క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే.. అదుపులో బ్లడ్ షుగర్

క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే..  అదుపులో బ్లడ్ షుగర్

క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అలా కాకుండా ఒక్క పూటే కదా అని తినడం మానేశారో ఆ ఎఫెక్ట్​ ఆరోగ్యం మీద బాగా పడుతుంది. అందులోనూ టైప్ 2 డయాబెటిస్​ బారిన పడిన వాళ్లకు భోజనం మానడం అనేది అస్సలంటే అస్సలు మంచిది కాదు. డయాబెటిక్స్​కే కాదు ఎవరికైనా సరే భోజనం మానేయడం అనేది అంత మంచిది కాదు. డయాబెటిక్​ ఉన్న వాళ్లు భోజనం మానితే రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ‘‘సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్​ తింటే– అది గ్లూకోజ్​ లేదా బ్లడ్​ షుగర్​ను రోజు మొత్తంలో రెగ్యులర్​ ఇంటర్వెల్స్​లో బ్రేక్​ చేస్తుంటుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్​ లెవల్స్​లో​ హెచ్చు తగ్గులు ఉండవు. అలాగే వాడుతున్న మందులు కూడా బాగా పనిచేస్తాయి. బ్లడ్​ షుగర్​ను సరిగా ఉంచాలి, ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే క్రమం తప్పకుండా తినాలి. ఒకవేళ అలాకానీ తినలేదంటే ముఖ్యంగా ఆరు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి” అని హెచ్చరిస్తున్నారు వాషింగ్టన్​ డిసికి చెందిన న్యూట్రిషన్​ కన్సల్టెన్సీ ప్రాక్టీషనర్,​ హెల్త్​ కోచ్​ ఆండ్రియా.

‘‘మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు విపరీతమైన బిజీ, ఒత్తిడి ఉంటుంది. దాంతో బాగా అలసిపోతారు కూడా. ఇటువంటప్పుడు తిండి తినడం మానేస్తుంటారు. కానీ అలా తినకపోవడం వల్ల ఆ తరువాత ఎక్కువగా తినే అవకాశం ఉంది. అలా తినడం డయాబెటిస్​​ ఉన్న వాళ్లకు ఏ మాత్రం మంచిది కాదు. ఏ కారణం వల్ల అయితేనేం తినడం మానేస్తే ఆకలి పెరిగిపోతుంది. ఆ ఆకలి వల్ల క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్​ తింటారు. అదొక్కటే కాదు ఆకలి వెంటపడి తరుముతుంటే వండుకుని తినేంత ఓపిక ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే భోజనం స్కిప్​ చేయడం అనేది ఆరోగ్యానికి హానికరం. ఎంత బిజీ షెడ్యూల్​ ఉన్నా దొరికిన కాస్త  టైంలో ఎంతో కొంత తినాలి. ఒక గ్లాసు పాలు తాగొచ్చు లేదా పెరుగు తినొచ్చు. ఉడికించిన గుడ్డు లేదా 20 బాదం గింజలు తినొచ్చు”  అంటున్నారు డయాబెటిస్​లో​ స్పెషలైజేషన్​ చేసిన అడినా పియర్సన్.

 ఆకలితో ఉంటే కోపం వస్తుందనే విషయం తెలిసిందే. ఆకలి+కోపం ఈ రెండింటినీ కలిపి ‘హ్యాంగ్రీ’ అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఫుడ్​ ఎంచుకునేటప్పుడు ఒక పద్ధతి అంటూ ఉండదు. తినేది మంచిదా? కాదా? అనే విషయాన్ని పక్కకుపెట్టేసి కడుపు నింపడానికి ఏదైతేనేం అన్నట్టు తింటారు. సరైన పోషకాలు అందించకపోతే శరీరంలో పనిచేసేందుకు అవసరమైన శక్తి రాదు. దాంతో శక్తి అంతా పోతుంది. డయాబెటిస్​ ఉన్న వాళ్లే కాదు తిండి మానేస్తే ఎవరికైనా ఇదే జరుగుతుంది. అయితే ప్రత్యేకించి ఇన్సులిన్​ మీద ఉన్నవాళ్లు లేదా బ్లడ్​ షుగర్​ తగ్గించే మందులు వాడుతున్న వాళ్లు తిండి మానేస్తే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. బ్లడ్​ షుగర్​ను సమంగా ఉంచుకోవడమనేది డయాబెటిస్​ సంబంధిత సమస్యలు రాకుండా ఉంచేందుకు చాలా ముఖ్యం. అందుకే తినడం మానేయొద్దు. హెల్దీ శ్నాక్స్​తో శరీరానికి శక్తిని అందించాలి. “లీన్​ ప్రొటీన్​ అంటే గ్రిల్డ్​ స్కిన్​లెస్​ చికెన్​ బ్రెస్ట్, చేప లేదా నాన్​ స్టార్చీ వెజిటబుల్స్​ లేదా బ్రకోలి, కాలీఫ్లవర్​ వంటివి తినాలి. ఇవయితే వంట్లోకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్​ చేరకుండా పొట్ట నింపుతాయి. అలాకాకుండా కార్బోహైడ్రేట్​ ఎక్కువ ఉన్న రిఫైన్డ్​ గ్రెయిన్​, షుగర్స్​ ఉన్నతిండి తింటే రక్తంలో చక్కెర చాలా వేగంగా పెరుగుతుంది. ఆ వేగం ప్రొటీన్​ లేదా  నూనెలు తిన్న దానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు రీసెర్చర్లు.

డయాబెటిస్​ ఉన్నా లేకున్నా ​ గ్లూకోజ్​ను ఇంధనంగా వాడుకుంటుంది బ్రెయిన్. అందుకని తిండి తినడం​ స్కిప్​ చేస్తే బ్రెయిన్​ను ఆకలితో ఉంచినట్టే. దాంతో ఏకాగ్రత, ఆలోచించి చేసే పనుల్లో మీ పర్ఫార్మెన్స్​ తగ్గిపోతుంది. పోషకాలతో నిండిన బ్రేక్​ఫాస్ట్​ తిన్న డయాబెటిస్​ లేని ఉద్యోగులను బ్రేక్​ఫాస్ట్​ చేయని లేదా పోషకాలు లేని బ్రేక్​ఫాస్ట్​ తిన్న ఉద్యోగుల పనితీరుతో పోల్చి ఒక రీసెర్చి చేశారు. అందులో ఏం తేలిందంటే... పోషకాల బ్రేక్​ఫాస్ట్​ తిన్న వాళ్ల షార్ట్​ టర్మ్​ కాగ్నిటివ్​ ఫంక్షనింగ్ (ఆలోచన, రీజనింగ్​, జ్ఞాపకశక్తి, ఊహించుకోవడం​, కొత్త పదాలు నేర్చుకోవడం, భాష వాడడం)లో మెరుగుదల కనిపించింది.

అంతకుముందు రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉన్న ఫాస్టింగ్​ను బ్రేక్​ చేస్తుంది కాబట్టి బ్రేక్​ఫాస్ట్​ చేయడం అనేది చాలా ముఖ్యం. తినడం వల్ల చురుకుగా ఉండడమే కాదు బ్లడ్​ షుగర్​ మేనేజ్​మెంట్​ కూడా బాగుంటుంది. పాలకూర, ఆమ్లెట్​, చేప వంటివి డయాబెటిస్​ ఫ్రెండ్లీ బ్రేక్​ఫాస్ట్​ అని చెప్పొచ్చు. పళ్ల రసాలు మంచిదని చాలామంది పొద్దున్నే అవి తాగుతారు. వాటిని తాగకపోవడం మంచిది. వాటినిండా చక్కెర నిండి ఉంటుంది. బ్లడ్​ షుగర్​ను క్రమపరిచే పీచు పదార్థాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. దాన్ని  శరీరంలోకి
ఎలాగైనా పంపాల్సిందే.

తినకపోవడం వల్ల వచ్చే మరో ప్రధానమైన ఎఫెక్ట్​ బ్లడ్​ షుగర్​ లెవల్స్​ తగ్గిపోవడం. ఇది డయాబెటిస్​ ఉన్న వాళ్లకు చాలా ప్రమాదం. దీనివల్ల తలతిరగడం, వణుకు వంటివి వస్తాయి.  అలాగే ఎక్సర్​సైజ్​ చేస్తున్నప్పుడు శరీరంలోని​ కణాలకు గ్లూకోజ్​ ఆహారాన్ని అందిస్తుంది. అయితే ఫుడ్​ నుంచి శక్తి అందకపోతే శరీరంలో కొవ్వు కరిగి గ్లూకోజ్​ను తయారుచేస్తుంది. దాంతో కీటోన్​ అనే ఆమ్లం శరీరంలో చేరుతుంది. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కండరాలు బాగా అలసిపోతాయి. ఇందుకు కారణం శరీరానికి కావాల్సిన శక్తి అందకపోవడమే. ఈ ప్రాసెస్​నే కీటోసిస్​ అంటారు.

డయాబెటిస్​​ ఉన్నవాళ్లు తినడం స్కిప్​ చేయడం వల్ల ఫుడ్​ తినడానికి, ఇన్సులిన్​ ప్రొడక్షన్​కు మధ్య బ్యాలెన్స్​ మారిపోతుంది. దాంతో బ్లడ్ షుగర్​ లెవల్స్​ పడిపోతాయి. డయాబెటిస్​ ఉన్న వాళ్లలో ఇన్సులిన్​ వాడుతున్న లేదా బ్లడ్​ షుగర్​ తగ్గించే మందులు వాడుతున్న వాళ్లు తినకపోవడం అనేది చాలా ప్రమాదం. అలా చేస్తే బ్లడ్ షుగర్​ చాలా తగ్గిపోతుంది. సరిగ్గా తినలేదంటే షుగర్​ ఉన్న వాళ్లు వేసుకునే కొన్ని మెడిసిన్స్​ వల్ల హైపోగ్లైసీమియా రిస్క్​ ఉంటుంది. అలాగే వికారం, డయేరియా వంటి గ్యాస్ట్రోఇంటస్టైనల్​ సైడ్​ ఎఫెక్ట్స్​ కూడా వస్తాయి. మెడిసిన్​ వేసుకుంటున్నప్పుడు సరిగా తినకపోతే ఇంబాలెన్స్​ ఎఫెక్ట్​ ఉంటుంది. కొన్ని మందులకి తినడం తప్పనిసరి. అందుకే కొన్ని శ్నాక్స్​ ఎప్పుడూ పక్కన ఉండాలి. అవసరమైన పరిస్థితుల్లో అవి తిని మందులు వేసుకోవచ్చు.

జంతువుల మీద చేసిన స్టడీ ఏంచెప్తుందంటే...

శరీరంలోకి కాలరీలు చేరకుండా ఉండాలని తినడం స్కిప్​ చేస్తే ఇన్సులిన్​లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దాంతో బరువు తగ్గకపోగా గ్లూకోజ్​ వల్ల ఇంకా బరువు పెరుగుతారు. డయాబెటిస్​ ఉన్నవాళ్లు హెల్దీ వెయిట్​ మెయింటెయిన్​ చేయడమనేది చాలా ముఖ్యం. అధిక బరువు లేదా ఒబెసిటీ ఉంటే బ్లడ్​ షుగర్​ లెవల్స్​ను మేనేజ్​ చేయడం కష్టమవుతుంది. అంతేకాకుండా మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. అవి... హై బ్లడ్​ ప్రెషర్​, గుండె జబ్బులు, స్ట్రోక్​. ఎక్కువసార్లు తిండి తినడం మానేస్తుంటే కనుక మీ శరీరం ఆకలి లేదా తిండి సరిపోయిందనే ఫీలింగ్స్​ను అర్థం చేసుకోలేదని హెచ్చరిస్తున్నారు రీసెర్చర్లు. ఆకలి వేయడం లేదంటే మీ శరీరానికి రెగ్యులర్​ ఇంటర్వెల్స్​లో ఫుడ్​ అవసరం లేదని కాదు. ఆకలి అనేది పాజ్​ అయిందని. కానీ అది కాసేపు మాత్రమే. ఆ తరువాత ఆకలి విపరీతంగా అవుతుంది. దాంతో ఎక్కువ తింటారు. రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. ఒక మీల్​ స్కిప్​ చేశాక తినేటప్పుడు పోర్షన్​ కంట్రోల్​ అనేది చాలా ముఖ్యం. బాగా ఆకలిగా ఉన్నప్పుడు బ్రెయిన్​ ఎక్కువ కాలరీల ఫుడ్​ తినమని సిగ్నల్స్​ ఇస్తుంటుంది.

బ్లడ్​ షుగర్​ లెవల్స్ తగ్గించుకునేందుకు మందులు వాడుతుంటే శరీరానికి అవసరమైన తిండిని అంటే గ్లూకోజ్​ని అందించే కార్బోహైడ్రేట్స్​ అందించాలి. అలాకాని ఇవ్వకపోతే హైపో గ్లైసీమియా స్థితికి చేరుకుంటారు. హైపో గ్లైసీమియా లేదా లో బ్లడ్ షుగర్​ వల్ల కళ్లు తిరగడం, వణుకు, చూపు మసకబారడం, తలనొప్పి, గందరగోళంగా ఉండడం, వర్కవుట్​ చేసేటప్పుడు వికారం వంటివి ఉంటాయి. ఈ స్థితిని పట్టించుకోకపోతే  హైపో గ్లైసీమియాకి చేరతారు. ఇది ప్రాణానికే ప్రమాదం. అందుకే బ్లడ్​ షుగర్​ తగ్గకుండా ఉండాలంటే వర్కవుట్​కి ముందు కొంచెం తినాలి. అరటి పండు లేదా ఫ్రూట్​ బార్​ లాంటివి తినొచ్చు. తిన్న గంట తరువాత వర్కవుట్​ చేస్తే అది బ్లడ్​ షుగర్​ను స్థిరంగా ఉంచుతుంది. మంచి శక్తి ఇస్తుంది. ఇలాంటప్పుడు వర్కవుట్​ కోసం అదనంగా ఫుడ్​ తినాల్సిన అవసరం ఉండదు.