మమ్మల్ని నమ్మితే రాష్ట్ర పరిస్థితిని మార్చేస్తాం

మమ్మల్ని నమ్మితే రాష్ట్ర పరిస్థితిని మార్చేస్తాం

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రానికి పట్టిన చిలుము కేసీఆర్ అని, అది తొలగించాలంటే కష్టపడాలని తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం స్థానిక ఇందిరాగార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. రాష్ట్రంలో తాగుబోతులు రెండు రోజులు స్ట్రైక్ చేస్తే సీఎం కేసీఆర్ కు గుండెపోటు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 7,200 మంది అవినీతిపరులను అంతం చేసే ఉద్యమమే 7,200 అని చెప్పారు. ఒక్కసారి తమను నమ్మితే రాష్ట్ర పరిస్థితిని మార్చేస్తామని చెప్పారు. చదువు ప్రాధాన్యతను 7,200 గుర్తించిందని, విద్య తమ  తొలి ప్రాధాన్యతా అంశమని పేర్కొన్నారు. కరీంనగర్ లో 635 ప్రభుత్వ బడులుంటే ఊరికి 20 చొప్పున 6 వేల బెల్టు షాపులున్నాయన్నారు. గొప్ప రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మరుగుదొడ్లు, పుస్తకాల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కుతుంటే అన్నింట్లో తెలంగాణ నంబర్ వన్ అని ఎలా చెప్పుకొంటున్నారని ప్రశ్నించారు. పేదలకు నాణ్యమైన విద్య అందితే భవిష్యత్ లో ప్రశ్నిస్తారని, వారికి చదువు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు.

తమకు కులమతాలు, ధనిక, పేద తేడా లేదని చెప్పారు. అందరినీ సమానంగా చూడటమే తీన్మార్ టీం లక్ష్యమన్నారు. తమను నమ్మితే భవిష్యత్తులో ప్రైవేటు విద్యాలయాలు లేకుండా చేస్తామని, అందరికీ నాణ్యమైన ప్రభుత్వ విద్య అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్య తర్వాత వైద్యానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎవరికి ఆపద వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకునేలా చూస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఇకపై ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రీట్​మెంట్​చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేముందు తన, కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేసి జీరో బడ్జెట్ తో ముందుకు వస్తానని స్పష్టం చేశారు.  అవినీతి చేస్తూ దొరికితే ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. గెలిచిన నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే పదవి నుంచి దింపేసేలా రీకాల్ పద్ధతిని అమలులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాము అనుకున్నవి అమలు చేయగలిగితే.. కొత్త పథకాలే అవసరంలేదని వెల్లడించారు.