ఈ భూమి మొత్తం ఎడారిగా మారిపోతుంది. తేనెటీగలే లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల్లా ఏదో ఓ గ్రహంగా భూమి మారిపోవడానికి ఎన్నోరోజులు పట్టదట. తేనెటీగలు అంతరించిపోతే సముద్ర జీవులు తప్ప భూమ్మీద ఏ జీవరాశి కూడా ఎక్కువ రోజులు బతికుండవు. అందుకే ‘మన ప్లానెట్​పై తప్పనిసరిగా ఉండాల్సిన జీవి’గా తేనెటీగకు మొదటిస్థానం ఇచ్చారు రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు.

తేనెటీగల గురించి సైంటిస్ట్​ ఆల్బర్ట్​ ఐన్​స్టీన్​ ఓ మాట చెప్పారు. అదేంటంటే… ‘ తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు బతికేది కేవలం నాలుగేళ్లు మాత్రమే’నని. ఈ ఒక్కమాట చాలు.. మనమంతా బతికి ఉండడమనేది తేనెటీగలతో ఎంతగా ముడిపడి ఉందో అర్థం చేసుకోవడానికి.

ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల బతుకు ప్రమాదంలో పడిపోయిందని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90శాతం తేనెటీగలు అంతరించిపోయాయని గుర్తించారు. ఇప్పటికిప్పుడు తేనెటీగల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకున్నా… వందేళ్లలో వాటి సంఖ్యను కనీసం పదిశాతం కూడా పెంచలేమంటున్నారు. ఎందుకంటే… తేనెటీగలు బతకలేని పరిస్థితిని సృష్టించింది మనమే. భవిష్యత్తులో తేనేటీగలు ల్యాబ్​​లలో పెరగాల్సిందే తప్ప.. బయటి ప్రపంచంలో బతకలేవని చెబుతున్నారు.

వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్(FIA) సహకారంతో ఎపికల్చర్ ఎంట్ర​ప్రెన్యూర్‌‌‌‌షిప్ సెంటర్ ఆఫ్ యూనివర్సల్​, ఎపికల్చర్ కార్పొరేషన్ ఆఫ్ చిలే సంస్థల సైంటిస్టులు తేనెటీగలపై ఇటీవల రీసెర్చ్​ చేశాయి. వీళ్ల రీసెర్చ్​లో ఓ ఇంట్రెస్టింగ్​ విషయం తెలిసింది. అదేంటంటే.. ‘ఈ భూమ్మీద ఉన్న జీవరాశుల్లో ఒక్క తేనెటీగలు మాత్రమే రోగాలను వ్యాప్తి చేయవ’ని తేలింది. ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ వంటి ఏ సూక్ష్మజీవి కూడా తేనెటీగల ద్వారా వ్యాప్తి చెందదట.

తేనెటీగల వల్ల లాభమేంటి? అని అడిగితే… రుచికరమైన తీయని తేనె లభిస్తుందని చెబుతాం. కానీ… ప్రపంచవ్యాప్తంగా 70 శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి జరుగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాల పంటలు పుష్పించి, కాపు కాయాలంటే తేనెటీగలే అవసరం. పువ్వుల్లోని పుప్పొడి రేణువుల్ని తేనెటీగలు మోసుకెళ్లడం వల్లే పరాగ, పరపరాగ సంపర్కం జరిగి పంటలు పండుతున్నాయి. ఇదే జరగకపోతే భవిష్యత్తులో మనకే కాదు.. ఏ జీవరాశికీ తిండి దొరకదు.

ఇంత ఇంపార్టెంట్​ రోల్​ పోషిస్తున్న తేనెటీగలను మనమే చేజేతులా చంపేస్తున్నాం. అడవులను నరికేయడం, పంటపొలాల్లో విపరీతంగా పురుగుమందులు వాడడం, తేనెటీగలు గూడు కట్టుకునేందుకు కూడా కనీసం స్థలం లేకుండా చేయడం.. ఇవన్నీ తేనెటీగలకు మనం చేస్తున్న హాని మాత్రమే కాదు.. మనకు మనమే చేసుకుంటున్న హాని కూడా.

స్విట్జర్లాండ్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సెల్‌‌ఫోన్ వాడకం పెరిగిపోవడం కూడా తేనెటీగలు అంతరించడానికి ఓ కారణం. సెల్​ఫోన్​ సిగ్నల్స్​ కారణంగా తేనెటీగలు తమ గూడున్న దారిని మర్చిపోతాయి. ఎటువెళ్లాలో తెలియక తిరిగి తిరిగి అలసిపోతాయి. ఫలితంగా అవి పూలపై వాలి, మకరందాన్ని సేకరించే పనిని బాగా చేయలేవు. అంతేకాకుండా తేనె సేకరించుకోవడం తగ్గిపోవడంతో వాటి జీవితకాలం కూడా తగ్గుతోంది. అడవుల నరికివేతను అరికట్టడం, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే.. కనీసం మిగిలిన పదిశాతం తేనెటీగలైనా.. అవి బతుకుతూ మనల్నీ బతికిస్తాయి.