- రాష్ట్రంలో ఐదు లక్షల టన్నులకు చేరువైన కొనుగోళ్లు
- 4,900కి పైగా సెంటర్లలో 55 వేల మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ
- రైతుల ఖాతాల్లో రూ.160.54 కోట్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఐదు లక్షల టన్నులకు చేరువయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 8,409 సెంటర్లు ప్రారంభించాలని సివిల్ సప్లై శాఖ నిర్ణయించగా ఇప్పటికే 4,903కి పైగా సెంటర్లను ఓపెన్ చేశారు. ముందస్తు కోతలు మొదలైన నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మెదక్ తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఈ నెల ప్రారంభంలో కొనుగోళ్లను ప్రారంభించిన సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ఇప్పటివరకు 55 వేల మంది రైతుల నుంచి 4.89 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసింది.
ఇందులో 2.73 లక్షల టన్నులు సన్నధాన్యం కాగా, మరో 2.16 లక్షల టన్నుల దొడ్డు వడ్లను సేకరించింది. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే రూ.160.54 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. కొనుగోళ్లు ముందుగా ప్రారంభమైన నిజామాబాద్‌లో అత్యధికంగా 2.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. నల్గొండ జిల్లాలో 1.32 లక్షల టన్నులు, సూర్యాపేట జిల్లాలో 59 వేల టన్నుల కొనుగోళ్లు జరిగాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో 64.11 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఈ నేపథ్యంలో 1.43 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 90 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కాగా, ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రంలో 52 లక్షల టన్నుల వడ్ల సేకరణకు కేంద్రం అనుమతించింది.

