ఈ రెస్టారెంట్ లో ఆర్డర్ చేస్తే.. ట్రైన్ లో టేబుల్ పైకి ఐటమ్స్ వస్తాయి

ఈ రెస్టారెంట్ లో ఆర్డర్ చేస్తే..  ట్రైన్ లో టేబుల్ పైకి ఐటమ్స్ వస్తాయి
చికుబుకు చికుబుకు రైలే.. అదిరెను దీని టేస్టే ‘అటెన్షన్​ ప్లీజ్​. ఆర్డర్​ చేసిన ఫ్యామిలీ ప్యాక్​ బిర్యానీ ఏడో నంబరు టేబుల్​ మీదికి వస్తున్నది. రాంగనే తీసుకోండి. అటెమ్మటి ఎనిమిదో నంబరు టేబుల్​ మీదికి వస్తది. వేడి వేడి ఇడ్లీలు అందుకోనీకి రెడీగా ఉండండి’ అంటూ చెఫ్​ కేక వేసిండు. ఈ వంటమనిషి ఎన్నడో రైల్వే జాబ్​ చేసి మానేసినట్టున్నడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వేడివేడి రుచుల గురించి ఆయన అనౌన్స్​మెంట్స్​ అన్నీ రైల్వే స్టేషన్​లో విన్న మాటల్లెక్కనే ఉంటయ్! ఎందుకంటే ఆ హోటలే ఓ రైల్వే స్టేషన్​. ప్రతి టేబుల్​ ఒక ప్లాట్​ఫామ్​. అన్ని ప్లాట్​ఫామ్స్​ తిరుగుతూ ఆర్డర్​ చేసిన వాటిని బోగీల్లో మోసుకుపోతది సప్లయర్​​ ట్రైన్. ఇందూరు విందులో రైల్​ రెస్టారెంట్​ వడ్డిస్తున్న రుచులారగించి ‘చికుబుకు చికుబుకు రైలే..అదిరెను దీని టేస్టే’ అని జనం మస్త్​గ పాడుకుంటున్నరు! నిజామాబాద్​ సిటీ వినాయక నగర్​లో నెల కిందనే ఒక రెస్టారెంట్​ స్టార్ట్​ అయింది.  ‘జంక్షన్‌–– 65’.ఈ రెస్టారెంట్​లో ఆర్డర్​ చేసిన ఐటమ్స్​ని టేబుల్​ మీదకు తేవడానికి వెయిటర్స్​ ఉండరు. కానీ, అడిగింది అర నిమిషం ఆలస్యం కాకుండా తెచ్చిస్తుంది ఓ బుల్లి రైలు. కిచెన్​లో రెడీ అయిన వేడి వేడి ఫుడ్​ ఐటమ్స్​ని చకచకా టేబుల్స్​ పైకి చేరుస్తుంది. రైలు లెక్కనే ఈ చిన్న రైలు కూడా వస్తుంది. సరే, మరి రైళ్లు అప్పుడప్పుడూ ఆగకుండా పోతయి, కదలకుండా ఉంటయి. ‘ఇది కూడా అట్లనే చేస్తదా’ అని డౌట్​రావొచ్చు. కానీ ఇది అట్ల ఆగదు. ఎందుకంటే ఈ రైల్​ రెస్టారెంట్స్​లో ఉన్న పది టేబుళ్ల మీదకు పోవడానికి ట్రాక్​ ఉంది. ఆ ట్రాక్​లన్నీ తిరుగుతూ పోదు. ఏ టేబుల్​ మీద ఆర్డరిస్తే ఆ టేబుల్​ మీదకు పోతుంది. ఇట్లా దానిని మానిటరింగ్​ చేయడానికి కంప్యూటర్​తో కనెక్ట్​ చేస్తారు. కస్టమర్స్​ ఆర్డర్​ ఇచ్చినప్పుడు ఫుడ్​ ఐటమ్స్​తోపాటు టేబుల్​ నెంబరు కూడా ఎంటర్​చేస్తారు. గ్రీన్​ సిగ్నల్​పడగానే రుచుల రైలు పరుగందుకుంటుంది. ఆవురావురుమంటూ ఎదురుచూసే కస్టమర్స్​కి రుచులెన్నో వడ్డిస్తూ మళ్లీ జంక్షన్​ (కిచెన్​)కి చేరుకుంటుంది. ఆర్డర్స్​ లిస్ట్​ చెక్​ చేసి టేస్టీ ఫుడ్​ లోడ్​ చేయగానే మేనేజర్​ పచ్చజెండా ఊపేస్తాడు. రుచుల రైలు మళ్లీ పరుగుతీస్తుంది. ఇట్ల పొద్దున మొదలైన ప్రయాణం మాపటిదాకా చడీచప్పుడు లేకుండా నడుస్తూనే ఉంటుంది. రెండు వందల రకాల డిష్​లను ఈ రైలు వడ్డిస్తుంది. వీటిల్లో బిర్యానీ ఆర్డర్లే ఎక్కువట! కొత్త ఒక వింత కదా! ఆ వింతైన విందును ఆరగించడానికి జనం ఎగబడుతున్నారట! ఈ ఇచ్ఛంత్రం చూస్తేనే కొంతమందికి ఆకలి తీరిపోతుందట! 50 మందికి సరిపోయే సీటింగ్​ కెపాసిటీ ఉన్న ‘జంక్షన్​ – 65’ రెస్టారెంట్​ డిసెంబరు 10 నుంచి నాన్​స్టాప్​గా నడుస్తూనే ఉంది. మళ్లీ మళ్లీ విందుకు హోటల్​ మేనేజ్​మెంట్​లో సక్సెస్​ కావాలంటే చాలా కష్టపడాలి. ఎంతో కాలం కష్టపడితేనే మంచి పేరొస్తుంది. పేరు వచ్చేంత వరకు నష్టాలొచ్చినా భరించాలి. కానీ జంక్షన్​ – 65 ఓనర్స్​కి ఆ ప్రాబ్లమ్​ లేదు. అనుభవం లేకున్నా క్రియేటివిటీ వాళ్లకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 60 లక్షల రూపాయల పెట్టుబడితో స్టార్ట్​ చేసిన ఈ రెస్టారెంట్​కి కోట్లు పెట్టినా రాని బ్రాండ్​ ఇమేజ్​ ఉందిప్పుడు. జెయింట్​ వీల్​ మీద తిరగాలని పిలగాండ్లు ఆశపడితే జాతరకి తీసుకుపోయినట్లు ఇందూరు జనం రైల్​ రెస్టారెంట్​ చూపించాలని ఫ్యామిలీ అంతా కలిసిపోతున్నారు. ఆర్డర్ చేసిన ఐటమ్స్​ ట్రెయిన్​లో టేబుల్​ దాకా రావడం చాలా బాగుంది. ఇది చూసి ఎంజాయ్​ చేస్తామంటే పిల్లలను ‘జంక్షన్​ -– 65’కి తీసుకొచ్చింది పూజ. కస్టమర్స్​లో పిల్లలే ఎక్కువ మంది ఉంటున్నారని హోటల్​​ ఓనర్లలో ఒకరైన కార్తీక్ చెప్తున్నాడు. ఈటింగ్​, ఔటింగ్​, ఎంటర్​టైన్​మెంట్​లా ఉందని వాళ్లు ముచ్చటపడుతున్నారు. ‘ఐడియా బాగుంది. టేస్ట్​ బాగుంది. ఈ హోటల్​కి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది’ అని కస్టమర్​ సారిక చెప్పింది. ‘జంక్షన్​ – 65’లో రెండు రైళ్లున్నాయి. ఇవి పది ప్లాట్​ఫామ్స్​ (టేబుళ్ల)పైకి తిరుగుతూ ఫుడ్​ని సర్వ్​ చేస్తుంటాయి. ఈ  రైలు రెండున్నర కేజీల బరువుని మోస్తుంది.  ఈ ట్రైన్స్​తోపాటు వాటిని ఆపరేట్​ చేసే టెక్నాలజీ కోసం మొత్తం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కస్టమర్స్​ సంతృప్తే మా సక్సెస్​ ఇంజినీరింగ్​ అయిపోయాక బిజినెస్​ మేనేజ్​మెంట్​ చదివాను. చదువుకునేటప్పుడు విజయవాడలో ఫ్రెండ్స్​తో కలిసి ఒక థీమ్ రెస్టారెంట్​కి వెళ్లాను. ఆ ఫీలింగ్​ మరచిపోలేనిది. చదువు అయిపోయింది. ఉద్యోగం కంటే బిజినెస్​ బెస్ట్​ అనుకున్నాను. ఇప్పుడు బయట తినే కల్చర్​ పెరుగుతోంది. కాబట్టి హోటల్​ మేనేజ్​మెంట్​ బెస్ట్ అనుకున్నాను. యూ ట్యూబ్​లో ఈ రైల్​ రెస్టారెంట్​ని ఓసారి చూశాను. ఇది మన దగ్గర ట్రై చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. నాన్న రఘుతో చెప్పాను. ఆయన ఎంకరేజ్​చేశారు. మా అన్న కార్తీక్​ బాగా సపోర్ట్​ చేసిండు. యూ ట్యూబ్​లోనే దీని గురించి స్టడీ చేశాను. కావాల్సిన వాటిని సమకూర్చుకుని రెస్టారెంట్​ సెటప్​ చేసేసరికి 60 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ బిజినెస్​లో సక్సెస్​ అవుతానా? లేదా? అనే డౌట్​ లేకుండా నిజామాబాద్​ జనం నన్ను ఆశీర్వదించారు.-సిద్ధార్థ పెండెం, ‘జంక్షన్​ – 65 ’ ఓనర్​. ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్