ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడ్డారు

 ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడ్డారు

న్యూఢిల్లీ: మంచి ఫుడ్ తీసుకోని కారణంగా 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడ్డారని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ స్టడీలో వెల్లడైంది. ఆ ఏడాది నమోదైన మొత్తం టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 70 శాతానికిపైగా కేసులకు తిండి సమస్యనే కారణమని రీసెర్చర్లు గుర్తించారు. 1990 నుంచి 2018 మధ్య జరిగిన అనేక స్టడీలను, గ్లోబల్ డయేటరీ డేటాబేస్ సమాచారాన్ని విశ్లేషించి, ఆయా దేశాలు, ప్రాంతాల్లో పరిస్థితిని వీరు అంచనా వేశారు. అత్యధికంగా జనాభా ఉన్న 30 దేశాలను తీసుకుంటే వాటిలో.. ఇండియా, నైజీరియా, ఇథియోపియా దేశాల్లోనే టైప్ 2 డయాబెటిస్ కేసులు తక్కువగా నమోదయ్యాయని గుర్తించారు. ప్రాంతీయంగా చూస్తే.. సెంట్రల్, ఈస్టర్న్ యూరప్, సెంట్రల్ ఆసియాలో ప్రధానంగా రష్యా, పోలండ్ దేశాల్లో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, ఆలుగడ్డలు ఎక్కువగా తినడం వల్లే ఎక్కువ మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారని రీసెర్చర్లు తెలిపారు. అలాగే లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రధానంగా కొలంబియా, మెక్సికో ప్రాంతాల్లో ప్రాసెస్ చేసిన మాంసం, షుగర్ తో కూడిన డ్రింక్స్ ను ఎక్కువగా, హోల్ గ్రెయిన్స్ (ముడి ధాన్యాలు)ను తక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధి బారినపడ్డట్లు గుర్తించారు. అయితే, దక్షిణాసియా, సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతాల్లోని వారు తీసుకుంటున్న ఫుడ్ తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తక్కువగా ఉన్నట్లు రీసెర్చర్లు వెల్లడించారు. వీరి పరిశోధన వివరాలు ఇటీవల ‘నేచర్ మెడిసిన్’ జర్నల్ లో పబ్లిష్​అయ్యాయి. 

టైప్ 1, టైప్ 2 అంటే..?

మన రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు అవసరమైన ఇన్సులిన్ హార్మోన్​ను క్లోమం ఉత్పత్తి చేస్తుంటుంది. క్లోమం నుంచి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే వచ్చే సమస్యను టైప్ 1 డయాబెటిస్ అని, ఇన్సులిన్ ఉత్పత్తి అయినా.. దానిని శరీరంలోని కణాలు స్వీకరించలేకపోతే వచ్చే సమస్యను టైప్ 2 డయాబెటిస్ అని అంటారు. వీటిలో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరమైన కారణాలతో, టైప్ 2 డయాబెటిస్ లైఫ్ స్టైల్ కు సంబంధించిన కారణాలతో వస్తాయి.