ఆ కారు పుట్టుక వెనక ఉన్నది ఒక సాధారణ మెకానిక్​

ఆ కారు పుట్టుక వెనక ఉన్నది ఒక సాధారణ మెకానిక్​

బిలియనీర్స్​​, పొలిటీషియన్స్​, సినిమా స్టార్స్​, స్పోర్ట్స్​ స్టార్స్​...  ఒక్కరేమిటి? కోటీశ్వరులు అందరూ తమ గ్యారేజ్​లో కచ్చితంగా ఉండాలనుకునే కారు.. లాంబోగినీ.  చూడగానే ‘వావ్​’ అనిపించే డిజైన్​, సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్​ అందుకునే కెపాసిటీ, సూపర్​​ ఫీచర్స్​ ఉండే ఈ కారును సొంతం చేసుకోవడం ప్రెస్టేజ్​గా ఫీలవుతారు వాళ్లు. ప్రపంచంలోనే మొదటి సూపర్​కార్​గా పేరు పొందిన ‘లాంబోగినీ’కి అంత క్రేజ్​ ఉంది మరి. అలాంటి ​కారు పుట్టుక వెనక ఉన్నది ఒక సాధారణ మెకానిక్​. ఆయన పేరు ఫెరూసియో లాంబోగినీ. వెక్కిరింతలో గెలుపును వెతుక్కున్న ఆయన జీవితమే ఇది. 

ఇటలీలోని ఫెరార రాష్ట్రంలో ఉన్న సెంటో అనే ఊళ్లో ఏప్రిల్​ 28, 1916లో పుట్టాడు ఫెరూసియో లాంబోగినీ. తల్లిదండ్రులు ఆంటోనియో, ఎవ్లినా. వీళ్లకు మొత్తం ఐదుగురు కొడుకులు. వాళ్లలో పెద్దవాడు ఫెరూసియో. 

మెకానిక్​ కావాలనుకొని..

ఫెరూసియో తండ్రి రైతు. ఊళ్లో తమకున్న పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఎక్కువగా ద్రాక్ష పండించేవాడు. కొడుకును కూడా తనలాగే రైతును చేద్దామనుకున్నాడు. కానీ, ఫెరూసియోకు మెషిన్స్​, వెహికల్స్​ అంటే చాలా ఇష్టం. పొలం పనుల కోసం తండ్రి తెచ్చిన ట్రాక్టర్​ మీదే ఎప్పుడూ ధ్యాస ఉండేది. అది పాడైతే రిపేర్​ ఎలా చేస్తున్నారో గమనించేవాడు. కొన్ని రోజులకు సొంతంగా రిపేర్ నేర్చుకున్నాడు. హైస్కూలు చదువు పూర్తయ్యాక దగ్గరలోని బొలొగ్నా టౌన్​లో టెక్నికల్​ కోర్స్​(ఐటీఐ)లో చేరాడు. కోర్సు అయిపోయాక ఆ ఊళ్లోనే ఒక మెకానిక్​ షాప్​లో చేరాడు.  అన్ని రకాల వెహికల్స్​ రిపేర్​ చేయడంపై పట్టుసాధించాడు. 

యుద్ధంలో ఖైదీగా చిక్కి.. 

రెండో ప్రపంచయుద్ధం 1939లో మొదలైంది. అప్పుడు జర్మనీవైపు ఉండేది ఇటలీ. ఫెరూసియోకు మంచి మెకానిక్​గా పేరు రావడంతో ఇష్టం లేకపోయినా మిలిటరీలో చేరాల్సి వచ్చింది. ఇటాలియన్​ రాయల్​ ఎయిర్​ఫోర్స్​లోని 50వ మోటార్​ ఫ్లీట్​లో మెకానిక్​గా పంపించారు. ఇది రోడ్స్ ఐలాండ్​లో ఉండేది. యుద్ధంలో దెబ్బతిన్న వెహికల్స్​ రిపేర్​ చేసేవాడు. అక్కడ వివిధ రకాల ట్రాక్టర్​లతోపాటు డీజిల్​ ట్రక్కులు, వార్​ ట్యాంకర్ల నుంచి ఎయిర్​క్రాఫ్ట్​ల వరకు అన్నింటి రిపేర్​ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అయితే, యుద్ధంలో ఇటలీ ఓడిపోవడంతో బ్రిటీష్​ సైన్యం ఫెరూసియోను బందీగా తీసుకెళ్లి జైలులో పెట్టింది. అక్కడ ఖైదీగా ఉంటూనే బ్రిటిష్​ సైనికుల వెహికల్స్​ను రిపేర్​ చేస్తూ వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు.    

ట్రాక్టర్ల తయారీ

జైలు నుంచి విడుదలయ్యాక సొంతూరికి చేరుకున్నాడు ఫెరూసియో. తండ్రి సాయంతో చిన్న మెకానిక్​ షాప్​ పెట్టాడు. మరోవైపు.. అప్పటికే యుద్ధంలో బాగా దెబ్బతిన్న ఇటలీ తిరిగి కోలుకోవడం కోసం పరిశ్రమల్ని డెవలప్​ చేయాలనుకుంది. ఇండస్ట్రీస్​ పెట్టేవాళ్లకు కావాల్సిన సాయం చేసింది. ఆ అవకాశం అందిపుచ్చుకున్నాడు ఫెరాసియో. ట్రాక్టర్ల తయారీ కంపెనీ పెట్టాడు. యుద్ధంలో పాడైపోయి వృథాగా ఉన్న వెహికల్స్​లోని పార్ట్స్​తో ట్రాక్టర్లు తయారుచేయడం మొదలుపెట్టాడు. మొదట ఆ ట్రాక్టర్లను ఊళ్లో పేద రైతులకు చాలా తక్కువ ధరకు అమ్మాడు. ఆ ట్రాక్టర్లకు బాగా పేరు రావడంతో డిమాండ్​ పెరిగింది. ఆ తర్వాత తమ పొలంలోని కొంత భాగంలో ‘లాంబోగినీ’ పేరుతో ట్రాక్టర్ల తయారీ కంపెనీ పెట్టాడు. అక్కడ తయారైన ట్రాక్టర్లు ఇటలీ అంతటా చాలా ఎక్కువగా అమ్ముడుపోయాయి. కొన్నిరోజుల్లోనే ఇటలీలోని ధనవంతుల్లో ఒకడిగా మారాడు ఫెరూసియో. 
మలుపుతిప్పిన ఎగతాళి
ఇటలీలోని ఫెరారీ కంపెనీ అప్పటికే కార్ల తయారీలో ఫేమస్​. ఆ కంపెనీలో తయారైన ఒక కారును1958లో కొన్నాడు ఫెరూసియో. అయితే, దాని క్లచ్​ సరిగా ఉండేది కాదు. దానివల్ల చాలాసార్లు కారు దారి మధ్యలోనే ఆగిపోయేది. ఆ సమస్యను సరిచేయమంటూ మూడు, నాలుగుసార్లు ఫెరారీ ఫ్యాక్టరీకి కారును తీసుకెళ్లాడు. అక్కడ రిపేర్​ చేసినప్పటికీ మళ్లీ అదే ప్రాబ్లమ్​ వచ్చేది. దాంతో క్లచ్​ సమస్య గురించి ఫెరారీ కంపెనీకి లెటర్లు రాశాడు. అయితే, రిప్లయ్​ రాకపోవడంతో దగ్గరలోని మార్నెల్లో అనే విలేజ్​లో ఉన్న ఫెరారీ ఛైర్మన్​ ఎంజో ఫెరారీ ఇంటికి వెళ్లాడు. ఎంజోను కలిసి క్లచ్​ సమస్య గురించి చెప్పాడు. కానీ, దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఎంజో. ట్రాక్టర్లు తయారుచేసేవాళ్లకు​ కార్ల గురించి ఏమి తెలుసంటూ వెక్కిరించాడు. ‘నువ్వొక రైతువి. ట్రాక్టర్​ డ్రైవర్​వి. నువ్వు నా కార్ల గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే అవి ప్రపంచంలోనే బెస్ట్​ కార్లు’ అంటూ ఎగతాళి చేశాడు. ఆ మాటలతో బాధపడ్డాడు ఫెరూసియో. ఫెరారీ కార్ల కంటే బెస్ట్ అనిపించే స్పోర్ట్స్​ కార్లు తయారుచేస్తానని ఎంజోతో ఛాలెంజ్​ చేశాడు. 

ఫస్ట్​ సూపర్​కార్​

ఎంజోతో సవాల్​ చేసి వచ్చాక సూపర్​కార్​ తయారుచేసేందుకు రెడీ అయ్యాడు ఫెరూసియో. ‘సాంటాగ్టా బొలొగ్నస్​’ టౌన్​లో కార్ల తయారీకి అవసరమైన ఫ్యాక్టరీ పెట్టాడు. అక్టోబర్​ 30, 1963లో ‘ఫెరూసియో లాంబోగినీ ఆటోమొబిలి’ పేరుతో కంపెనీ పెట్టాడు. అక్కడ రకరకాల ప్రయోగాల తర్వాత ‘లాంబోగినీ మియుర’ అనే సూపర్​కార్​ తయారైంది. దీన్ని తయారుచేయడంలో ‘ఫ్రాంకో స్కోగ్లోన్​’ అనే ఇంజినీరు కూడా సాయపడ్డాడు. ఈ సూపర్​కార్​1966లో మార్కెట్​లోకి వచ్చింది. ఇది సూపర్​ సక్సెస్​ అయింది. అప్పట్నుంచి సూపర్​కార్స్​(స్పోర్ట్స్​ కార్స్​)కు లాంబోగినీ కేరాఫ్​ అయింది. ఆదాయం కూడా బాగా పెరిగింది. 

దెబ్బతీసిన ప్రత్యర్థులు

పోటీ కంపెనీల కుట్రతో లాంబోగినీకి కొన్నేండ్లకే చిక్కులు మొదలయ్యాయి. కంపెనీకి ముడిసరుకు ఆగిపోయింది. ఆర్డర్లు క్యాన్సిల్​ అయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకునేందుకు మొదట కంపెనీలో 51శాతం వాటాను స్నేహితుడైన స్విస్​ బిజినెస్​మాన్​ జార్జెస్​–హెన్రీ రొసెట్టికి అమ్మాడు ఫెరూసియో.  ఆ తర్వాత మిగిలిన 49శాతాన్ని రొసెట్టి స్నేహితుడికి అమ్మేశాడు. ఆ తర్వాత అనేక చేతులు మారిన లాంబోగినీ ఇప్పుడు ‘వోక్స్​వాగన్​ గ్రూప్’ చేతిలో ఉంది.

కంపెనీని అమ్మేశాక ‘ఉంబ్రియా’ అనే ఊరికి చేరాడు ఫెరూసియో. అక్కడ వందల ఎకరాల భూమి కొని మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టాడు. ద్రాక్షతోపాటు రకరకాల పంటలు పండించాడు. ‘లాంబోగినీ వైన్స్’ తయారుచేసి అమ్మేవాడు.740 ఎకరాల్లో కట్టిన ‘లా ఫియోరిటా’ ఫామ్​హౌస్​లో జీవితాంతం సంతోషంగా గడిపాడు. ఫిబ్రవరి 20, 1993లో గుండెపోటుతో చనిపోయాడు. లాంబోగినీ మూడు పెండ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు ఉన్నారు.