
కాగజ్ నగర్, వెలుగు: తమకు ఉపాధి కోసం, ఆఫీస్ కార్యకలాపాలకు 20 ఏండ్ల క్రితం కేటాయించిన భవనంలో లైబ్రరీ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ మహిళలు, వీవో సంఘాల నాయకులు మెయిన్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. కౌటాల మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కనున్న ఓ భవనాన్ని గతంలో ఐకేపీకి కేటాయించగా అందులో ఆఫీస్ కొనసాగింది. కొత్త భవనం నిర్మించడంతో ఆఫీస్‌ను అక్కడకు మార్చారు. ప్రస్తుతం పాత భవనం ఖాళీగానే ఉంది. ఇటీవల మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని రాష్ట్ర చైర్మన్‌తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే హరీశ్ బాబు సరైన వసతులు లేనందున ఖాళీగా ఉన్న ఐకేపీ భవనంలోకి మార్చాలని అధికారులకు సూచించారు.
మంగళవారం ఆ భవనంలోకి వెళ్లి ఎమ్మెల్యే పరిశీలించారు. అయితే ఈ నిర్ణయంపై ఐకేపీ మహిళలు మండిపడ్డారు. తమ అధీనంలో ఉన్న భవనంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిం చారు. గేటు తాళాలను పగులగొట్టి లోపలకు ప్రవేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఆఫీస్ భవనం ముందు బైఠాయించి, ఆ తర్వాత మెయిన్ రోడ్డుపై ఆందోళన చేశారు.
ఎమ్మెల్సీ విఠల్ చొరవతో శాంతించిన మహిళలు
ఐకేపీ మహిళల ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్ ఎంపీడీవో బుద్ధె రమేశ్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఐకేపీ భవనం మహిళా సంఘం ఆధీనంలోనే ఉంచాలని, ఇతరులకు కేటాయించొద్దని చెప్పడంతో కలెక్టర్ సరేనని చెప్పారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.