అప్పు తెస్తేనే రైతు బంధు!

అప్పు తెస్తేనే  రైతు బంధు!
  • శాలరీలు, పెన్షన్లు మినహా అన్నీ స్కీమ్​లకు నిధులు ఆపేస్తున్నరు
  • వచ్చే నెలా ఉద్యోగుల జీతాలు ఆలస్యమే.. దళిత బంధుకు అరకొర నిధుల రిలీజ్​
  • జనవరిలో ఆర్​బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పుకు ప్లాన్ 
  • ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.28వేల కోట్ల రుణం
  • రానున్న 3నెలల్లో మరో రూ.13వేల కోట్ల అప్పుకు ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు: యాసంగి రైతుబంధు సాయానికి అవసరమైన నిధులపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. అన్నీ స్కీములు, ఇతర బిల్లులు ఆపి.. అప్పులు తెచ్చి ఫండ్స్ సర్దుబాటు చేస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నెల్లో రూ.4వేల కోట్ల పైనే అప్పులు తీసుకోనుంది. అందులో భాగంగానే సంక్రాంతి దాకా రైతుబంధు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసినట్లు తెలిసింది. రోజుకు ఎకరా చొప్పున నిధులు విడుదల చేసినా.. 10–11 రోజుల్లో పూర్తవుతుంది. పైగా గతేడాది మినహా అంతకుముందు రెండు, మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో రైతుబంధు చెల్లింపులు చేసింది. ప్రజలపై ట్యాక్స్​ల భారం మోపడంతో సొంత ఆదాయం మెరుగైనప్పటికీ గత అప్పుల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. అయినప్పటికీ  బీఆర్ఎస్​గా టీఆర్ఎస్ మార్చడంతో పాటు ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ నినాదంతో తీసుకోవడంతో ఎట్టిపరిస్థితుల్లో రైతుబంధు ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే రైతుబంధు తీసుకొచ్చి విత్తన సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, పంట బీమా అమలు వంటివన్నీ నిలిపివేసింది. దీంతో కిసాన్ సర్కార్ అనేదానిపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని.. అప్పు చేసి అయినా సరే రైతుబంధు కంప్లీట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

బిల్లులన్నీ నిలిపేసిన్రు

రైతుబంధు కోసం రూ.7,600 కోట్లు అవసరం కానున్నాయి. ఈ మొత్తం ఇచ్చేందుకు ఇతర స్కీములు, అరకొర చెల్లిస్తున్న బిల్లులను నిలిపివేసింది. దళితబంధుకు సంబంధించిన ఫండ్స్ కూడా ఈ నెలలోనే పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి ఉండగా.. రైతుబంధు కారణంగా కొంతమాత్రమే ఇచ్చినట్లు తెలిసింది. ఇవ్వాలనుకున్న రూ.2వేల కోట్లు కూడా లేట్​ అవుతున్నాయి. అదేవిధంగా, వచ్చే నెల్లో ఉద్యోగుల జీతాలు కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే రిటైర్డ్ ఎంప్లాయీస్​కు సంబంధించిన బెనిఫిట్స్ నెలలు గడుస్తున్నా ఇవ్వట్లేదు. ఎన్నో కొన్ని చెల్లించే దానికి కూడా కొన్నిరోజుల నుంచి ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఫుల్​స్టాప్​ పెట్టింది. రైతుబంధు పూర్తయ్యేదాకా జీతాలు, పెన్షన్లు, ఆసరా మినహా ఇతరత్రా వంటివన్నీ నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అన్ని డిపార్ట్​మెంట్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

ఇప్పటికే 28వేల కోట్ల రుణం

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అప్పు తప్ప మరో దిక్కు స్టేట్ గవర్నమెంట్​కు కనిపించడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.28వేల కోట్ల మేర అప్పులు చేసింది. రానున్న మూడు నెలల్లో ఇంకో రూ.13వేల కోట్ల దాకా అప్పు తీసుకునేలా ప్లాన్ చేసింది. వచ్చే నెలలో రూ.4వేల నుంచి రూ.5వేల కోట్లు తీసుకోనుంది. ఈనెల 28 నుంచి రైతుబంధు మొదలుపెడుతుండటంతో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రతీ నెల యావరేజ్​గా ట్యాక్స్​ల రూపంలో ప్రభుత్వానికి రూ.10వేల కోట్ల ఆదాయం వస్తున్నది. అప్పులు యావరేజ్​గా మూడు వేల కోట్లు తీసుకుంటున్నది. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర నాన్ ట్యాక్స్​ ఆదాయం రూ.వెయ్యి కోట్ల మేర వస్తోంది. అయితే, జీతాలు, పెన్షన్లకు రూ.4వేల కోట్ల నుంచి రూ.4,500 కోట్లు ఇస్తున్నది. గతంలో తీసుకున్న అప్పులకు రూ.1,600 కోట్లు ఇంట్రెస్ట్​ చెల్లిస్తున్నది. ఇతర అప్పుల కిస్తీలు ఇంకో రూ.2 వేల కోట్ల దాకా పే చేస్తున్నది. ఇక ఆసరా ప్రతినెలా యావరేజ్​గా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇతరత్రా ముఖ్యమైన స్కీములకు కొంత కొంత నిధులను ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నది.