బాసర ట్రిపుల్ ​ఐటీలో మళ్లీ ఆందోళనలు

బాసర ట్రిపుల్ ​ఐటీలో మళ్లీ ఆందోళనలు

 

  • డిన్నర్ బాయ్ కాట్ చేసిన స్టూడెంట్లు.. మెస్ వద్ద బైఠాయింపు
  • మెస్ కాంట్రాక్టులు రద్దు చేస్తామని చెప్పి పట్టించుకోలేదని ఆరోపణ
  • పుడ్ శాంపిల్స్ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నలు
  • ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు.. మెస్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ

భైంసా/బాసర, వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. శనివారం సాయంత్రం నుంచి ఆందోళనకు దిగిన 3 వేల మం ది విద్యార్థులు రాత్రి డిన్నర్‌‌‌‌‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్ చేసి నిరసన చేపట్టారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్‌‌‌‌జీసీ)తో జరిగిన చర్చలకు అనుగుణంగా ఆఫీసర్లు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా ఆకస్మిక ఆందోళనకు దిగారు. ట్రిపుల్​ఐటీలో ఫుడ్ పాయిజన్ సంఘటన తర్వాత 3మెస్‌‌‌‌ల కాంట్రాక్టులను ఈనెల 20లోగా రద్దు చేస్తామని స్వయంగా వీసీ ఇచ్చిన హామీ నెరవేరలేదని, మెస్‌‌‌‌లో ఉపయోగించే వంట పదార్థాలన్నీ నిర్ణీత ప్రమాణాల ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా విని యోగిస్తున్నారని తప్పుపట్టారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. మెస్ మేనెజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఇచ్చిన షోకాజ్​ నోటీసులపై వివరణ ఇచ్చారా, లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని, ఫుడ్ పాయిజన్‌‌‌‌కు కారణమైన ఆహారం నమూనాలను పరీక్షించిన తర్వాత వచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఈ నెల 24 నాటికి మెస్‌‌‌‌ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. శనివారం రాత్రి 9 గంటల దాకా విద్యార్థులు భోజనం చేయలేదు. తమ డిమాండ్లు పరిష్కరించాలని పట్టుబట్టారు.

దిగొచ్చిన సర్కారు.. టెండర్లకు పిలుపు
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల నిరసనతో సర్కారు దిగొచ్చింది. కొత్తగా మెస్‌‌‌‌ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. 8,684 మందికి సరిపడా మెస్‌‌‌‌లను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న కేటరింగ్ సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్​జేయూకేటీ డైరెక్టర్ సతీశ్ సూచించారు. ఆగస్టు 6 వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని, ఏడాది కాలం పాటు ఒప్పందం కొనసాగుతుందని తెలిపారు.

ఆందోళన కొనసాగుతది: స్టూడెంట్లు
అధికారులు స్వయంగా వచ్చి ఫుడ్ పాయిజన్‌‌‌‌కు కారణమైన మెస్‌‌‌‌ కాంట్రాక్టులను రద్దు చేసి, కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్టూడెంట్స్ స్పష్టం చేశారు. అప్పటిదాకా కాలేజీలో భోజనం చేయబోమని ఈ1, ఈ2 విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు.