నిబంధనలు పాటించరు.. నోటీసులకు భయపడరు

నిబంధనలు పాటించరు..  నోటీసులకు భయపడరు
  • ఇష్టారీతిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం
  • ధనార్జనే ధ్యేయంగా రోగులను దోచుకుంటున్న వైనం
  • అనుమతి లేకుండా విజిటింగ్ డాక్టర్స్​తో వైద్యం 
  • కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ దాడులు 
  • 12 హాస్పిటల్స్​కు నోటీసులు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు పాటించడం లేదు. అధికారుల నోటీసులను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్​అయిన కలెక్టర్ రాజర్షి షా.. జులైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను తనిఖీ చేయగా నిబంధనలు పాటించడం లేదని తేలింది. దీంతో సదరు హాస్పిటల్​కు రూ.20 వేల జరిమానా విధించారు. నిబంధనలు పట్టించుకోని ఆస్పత్రులపై కొరడా ఝుళిపిస్తున్నారు. నిత్యం తనిఖీలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేపట్టగా.. అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై నెల రోజులుగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 12 హాస్పిటల్స్​కు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.

అర్హత లేనివారితో లాబ్స్​, మెడికల్స్​

జిల్లా కేంద్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. వీటికి అనుబంధంగా నిబంధనలు పాటించకుండా డయాగ్నోస్టిక్స్, ల్యాబ్స్, మెడికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్, డయగ్నొస్టిక్ సెంటర్లున్నాయి. 

ఇందులో చాలా హాస్పిటల్స్ సరైన నిబంధనలు పాటించడం లేదు. వైద్యం పేరుతో వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నప్పటికీ సరైన సేవలు అందించడం లేదు. అర్హత లేనివారితో మెడికల్, లాబ్స్ నిర్వహిస్తున్నారు. డాక్టర్ల వివరాలు, చార్జెస్ బోర్డులు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ వ్యవస్థ, స్కానింగ్, డయాగ్నొస్టిక్ సర్వీసుల ప్రమాణాలు, రిజిస్టర్లు సరిగా మెయింటైన్ చేయడం లేదని తనిఖీల్లో వెల్లడవుతోంది. మెడికల్స్​ను ఫార్మసీ కోర్సులు చేసినవారే నిర్వహించాలి. కానీ అలా కాకుండా ఇంటర్, డిగ్రీ చదవిన వారిని నియమించుకుంటూ నిర్వహిస్తున్నారు. హాస్పిటల్స్ ఎదుట పార్కింగ్ స్థలం కనిపించడం లేదు. ప్రభుత్వ నోటీసులను సైతం పట్టించుకోవడం లేదు.

విజిటింగ్ డాక్టర్స్.. ఎవరొస్తున్నారో..

ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్​లో విజిటింగ్ డాక్టర్స్​తో వైద్యం చేయించడం ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్​లోని కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను ప్రతి ఆదివారం కొందరు, నెలకు రెండు సార్లు మరికొందరు తీసుకొస్తున్నారు. కార్డియాలజీ, న్యూరోలజిస్ట్ తదితర స్పెషలిస్టులతో ఓపీ నిర్వహిస్తున్నారు. టెస్టులు చేసి అవసరముంటే హైదరాబాద్ కు రావాలని చెబుతున్నారు. అయితే విజిటింగ్ డాక్టర్స్ పేర్లను వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

కానీ చాలా హాస్పిటల్స్​ను విజిట్​చేస్తున్న డాక్టర్ల పేర్లను రిజిస్టర్ చేయించుకోవడం లేదని స్పష్టమవుతోంది. విజిటింగ్ డాక్టర్ వస్తున్నారంటూ సోసల్ మీడియా, ఇతర వేదికల ద్వారా ప్రచారం సైతం చేసుకుంటున్నాయి. కానీ రిజిస్టర్ మాత్రం చేయించుకోవడం లేదు. ఇటీవల తనిఖీల్లో తాంసి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో ఇదే విషయం బహిర్గతమవగా కలెక్టర్​ సీరియస్​గా హెచ్చరించారు. 

గత నెలలో భుక్తాపూర్​లోని నక్షత్ర హాస్పిటల్ ను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. హాస్పిటల్ యాజమాన్యం నిబంధనలు పాటించడం లేదని తేలింది. విజిటింగ్ డాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం, చార్జ్ షీట్, మెడికల్, ల్యాబ్ నిర్వహణపై సీరియస్ అయ్యారు. నోటీసులు జారీ చేసి రూ.20 వేల జరిమానా విధించారు.

ఇటీవల శివాజీ చౌక్​లోని ప్రైవేట్ క్లినిక్​లో ఆయుర్వేద డాక్టర్ అలోపతి వైద్యం చేయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. 

ఈనెల 5న వైద్యారోగ్యశాఖ అధికారుల బృంధం జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని శివ ప్రియ నర్సింగ్ హోమ్, సుజాత నర్సింగ్ హోమ్​కు నోటీసులు అందజేశారు.