అభివృద్ధి మాటున రియల్ దందా

అభివృద్ధి మాటున రియల్ దందా
  • కొండగట్టు పరిసర వ్యవసాయ భూములపై రియల్ మాఫియా కన్ను
  • మల్యాల, కొడిమ్యాల మండలాల్లో అక్రమంగా వెంచర్లు 
  • పర్మిషన్లు లేకుండానే  ఓపెన్ ప్లాట్లుగా మార్చుతున్న వైనం 
  • చోద్యం చూస్తున్న ఆఫీసర్లు 

జగిత్యాల, వెలుగు :  ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మల్యాల మండలం ముత్యంపేట, దిగువ కొండగట్టు, కొడిమ్యాల మండలం నాచుపెల్లి, అప్పారావుపేట, దొంగలమర్రి ప్రాంతాల్లో ఎలాంటి పర్మిషన్లు లేకుండానే వెంచర్లు చేసి అమ్ముతున్నారు. దీంతో ఈ గ్రామాల్లో వ్యవసాయ భూములు ఓపెన్‌‌ ప్లాట్లుగా మారుతున్నాయి. ఏకంగా హద్దు రాళ్లను సైతం ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. రియల్‌‌ దందా వెనుక కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఉండడంతోపాటు కొందరు అధికారులకు రూ.లక్షల్లో ముట్టజెపుతుండడంతో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. 

రూల్స్ పాటించరు

రూల్స్ ప్రకారం జీపీ పరిధిలో లే అవుట్ ఏర్పాటు చేయాలంటే నాలా కన్వర్షన్స్‌‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ భూమి లో 10 శాతం కమ్యూనిటీ అవసరాల కోసం సదరు జీపీ పేరిట రిజిస్ట్రర్‌‌‌‌ చేసి, 33 ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాలి. అప్పుడే డీటీసీపీ పర్మిషన్లు మంజూరవుతాయి. ఇందుకు అనుగుణంగా మంజూరైన లే అవుట్ ప్లాట్లనే అమ్మాలి. అప్పుడే కొనుగోలుదారులకు భవిష్యత్‌‌లో ఎలాంటి లీగల్ ఇష్యూస్‌‌ రావని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రూల్స్ పాటించకపోవడంతో సర్కార్ ఖజానాకు గండి పడుతోంది. కేవలం హద్దు రాళ్లతో ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. 

అగ్రికల్చర్ ల్యాండ్ పేరిట రియల్ దందా

కొండగట్టు పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన కొందరు బీఆర్ఎస్ లీడర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి దందాకు తెరతీశారన్న ఆరోపణలున్నాయి. నాలా కన్వర్షన్‌‌ చేయకుండా ప్లాట్లను గజాల్లో కాకుండా గుంటల్లో రిజిస్ట్రేషన్‌‌ చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కూడా మారకపోవడంతో రెవెన్యూ డిపార్మెంట్ సైతం ఆదాయం కోల్పోతోంది. ఇలాంటి అక్రమ వెంచర్లతో కొనుగోలుదారులు భవిష్యత్‌‌లో నాలా కన్వర్షన్, ఎల్ఆర్ఎస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

మోక్షం లేని మాస్టర్ ప్లాన్

గతంలో మాజీ సీఎం కేసీఆర్ కొండగట్టుకు రూ. 500 కోట్లు మంజూరు చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సర్వే పనులు కూడా మొదలు పెట్టారు. దీంతో అభివృద్ధి ఏమో కానీ పరిసర గ్రామాల్లో ఉండే భూములకు ఐదారు రేట్లు ధరలు పెరిగాయి. దీన్ని క్యాష్ చేసుకున్న రియల్ వ్యాపారులు, స్థానిక బీఆర్ఎస్ లీడర్లుతో చేతులు కలిపి రియల్‌‌ దందాకు తెరతీశారు. కొందరు డిమాండ్ పెరుగుతుందన్న ఆశతో ప్లాట్లు కొనగా.. నెలలు గడుస్తున్నా ధరలు పెరగకపోవడంతో కొనుగోలుదారులు నిరాశలో ఉన్నారు. 

పర్మిషన్ లేకుండా ప్లాటింగ్ చేస్తే చర్యలు 

ఎవరైనా పర్మిషన్ లేకుండా ప్లాటింగ్ చేసి భూమిని విక్రయాలు చేపడితే చర్యలు తప్పవు. నిబంధనల మేరకే ప్లాట్లు అమ్మకాలు చేపట్టాలి. ఇప్పటికే గుర్తించిన అక్రమ ప్లాట్ల హద్దు రాళ్లు తొలగించాం.

- స్వరూప, కొడిమ్యాల ఎంపీడీవో