కామెంట్లు పెట్టి, షేర్ చేస్తే..రూ. 1,500

కామెంట్లు పెట్టి, షేర్ చేస్తే..రూ. 1,500
  • సోషల్ మీడియా వారియర్స్​కు రోజువారీగా పార్టీల చెల్లింపులు 
  • ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్‌‌లలో పోస్టులు, షేర్​లు, లైకులు,కామెంట్లు చేయడమే పని  
  • ప్రధాన పార్టీలకు మూడు, నాలుగు టీమ్స్​తో వెయ్యి మందికి పైగా సోషల్​ వారియర్స్ 
  • తమ పార్టీకి మంచి కామెంట్స్.. ప్రత్యర్థులకు నెగెటివ్ కామెంట్స్​ 

పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియా టీమ్స్​ ఏర్పాటు చేసుకొని పోస్టులను షేర్, కామెంట్ చేయిస్తున్నాయి. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.1,500 చెల్లిస్తున్నాయి.

హైదరాబాద్, వెలుగు:పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాలోనూ​ఎలక్షన్ వార్ ను పెంచాయి. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గాల్లో స్పెషల్ టీమ్స్​ను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు రెడీ చేసి వదులుతున్నాయి. ఇమేజ్​లు, వీడియోల రూపంలో పార్టీ క్యాడర్ కు షేర్​ చేస్తూ.. నిమిషాల వ్యవధిలోనే జనాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. ఓ వైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తాము చేసిన పనులను  ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు తమను విమర్శించే వారి నుంచి డిఫెన్స్ కు తగిన చర్యలు చేపడుతున్నారు. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌‌, బీజేపీ పార్టీలు కూడా ప్రత్యేకంగా సోషల్‌‌ మీడియా కార్యకర్తలను నియమించుకుని సోషల్ వార్‌‌ చేస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒక్క బీఆర్​ఎస్ పార్టీకే 500 మంది మెయిన్ సోషల్ మీడియా వారియర్స్ పనిచేస్తున్నారు. కాంగ్రెస్​కు 250 మంది, బీజేపీకి 200 మంది దాకా ఉన్నారు. వీరు కాకుండా కిందిస్థాయిలో పనిచేస్తున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆయా పార్టీలు తాము ఏర్పాటు చేసుకుంటున్న సోషల్‌‌ మీడియా గ్రూపుల్లో చేరేలా క్యాడర్ లోని యువతకు ఆఫర్లు ఇస్తున్నారు. పార్టీ కోసం ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో మంచి ప్రతిఫలం ఉంటుందని ఆశ చూపుతున్నారు.   

పోటాపోటీగా సోషల్ వార్ 

సోషల్ మీడియా వార్ రూమ్స్​పై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, కవితతో పాటు ముఖ్య లీడర్లు, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రసంగాలు, స్టేట్​మెంట్లను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాటిని పబ్లిక్ లోకి తీసుకెళ్లేలా ఇమేజ్​లు, వీడియోలు రెడీ చేసి క్యాడర్​కు షేర్ చేస్తున్నారు. కౌంటర్లు ఏమైనా వస్తే వాటికి ప్రతీగా మరొక కౌంటర్​ను కూడా రెడీ చేసి పంపుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే ఫీడ్ ను రాష్ట్రస్థాయిలో అవసరం అనుకుంటే వాడుతున్నారు. ఇతర పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూనే.. బీఆర్ఎస్ పథకాలు ప్రచారం చేస్తున్నారు. 

రోజువారీ క్యాంపెయిన్, జనాలను కలుస్తున్న తీరు, ఓటర్ల అభిప్రాయాలను కూడా వాట్సాప్, ఫేస్​బుక్, ట్విట్టర్, యూట్యూబ్​ చానళ్లలో పెడుతున్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెడుతూ పార్టీ దిశానిర్దేశం చేస్తున్నది. సోషల్ మీడియా ప్రచారంపై మంత్రి కేటీఆర్, హరీశ్​రావు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే, బీఆర్‌‌ఎస్‌‌ స్కీములు, డెవలప్​మెంట్ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుండగా.. సంక్షేమ పథకాల్లోని లొసుగులను ఎత్తి చూపుతూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 

బీజేపీ ప్రధానంగా కేంద్రంలోని మోదీ సర్కారు అభివృద్ధి పనుల గురించి వివరిస్తూనే బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక వీడియోలను షేర్ చేస్తూ.. కర్నాటక మోడల్ తో మంచి ఫలితాలు అంటూ ఆ విషయాన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్తోంది.

తిండి.. టికానా అంతా వాళ్లదే

నెల, రెండు నెలల కోసం పార్టీలు సోషల్ మీడియా టీమ్స్​ను ఏర్పాటు చేసుకున్నాయి. వీడియో ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లలో ఎక్కువ మందికి పోస్టులు చేరేలా ఎక్స్ పర్ట్స్​ను పెట్టుకున్నారు. వీరితో పాటు వందలాది మందిని మొబైల్ ఫోన్​లతో ఎప్పటికప్పుడు పార్టీ, క్యాడర్ గ్రూప్​లలో పోస్టులను షేర్ చేయిస్తున్నారు. టీం హెడ్ నుంచి ఒక పోస్టు వస్తే వెంటనే దానిని షేర్ చేసి, కామెంట్ చేయడమే మిగతా వాళ్ల పనిగా ఉంటోంది. పార్టీకి సంబంధించి ఏదైనా లైవ్​ టెలికాస్ట్ అవుతుంటే లైక్​లు కొట్టడంతో పాటు పాజిటివ్ కామెంట్స్ రాయాలి. 

ప్రత్యర్థి పార్టీకి సంబంధించినవి అయితే నెగెటివ్​ కామెంట్స్​పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు చేస్తే.. రోజుకు రూ.1,500 చెల్లిస్తున్నారు. ఇక వీడియో ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్, డిజైనర్స్ వంటి ప్రొఫెషనల్స్​కు ప్రత్యేకంగా ప్యాకేజీలు మాట్లాడుకున్నారు. వారికి వసతి, భోజనం, టీ, స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొందరిని ఫోన్​లలోనే మేనేజ్ చేసి పని చేయించుకుంటున్నారు. పోస్టులు ఎక్కడి నుంచి చేస్తున్నారనేది తెలియకుండా వీపీఎన్​లు సైతం వినియోగిస్తున్నారు. 

ఇతర దేశాల నుంచి పోస్టులు చేస్తున్నట్లూ కలరింగ్ ఇస్తున్నారు. వీపీఎన్ లు వాడుతుండటంతో ఏదైనా అభ్యంతకర కామెంట్స్, వీడియోలు, ఇమేజ్​లు షేర్ చేసినా దొరకకుండా పార్టీల సోషల్ మీడియా టీమ్స్ పని చేస్తున్నాయి.