సవాలుగా మారిన అక్రమ వలసలు

సవాలుగా మారిన అక్రమ వలసలు

అక్రమ వలస అంటే ఆ దేశ వలస చట్టాలను ఉల్లంఘించి ప్రజలు ఒక దేశంలోకి వలస వెళ్లడం లేదా చట్టబద్ధమైన హక్కు లేకుండా ఆ దేశంలో నిరంతరం నివసించడం. ఇది పేదల నుంచి ధనిక దేశాలకు ఆర్థికంగా వలస వెళ్లే ప్రక్రియ, దీనివల్ల వలసదారులు ఆర్థికంగా ప్రయోజనం  పొందుతారు.

 అక్రమ వలసల విధానం భారత దేశపు సార్వభౌమత్వానికి, సమాజ సమతుల్యతకు, ఎన్నికల నిష్పక్షపాతానికి శత్రువుగా మారుతోంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు,  డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్.. ఇవన్నీ భారత పౌరుడికి మాత్రమే కేటాయించాల్సిన గుర్తింపు పత్రాలు. కానీ, ఇవే ఇప్పుడు విదేశీ అక్రమ వలసదారుల చేతుల్లో ఉండటం తీవ్ర చ‌‌‌‌ర్చనీయాంశం. 

హైదరాబాద్‌‌‌‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఇది ఎంతటి భయంకరమైన ముప్పుగా మారిందో స్పష్టం చేస్తున్నాయి.  సౌదీ అరేబియాలో పనిచేసి వచ్చిన ఓ వ్యక్తి భారత పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ను కలిగి ఉన్నాడు. విచారణ జరిపిన తరువాత అతడు రోహింగ్యా వలసదారుడని తేలింది. 

మరోవ్యక్తి పాన్ కార్డు, ఆధార్, పాస్‌‌‌‌పోర్టుతో కలిసి తిరుగుతూ, శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసుల అదుపులోకి వచ్చాడు. అతడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని ఒప్పుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది సంఘటనలు నమోదవుతున్నాయి.

 విజయవాడ సమీపంలో ఇటీవల 15 మంది బంగ్లాదేశీ, రోహింగ్యా యువకులు పోలీసులకు పట్టుబడిన ఉదంతం, అక్రమ వలసలు ఎంత దూరం వెళ్ళాయో తెలుపుతుంది. లంచాలతో ప్రభుత్వ గుర్తింపు పత్రాలు పొందుతూ, చట్టాన్ని తుంగలో తొక్కుతూ, భారత పౌరుల్లాగా కలిసిపోతున్నారు. సామాన్య ప్రజల మధ్య కలసిపోయినవారు  ఉగ్రవాదులకు దారి చూపే గూఢచారులుగా మారే అవకాశాన్ని ఊహించడమే భయం కలిగించే విషయం.

రెండు కోట్ల పైనే!

‘రా’ మాజీ చీఫ్  సంజీవ్ త్రిపాఠీ పేర్కొన్నట్లుగా  అస్పష్టమైన చట్టాలు, అవినీతిగ్రస్తమైన విధానాల మూలంగా అక్రమ వలసల నిరోధంలో భారత వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోంది. భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల సంఖ్య సుమారుగా 2 కోట్లు ఉండొచ్చని అంచనా.

  రోహింగ్యాలు  అధికారికంగా 40,000 మంది, అనధికారికంగా, 75,000 మందికి దగ్గరగా ఉన్నారని ఓ అంచనా ఉంది. మే,  జూన్​  రెండు  నెలల్లో భారతదేశం 1,880 మంది అక్రమ వలసదారులను బహిష్కరించింది. 

పార్లమెంటు సమాచారం ప్రకారం..

2004లో  కేంద్రం రాజ్యసభకు ఇచ్చిన సమాచారం ప్రకారం, అప్పటికి 1.2 కోట్ల బంగ్లాదేశీ అక్రమ వలసదారులు దేశంలో ఉన్నారు. 2016లో కేంద్రం ప్రకటించిన అంచనాల ప్రకారం, బంగ్లాదేశీ వలసదారుల సంఖ్య 2 కోట్లకు చేరింది. మరో 75,000 మంది రోహింగ్యాలు దేశంలో దొంగచాటుగా నివసిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ అక్రమ వలసల ప్రభావం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపురా, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. అయితే ఇప్పటికీ ఆ సంఖ్యలు ఎంత పెరిగాయో ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు. వలసదారుల ఉనికి ఓటర్ల జాబితాలను కలుషితం చేస్తూ, ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తోంది. 

నైజీరియన్ల డ్రగ్స్​ వ్యాపారం

ఇంకో కోణంలో చూస్తే, వీసా గడువు ముగిసినా దేశం వదిలిపోనివారు  ముఖ్యంగా నైజీరియన్లు. డ్రగ్స్ మాఫియా కార్యకలాపాల్లో లీనమై మన యువతను విష బానిసలుగా మార్చుతున్నారు. ఇది ఆరోగ్యపరమైన, మానసికపరమైన ముప్పుగా పెరుగుతోంది. మత్తుపదార్థాల దందా, అక్రమ వలసలు కలిసిపోయి ఒక నిరంతర ముప్పుగా మారుతున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశానికి సార్వభౌమ దేశంగా అక్రమ వలసదారుల్ని బహిష్కరించే హక్కు ఉందని, భారత చట్టం ప్రకారం, విదేశీయులుగా తేలిన రోహింగ్యాలను బహిష్కరించాలని సుప్రీంకోర్టు మేలో తీర్పు ఇచ్చింది.  అక్రమంగా భారతదేశంలో నివాసముంటున్నవారిని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ‌‌‌‌రింత సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.  పాస్‌‌‌‌పోర్ట్, ఆధార్, ఓటర్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలి. 

 - సిద్ధగౌని సుద‌‌‌‌ర్శన్, సీనియర్ జర్నలిస్ట్-