అదేపనిగా ఇయర్ ఫోన్లు వాడితే..చెవులు పోతయ్

అదేపనిగా ఇయర్ ఫోన్లు వాడితే..చెవులు పోతయ్
  • డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక
  • ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది హియరింగ్ రిస్క్​లో ఉన్నారని వెల్లడి

టెక్నాలజీ వల్ల మన లైఫ్​ ఈజీగా మారిందన్న విషయంలో సందేహం లేదు. అయితే అదేపనిగా టెక్నాలజీపై ఆధారపడితే సమస్యలూ ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఇయర్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. అదే సమయంలో వినికిడి సమస్యలు కూడా పెరుగుతున్నాయని వరల్డ్  హెల్త్  ఆర్గనైజేషన్  (డబ్ల్యూహెచ్ వో) రిపోర్టు హెచ్చరించింది. సౌండ్​ఎక్కువ పెట్టుకొని తరచూ ఇయర్ ఫోన్లు వాడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది హియరింగ్  లాస్ (వినికిడి కోల్పోయే ప్రమాదం)  రిస్క్ లో ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. మ్యూజిక్  వినేందుకు 35 ఏండ్లలోపు ఉన్న వారు ఎక్కువగా ఇయర్ ఫోన్లు వాడుతున్నారని, వారిలో 50 శాతం మంది సౌండ్  ఎక్కువగా పెట్టుకొని  వింటున్నారని తెలిపింది. ఇయర్ ఫోన్లు ఉపయోగించేటపుడు భవిష్యత్తులో హియరింగ్  లాస్  రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రిస్క్ ను ఇలా తగ్గించవచ్చు

సాధారణంగా 60 డెసిబుల్స్  లోపు సౌండ్  వింటే చెవులకు ఎలాంటి నష్టం లేదు. అయితే 85 డెసిబుల్స్ కు మించి అదేపనిగా సౌండ్ కు ఎక్స్ పోజ్​  అయితే హియరింగ్  లాస్ కు దారితీయవచ్చు. కాబట్టి ఇయర్ ఫోన్లు వంటి డివైజెస్  వాడేటపుడు సౌండ్  వాల్యూమ్ ను సగం వరకు తగ్గించి వినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

హెడ్ ఫోన్లు ఇంకా బెటర్

ఇయర్ ఫోన్ల కన్నా హెడ్ ఫోన్లు వాడితే  మంచిది. ‘‘ఇయర్ ఫోన్లను చెవి లోపలికి పుష్  చేయాల్సి ఉంటుంది. అదే హెడ్ ఫోన్లు అయితే అవి చెవి బయటే ఉండిపోతాయి. అంతేకాకుండా చెవిలోని ఇయర్  కెనాల్ లో కర్ణభేరికి, హెడ్ ఫోన్ కు మధ్య కొంత గ్యాప్  ఉంటుంది. కాబట్టి హెడ్ ఫోన్లతో రిస్క్  చాలా తక్కువ” అని ఎక్స్ పర్ట్స్  తెలిపారు. 

మధ్యమధ్యలో బ్రేక్  తీసుకోవాలి

ఇయర్ ఫోన్  అయినా హెడ్ ఫోన్  అయినా గట్టిగా సౌండ్  పెట్టి గ్యాప్  ఇవ్వకుండా వింటే చెవులకు కోలుకోలేని డ్యామేజ్ జరుగుతుంది. అందువల్ల చెవులు రిలాక్స్  అయ్యేందుకు మధ్యమధ్యలో కాసేపు బ్రేక్  ఇవ్వాలి. ప్రతి 30 నిమిషాలకు ఐదు నిమిషాల బ్రేక్ ఇవ్వడం మంచిది. లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల బ్రేక్  ఇవ్వాలి. 

ఒకరివి మరొకరు వాడొద్దు

కొంత మంది ఇయర్ ఫోన్లను షేర్  చేసుకుంటుంటారు. ఒకరు వాడినవి మరొకరు వాడొద్దు. ఎందుకంటే అవతలి వారిలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే, వారు వాడిన ఇయర్ ఫోన్లను మరొకరు వాడితే వారికీ ఇన్ఫెక్షన్  సోకే ప్రమాదం ఉంది. మరొకరి ఇయర్ ఫోన్స్  వాడాల్సి వస్తే సానిటైజ్  చేసి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇయర్ ఫోన్లతో చెవులకు డ్యామేజ్ ఇలా..

కర్ణభేరి నుంచి హియరింగ్  బోన్స్ కు, అక్కడి నుంచి లోపలి చెవికి సౌండ్ పాస్ అవుతుంటుంది. తర్వాత కాక్లియా (సౌండ్ వైబ్రేషన్స్ కు స్పందనగా నర్వ్ ఇంపలెల్స్ ను ఉత్పత్తి చేసేది) కు సౌండ్  వైబ్రేట్ అవుతుంది. ఈ కాక్లియాలో ఫ్లూయిడ్, భారీ సంఖ్యలో చిన్నచిన్న వెంట్రుకలు ఉంటాయి. కంపనాలు కాక్లియాకు చేరినపుడు, అందులో ఉన్న ఫ్లూయిడ్  వైబ్రేట్ అయి వెంట్రుకలను కదిలిస్తుంది. సౌండ్  ఎంత బిగ్గరగా ఉంటే, వైబ్రేషన్స్  అంత బలంగా ఉంటాయి. అపుడు వెంట్రుకలు కూడా భారీ సంఖ్యలో కదులుతాయి. దీర్ఘకాలం పాటు ఎక్కువ సౌండ్  పెట్టి ఇయర్ ఫోన్స్ వాడితే.. సౌండ్  వైబ్రేషన్లకు స్పందించే సెన్సిటివిటీని హెయిర్  సెల్స్‌‌‌‌‌‌‌‌ కోల్పోతాయి. దీంతో హెయిర్  సెల్స్  బెండ్ కావడం లేదా ముడుచుకుపోవడం జరుగుతుంది. దీంతో తాత్కాలికంగా హియరింగ్  లాస్ వస్తుంది. ఎక్కువ కాలం గట్టిగా సౌండ్ పెట్టి వింటే, చెవుల్లోని వినికిడి కణాలు దెబ్బతిని శాశ్వతంగా హియరింగ్  లాస్  వచ్చే ప్రమాదం ఉందని ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో ఈఎన్​టీ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్​  ప్రొఫెసర్  డాక్టర్  భవికావర్మ భట్ హెచ్చరిస్తున్నారు. వినికిడి కణాలు ఒక్కసారి దెబ్బతింటే, వాటిని రీజనరేట్ చేయలేమని ఆమె తెలిపారు.