- ఒక్కొక్కటిగా బయటకొస్తున్న భూబాగోతాలు
- పదేండ్ల భూఅక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
హైదరాబాద్, వెలుగు: అధికారం చేతిలో ఉన్నన్నాళ్లూ అంతా సవ్యంగానే జరుగుతున్నట్టు మభ్యపెడ్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో.. అధికారం కోల్పోయాక అసలు రంగు బయటపడుతున్నది. బీఆర్ఎస్పదేండ్ల పాలనలో జరిగిన భూఅక్రమాలను ఇప్పుడు ఆ పార్టీ నేతలే బయటపెడుతున్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడల్లా ఖండించిన నాయకులే.. ఇప్పుడు అంతర్గత విభేదాలతో ఒకరి చిట్టాను మరొకరు విప్పుకుంటున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల విషయంలో నాడు జరిగిన అక్రమ దందాలు.. ఇప్పుడు సొంత పార్టీ నేతల పరస్పర దూష ణలతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ఐడీపీఎల్ భూముల కేంద్రంగా మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానలా మారి, గులాబీ పార్టీ పునాదులను కదిలిస్తున్నదనే చర్చ మొదలైంది.
ఒకరిపై మరొకరు..
కొందరు బీఆర్ఎస్ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు వెనకేసుకున్నారని. ఐడీపీఎల్ వంటి ప్రభుత్వ స్థలాలను కూడా వదల్లేదని, పారి శ్రామిక అవసరాల కోసం ఉన్న భూములను అనుచరులతో కలిసి కబ్జా చేశారని, అక్కడ గోడౌన్లు, కమ ర్షియల్ కాంప్లెక్సులు నిర్మించి అక్రమంగా కోట్లు గడిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టార్గెట్‌గా చేసిన ఈ కామెంట్స్ ఆ పార్టీలో అగ్గిరాజేశాయి. కవిత వ్యాఖ్యలు కేవలం కృష్ణారావును మాత్రమే కాకుండా, హైదరాబాద్ పరిధిలోని ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పెట్టాయి. బీఆర్ఎస్పాలనలో హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా భూఅక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత కౌంటర్అటాక్కు దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో గతంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన భూ కబ్జాల వెనుక సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావు హస్తం ఉందని మాధవరం బాహాటంగానే ఆరోపించారు. ఇలా ఏండ్ల తరబడి కలిసి పనిచేసిన నేతలే.. ఇప్పుడు భూముల పంపకాల్లో తేడాలు రావడంతోనో లేదంటే ఆధిపత్య పోరులో భాగంగానో ఒకరి జాతకాలను మరొకరు బయటపెట్టుకుంటున్నారు.
ఇక కవిత వ్యాఖ్యలపై తాజాగా మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మా భూముల సంగతి సరే.. జాగృతి ముసుగులో నువ్వు చేసిన దందాల మాటేమిటి? లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకేనా ఈ డైవర్షన్ పాలిటిక్స్?’ అంటూ ప్రశ్పించారు. ‘ఐడీపీఎల్ భూముల జోలికొస్తే.. నీ బినామీల చిట్టా మొత్తం బయటపెడతాను’ అని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కవిత.. భూ అక్రమాలపై ఆధారాలతో సహా అన్ని వివరాలు తానూ బయటపెడ్తనంటూ చాలెంజ్చేశారు.
కవిత వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అక్రమాలపై ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్సెస్ కవిత’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పదేండ్లలో జరిగిన అక్రమాలను కవిత ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. కొందరు తన తండ్రి (కేసీఆర్) చెంత చేరి, ఆయనకు తెలియకుండానే అక్రమాలు చేశారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. మాధవరం కృష్ణారావు, కవిత మధ్య రగిలిన ఈ చిచ్చు.. ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆమె మరింత మంది ఎమ్మెల్యేల భూబాగోతాలను బయటపెడ్తారని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐడీపీఎల్ భూములతో పాటు ఇతర ఆక్రమణలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం లేకపోలేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

