కరోనా టెస్టుకు ఇండియన్ కిట్..డెవ్ లప్ చేసిన IICT

కరోనా టెస్టుకు ఇండియన్ కిట్..డెవ్ లప్ చేసిన IICT

హైదరాబాద్, వెలుగు: కరోనా నిర్ధారణకు హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కొత్త కిట్ ను డెవలప్ చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టీ పీసీఆర్ టెస్టు కిట్ ను రూపొందించింది. జినోమిక్స్ బయోటెక్​ కంపెనీతో కలిసి దీన్ని తయారు చేసింది. తక్కువ ధరలోనే అందుబాటులోకి తెచ్చే విధంగా దేశీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం నమూనా కిట్లను రూపొందించగా, ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​మెడికల్ రీసెర్చ్​(ఐసీఎంఆర్) ఆమోదం లభిస్తే కిట్లు మార్కెట్ లోకి రానున్నాయి. ప్రస్తుతం కరోనా టెస్టు కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి ఐసీఎంఆర్ అప్రూవల్ లభిస్తే జినోమిక్స్ బయోటెక్ కిట్ల తయారీని ప్రారంభించనుంది. ఇవి అందుబాటులోకి వస్తే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు.

మల్టీపర్పస్ కిట్లు…

ఐఐసీటీ రూపొందించిన కిట్లను కేవలం కరోనా నిర్ధారణకే కాకుండా అనేక రకాల వైరస్ నిర్ధారణ టెస్టులకూ వినియోగించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. మలేరియా, క్యాన్సర్ తదితర వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి జంతువులు, మొక్కల్లోనూ వ్యాధుల నిర్ధారణకు వాడుకోవచ్చంటున్నారు. ఈ కిట్లను ఆప్టిమైజ్ చేయడంతో పాటు కిట్లలో రీయేజెంట్లుగా ఉపయోగపడే వివిధ రకాల ఎంజైములను ఐఐసీటీ తయారు చేసింది. ఈ టెక్నాలజీని వినియోగించి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ కిట్లను తయారు చేయొచ్చని సైంటిస్టులు పేర్కొంటున్నారు.