విశ్వాసం : ప్రజాపరిపాలన అంటే..

విశ్వాసం : ప్రజాపరిపాలన అంటే..

ప్రజాపరిపాలకులనే పదం ప్రతిరోజూ వింటూనే ఉంటాం. ఆ పదానికి అర్థం... ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించేవాడు అని. ప్రజలను పరిపాలించటానికి సింహాసనం లేదా పీఠం అలంకరించేవాడని అర్థం. 

పరిపాలన అనే పదానికి ‘చక్కగా కాపాడుట’ అనే అర్ధాన్ని నిఘంటువు చెప్తోంది. ప్రజల కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని తొలగించటానికి నడుం బిగించినవాడు పరిపాలకుడు. అటువంటి పరిపాలకులలో మొట్టమొదటివాడు త్రేతాయుగంలో అవతరించిన శ్రీరామచంద్రుడు. తన ప్రజలను సుభిక్షంగా పరిపాలించినవాడు శ్రీరాముడు. అందుకే ఎవరైనా పరిపాలన సక్రమంగా చేస్తుంటే ‘రామరాజ్యం’ అనటం స్థిరపడింది. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం నిర్ణయించినప్పుడు... ఆ విషయాన్ని రామునికి తెలియపరుస్తారు. అప్పుడు శ్రీరామచంద్రుడు తన తల్లి కౌసల్య దగ్గరకు వచ్చి, ‘అమ్మా! నేను యువరాజుని అవుతున్నాను’ అని దర్పంగా చెప్పకుండా, ‘నన్ను ప్రజాపాలన కోసం, ప్రజలకు సేవచేయడానికి నియమించారు’(ప్రజాపాలన కర్మణి) అని వినయంగా పలికాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. 

తన తమ్ముడితో కూడా, ‘తమ్ముడూ నేను ప్రజల యోగక్షేమాలు చూడటానికే నియోగింపబడ్డాను’ అంటూ తన కర్తవ్యాన్ని తెలియపరిచాడు. అందుకే రాముని పరిపాలనలో దారిద్య్రం, చోరబాధ, ఆకలి మరణాలు వంటి ఏ కష్టమూ లేకుండా ప్రజలు సుఖశాంతులతో విలసిల్లారని రామాయణం చెప్తోంది. ఇన్నిటితో పాటు రాముడు ఆచరించిన నీతినియమాలను ప్రజలు అనుసరించినట్లు కూడా రామాయణంలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రాజు కాబోయే వాడికి ప్రజల కష్టాలు తెలియాలి. అందుకే పట్టాభిషేకానికి ముందు రోజు శ్రీరాముడు నేల మీద పరున్నాడు, ఆప్తులు, బంధువులు, స్నేహితులతో ... ఎవ్వరితో మాట్లాడలేదు. ఆహారం తీసుకోలేదు. అదీ రాజుకి ఉండవలసిన లక్షణమని రామాయణం చెప్తోంది.

శ్రీకృష్ణదేవరాయల విషయానికి వస్తే...

తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలును పరీక్షించాలనుకున్నాడు. ముందు రోజు రకరకాలుగా ప్రలోభ పెట్టాడు. అన్నిటినీ అధిగమించాడు రాయలు. చివరగా ఒక్క చెంప దెబ్బ కొట్టాడు అప్పాజీ. ‘మీరు మాకు గురువులు, పితృ సమానులు’ అంటూ ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పటికే రాయలవారి నడవడికను ఎరిగి ఉన్నాడు అప్పాజీ. కానీ పట్టాభిషిక్తుడు కాబోతున్నాడని తెలిశాక ఏ విధంగా స్పందిస్తాడోనని పరీక్షించాడు తిమ్మరుసు. ఆ సందర్భంలో తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలుతో ‘‘నాయనా! నీకు ప్రజల ఆకలిబాధలు తెలియాలి. వారికి నివసించడానికి నీడ ఉందో లేదో తెలుసుకోవాలి. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయో లేదో గ్రహించాలి. మరీ ముఖ్యంగా సింహాసనం అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. అనునిత్యం శత్రువులు మనకు చెంపపెట్టుగా నిలుస్తారు. అన్నీ ఎరిగి, సక్రమంగా పరిపాలించాలి’ అని బోధించాడు. 

తిమ్మరుసు చెప్పిన మాటలను అనుసరించి శ్రీకృష్ణదేవరాయలు కూడా ముందు రోజు రాత్రి నేల మీద ఏకాంతంగా నిద్రించాడు. ఉపవాస దీక్ష అనుసరించాడు. అందుకే ఆయన పరిపాలనను స్వర్ణయుగంగా చరిత్రకారులు అక్షరీకరించారు.శ్రీరాముడు, శ్రీకృష్ణదేవరాలు వంటి రాజులు సక్రమంగా పరిపాలించటం వల్లనే సకాలంలో వానలు పడి, పంటలు పండి, ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరొక్క విషయం – అశోకచక్రవర్తి గురించి ఇక్కడ తప్పక స్మరించుకోవాలి. అశోకుడు తన ప్రజల సౌకర్యార్థం సామ్రాజ్యమంతా వీధులకి ఇరువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించాడు. సత్రాలు కట్టించాడు. మనుషులకు, పశు పక్ష్యాదులకు వైద్య శాలలు నిర్మించాడు. అశోకుడి దార్శనికతకు ఇది నిదర్శనం. దూరాలకు ప్రయాణించేవారికి మార్గ మధ్యంలో ఏవేవి అవసరమో గుర్తించి, వాటిని నిర్మించి, ముందు తరాలకు ఆదర్శంగా నిలిచాడు. 

రావణుడి విషయానికి వస్తే...

లంకానగర ప్రజలందరికీ సకల సౌకర్యాలు కలిగించాడు. సౌకర్యాలు కాకుండా విలాసాలు కూడా ఏర్పాటుచేశాడు. దానితో ప్రజలంతా ఆ విలాసాలకు బానిసలై ధర్మ వ్యతిరేకంగా జీవించటం అలవాటు చేసుకున్నారు. (అందుకే విలాసాలు కల్పించరాదని గ్రహించాలి)ఎంతోమంది సుందర నారీమణులు రావణుడిని కోరి వరించారు. కానీ రావణుడి బుద్ధి వక్రించి, అధర్మంగా సీతను అపహరించి లంకకు తెచ్చి, లంకా నాశనానికి కారకుడయ్యాడు. 

రాముడికి వశిష్ఠుడు, శ్రీకృష్ణదేవరాయలకు తిమ్మరుసు మంచి మాటలు చెప్పారు. వాటిని ఆ ఇద్దరూ అనుసరించారు. కానీ రావణుడు మాత్రం విభీషణుడు చెప్పిన మంచి మాటలను వినకపోవడంతో... రావణుడితో పాటు లంకా నగరవాసులు మరణించారు. రాజు చేసిన తప్పొప్పులకు ప్రజలు బాధ్యులు కావటం తెలిసిందే. అందుకే పరిపాలకుడు సక్రమంగా ఉండాలి అని చెప్తూ ‘యథా రాజా తథా ప్రజా’ అనే నానుడిని పండితులు పలుకుతున్నారు.

డా. వైజయంతి పురాణపండ
ఫోన్​: 80085 51232