కశ్మీర్ ఫైల్స్పై ఇఫ్ఫీ జ్యూరీ హెడ్ కామెంట్స్..సారీ చెప్పిన ఇజ్రాయెల్ రాయబారి

కశ్మీర్ ఫైల్స్పై ఇఫ్ఫీ జ్యూరీ హెడ్ కామెంట్స్..సారీ చెప్పిన ఇజ్రాయెల్ రాయబారి

కాశ్మీర్ ఫైల్స్ మూవీ వల్గర్ సినిమా అంటూ ఇఫ్ఫీ జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కశ్మీర్ ఫైల్స్ మూవీని ఒక వల్గర్, ప్రాపగాండ సినిమా అంటూ నదవ్ లపిడ్ విమర్శలు గుప్పించారు.  ‘‘53వ ఫిలిం ఫెస్టివల్ లో ఉండాల్సిన సినిమా కాదు. ఆర్టిస్టిక్ కేటగిరిలో ఇలాంటి సినిమా చూసి షాక్ అయ్యాం. ఈ మాటని బహిరంగంగా చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. ఇది ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా’’ అంటూ మండిపడ్డారు.

నదవ్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిపై స్పందించిన జ్యూరీ బోర్డు..అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది. దీనిపై బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సినిమాలపై బోర్డు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోదు. ఒకవేళ జ్యూరీ సభ్యులెవరైనా అలా చేస్తే.. అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది.

ఈ అంశంపై కాశ్మీర్ ఫైల్స్లో నటించిన అనుపమ్ ఖేర్ స్పందించాడు. అబద్దం ఎంత పెద్దగా ఉన్నా, నిజం ముందు అది చాలా చిన్నగానే ఉంటుందని ట్వీట్ చేశాడు. అదేవిధంగా ఈ అంశంపై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం ట్వీట్ చేశారు. నిజం అత్యంత ప్రమాదకరమైన విషయమని..ఇది ప్రజలను అబద్ధం చేయగలదు అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు ఇజ్రాయోల్ రాయబారి నౌర్ గిలాన్ కూడా నదవ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ ద్వారా కేంద్రానికి క్షమాపణలు చెప్పారు. జడ్జిల ప్యానెల్కు హెడ్గా భారత్ ఆహ్వానాన్ని లపిడ్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ‘‘ చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటికి గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్‌ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నా’’ అని అన్నారు.  ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న రెండు దేశాల సారూప్యాన్ని కూడా లపిడ్ గుర్తించలేకపోయారని విమర్శించారు. 

ఈ ఏడాది మార్చి 11న ఈ మూవీ రిలీజైంది. 1990ల్లో కశ్మీర్‌లో జరిగిన పండిట్‌ల ఊచకోత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. దేశంలో ఈ సినిమా సంచలనం సృష్టించింది. 340 కోట్లు కలెక్ట్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.