బీచ్లో దూకి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

బీచ్లో దూకి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లో అదృశ్య మైన ఐఐటీ విద్యార్ధి కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో  కార్తీక్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కార్తీక్ అదృశ్యం అయినా..ఎక్కడో  ఓ చోట ఉంటాడని భావించిన తల్లిదండ్రులకు శవమై కనిపించడంతో కన్నీరుముున్నీరుగా విలపిస్తున్నారు. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు  చెందిన కార్తీక్..హైదరాబాద్ ఐఐటిలో బీటెక్  సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అతను  జులై 17న క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి  రాలేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాలో  తల్లిదండ్రులు నివసిస్తున్నారు. అయితే రెగ్యులర్గా కార్తీక్ కు ఫోన్ చేసే తల్లిదండ్రులు ఆ రోజు కార్తీక్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన  తల్లిదండ్రులు.. జులై 19న ఐఐటీ క్యాంపస్‌కు వచ్చారు. అక్కడ  కార్తీక్‌ లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా కంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఫోన్ సిగ్నల్ ఆధారంగా కార్తీక్ విశాఖపట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.  జులై 20వ తేదీ ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి సాయంత్రానికి విశాఖ చేరుకున్నట్లు గుర్తించారు. శేరిలింగం పల్లి రైల్వే స్టేషన్‌లో కార్తీక్‌ను చివరి సారి గుర్తించారు. 

స్థానిక పోలీస్ సిబ్బందిని వెంట బెట్టుకుని తల్లితండ్రులు కూడా విశాఖకు వెళ్లారు.  పలుమార్లు కార్తీక్ ఫోన్ లోకేషన్‌ను గుర్తించినా వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుండటంతో అచూకీ కనిపెట్టలేకపోయారు. పగలు అప్పుడప్పుడు మొబైల్ ఆన్ చేసి తండ్రి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆహారం కొనుక్కుని బిల్ కట్టి వెంటనే ఫోన్ ఆఫ్ చేస్తున్నాడు. అయితే కార్తీక్‌ మొబైల్ ట్రాక్ చేసున్న సంగారెడ్డి పోలీసులు.. అతను బిల్ కడుతున్న బేకరీ, రెస్టారెంట్ లకు వెళ్తున్నా ..అక్కడ నుంచి వెంటనే అదృశ్యం అవుతున్నాడు. సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తులో ఒక్కో ప్రాంతంలో వెతికినా..అక్కడ నుంచి కొద్ది నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. దీంతో  కార్తీక్ విశాఖపట్నంలో..  ప్రాణాలతోనే ఉన్నాడని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బేకరి షాప్, ఉడా పార్క్ వద్ద సంచరించినట్లు సిసి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు లభించాయి. బీచ్ రోడ్డులో కూడా కార్తీక్ తిరిగినట్టు ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత దువ్వాడలో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్ళే లోపు వెళ్ళిపోయాడు.   ఈ నేపథ్యంలో వారం రోజులుగా కార్తీక్‌ ఆచూకీ కోసం గాలించిన పోలీసులకు..జులై 25వ తేదీ మంగళవారం ఉదయం అతని  మృతదేహం లభించింది.