మట్టి, ఇసుక దేన్నీ వదలట్లే.. పెరిగిపోతున్న ఇల్లీగల్ దందాలు

మట్టి, ఇసుక  దేన్నీ వదలట్లే.. పెరిగిపోతున్న ఇల్లీగల్  దందాలు

మహబూబ్​నగర్, వెలుగు: రూలింగ్  పార్టీ లీడర్లకు ధన దాహం తీరడం లేదు. కొండలు, గుట్టలు..  చెరువులు.. వాగులు ఇలా దేన్నీ వదలడం లేదు. కంకర క్రషర్ల కోసం కొండలను, మొరం కోసం గుట్టలను కరిగిస్తున్నారు. ఇసుక కోసం వాగులను, ఒండ్రు కోసం చెరువులను చెరబడుతున్నారు. అనుమతులు ఉన్నా.. లేకున్నా అడ్డగోలు తవ్వకాలతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. 

మొరం, ఎర్రమట్టి కోసం గుట్టలు ఖల్లాస్..

జిల్లాలోని చిన్నచింతకుంట, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, పాలమూరు, భూత్పూర్​ ప్రాంతాల్లో గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. పాలమూరు, భూత్పూర్​ ప్రాంతాల్లో రియల్​ఎస్టేట్​ వెంచర్ల డెవలప్​మెంట్​ కోసం, ఇతర ప్రాంతాల్లో రోడ్డు పనులకు మొరం, ఎర్రమట్టి కాంట్రాక్టర్లకు అవసరం అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న  కొందరు రూలింగ్ పార్టీ లీడర్లు, నియోజకవర్గ లీడర్ల అండతో గుట్టలను ఖల్లాస్​ చేస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా మొరం, ఎర్ర మట్టిని తరలించుకుపోతున్నారు. కొన్ని చోట్ల సంబంధిత శాఖ నుంచి రెండు, మూడు ట్రిప్పులకు అనుమతులు తీసుకొని నెలలుగా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. ఉదాహరణకు అడ్డాకుల మండలంలోని ఓ గ్రామంలో రోడ్డు పనుల కోసం మూసాపేట మండలంలోని ఒక గుట్టను తవ్వేందుకు అనుమతి తీసుకున్నారు. 

కానీ, రోడ్డు పనులకు మట్టిని తరలించడంతో పాటు, ఎన్​హెచ్​-44 పక్కనే ఉన్న రియల్​ వెంచర్​కు పెద్ద మొత్తంలో ఎర్రమట్టిని తరలించారనే ఆరోపణలున్నాయి. భూత్పూర్​ మండలం సిద్దాయపల్లి వద్ద ఉన్న ఎర్రమట్టి గుట్ట మట్టిని ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఏడాదిగా తరలించుకుపోతూనే ఉన్నారు. బాలానగర్​ మండలంలోని మోతీనగర్, పెద్దాయపల్లి, గౌతాపూర్​ ప్రాంతాల్లో చిన్నచిన్న మట్టి గుట్టలను సైతం తవ్వేసి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. మహబూబ్​నగర్​, బాలానగర్​, చిన్నచింతకుంట, అడ్డాకుల ప్రాంతాల్లో కొండలను స్టోన్​ క్రషర్ల కోసం ఆఫీసర్లు అనుమతులు ఇస్తున్నారు. కొన్నింటిని అనుమతులు లేకుండానే నడిపిస్తున్నా, ఆఫీసర్లు తనిఖీలు చేయడం లేదు. అయితే, ఈ దందాల వెనుక రూలింగ్​ పార్టీకి చెందిన నియోజకవర్గ లీడర్లు చక్రం తిప్పుతుండడంతో ఆఫీసర్లు సైతం స్పాట్​కు వెళ్లి తనిఖీలు చేసేందుకు వెనకాడుతున్నారని అంటున్నారు

వాగులు ఖాళీ.. 

జిల్లాలోని ఊకచెట్టువాగు, దుందుభి వాగు, పెద్దవాగు, మీనాంభరం, రంగారెడ్డిపల్లి వాగులు ప్రధానమైనవి. ఈ వాగుల పొంటి ఉన్న అడ్డాకుల, మూసాపేట, గండీడ్, మహమ్మదాబాద్, దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, నవాబ్​పేట మండలాల్లోని  బండ్రవల్లి, లాల్​కోట, గుడిబండ, పోల్కంపల్లి, పళ్లమర్రి, ముచ్చింతల, అప్పంపల్లి, వడ్డేమాన్, మద్దూరు, అల్లీపూర్, కొమిరెడ్డిపల్లి, పేరూరు, వర్నే, ముత్యాలంపల్లి, లోకిరేవు, చౌటపల్లి, ఇప్పటూరు, కారూరు, సల్కార్​పేట్, మంగంపేట్, అన్నారెడ్డిపల్లి, ధర్మాపూర్,  సింగందొడ్డి, దోనూరు, పస్పుల, వాడ్యాల, మున్ననూరు, మిడ్జిల్, అయ్యవారిపల్లి, వెలుగొముల, చిల్వేర్, కొత్తూరు ప్రాంతాల్లో గ్రామ స్థాయి లీడర్ల నుంచి మండల స్థాయి లీడర్ల వరకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. వీరందరికీ నియోజకవర్గ స్థాయి లీడర్ల అండ ఉండడంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు చెబుతున్న వారికి వార్నింగులు ఇస్తున్నారు. 

అడ్డుకోవద్దని ఆదేశాలు..

ఇటీవల మహబూబ్​నగర్​ నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో పెద్ద మొత్తంలో రెవెన్యూ ఆఫీసర్లు ఇసుక డంప్​లను స్వాధీనం చేసుకొని, ఓ ఆఫీస్​ ఆవరణలో డంప్​ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్థాయి లీడర్లు ఆఫీస్​ వద్దకు చేరుకొని 'మీరు మా మాట వినాలి. మీరు మాకు సహకరించకుంటే ఎట్లా? మా లీడర్​కు ఫోన్​ చేసి చెబుతాం' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికితోడు గ్రామాల్లో ఇసుక డంపులను సీజ్​ చేస్తున్న ఆఫీసర్లకు అటు వైపు వెళ్లొద్దని నియోజకవర్గాల లీడర్ల నుంచి ఫోన్లు వస్తుండడంతో వారు సైలెంట్​ అవుతున్నారు.

విచారణ చేయిస్తాం..

భూత్పూర్​ మున్సిపాల్టీలోని ఒకటో వార్డు పరిధిలోని నల్లగుట్ట నుంచి మొరం తరలిస్తున్నట్లు మాకు ఎవరూ కంప్లైంట్​ చేయలేదు. మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. శుక్రవారం రెవెన్యూ సిబ్బందిని గుట్ట వద్దకు పంపించి విచారణ చేయిస్తాం.

- చెన్న కిష్టయ్య, తహసీల్దార్, భూత్పూర్​

వెహికల్స్​ సీజ్​ చేస్తాం..

పర్మిషన్లు లేకుండా ఎవరూ గుట్టల నుంచి మట్టి తోడరాదు. అక్రమంగా మట్టిని తవ్వితే చర్యలు తీసుకుంటాం. మట్టిని తరలిస్తున్న వాహనాలు సీజ్​ చేస్తాం. మైనింగ్​ డిపార్ట్​మెంట్​ పర్మిషన్​ తీసుకొని మట్టి తీసుకెళ్లాలి.

- శ్రీనివాస్​, తహసీల్దార్​, బాలానగర్​