డెవలప్మెంట్ పేరుతో ఒండ్రుమట్టి దందా.. రూ. 6 కొట్లు వసూలు

డెవలప్మెంట్ పేరుతో ఒండ్రుమట్టి దందా.. రూ. 6 కొట్లు వసూలు
  • ఫ్రీగా రైతుల పొలాల్లో వేస్తామని చెప్పి ఇటుక బట్టీలకు తరలింపు
  • ఒక్కొక్కరి నుండి రూ.25 లక్షల చొప్పున రూ. 6 కొట్లు వసూలు

మహబూబ్​నగర్, వెలుగు : పాలమూరు పెద్ద చెరువులోని ఒండ్రు మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారు. చెరువును మినీ ట్యాంక్​బండ్​గా డెవలప్ చేయడంపై ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా.. ఇక్కడి ఒండ్రు మట్టిని పెద్ద మొత్తంలో తరలిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. మట్టిని బట్టీలకు తరలిస్తుండగా, మంగళవారం సాయంత్రం పిల్లలమర్రి రైల్వే గేట్ ప్రాంత ప్రజలు అడ్డుకొని ఆందోళనకు దిగడం హాట్  టాపిక్​గా మారింది. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు 114 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్​గా డెవలప్ చేయగా, కట్ట పక్కనే శిల్పారామం పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా లక్నవరం తరహాలో కేబుల్ బ్రిడ్జి, ఐలాండ్ పనులు నడుస్తున్నాయి. డెవలప్​మెంట్​లో భాగంగా చెరువు ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీటిని నిల్వ చేయాలని భావించారు. ఈ మేరకు ఒండ్రును ఒకటి నుంచి రెండు ఫీట్ల వరకు తీయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఈ పనులను టెండర్  ద్వారా కాకుండా చెరువు వద్ద డెవలప్​మెంట్  పనులు చేస్తున్న వారికే అప్పగించారు. తోడిన మట్టిని రైతుల పొలాలకు ఫ్రీగా తరలించాలని సూచించారు. కానీ, ఈ వ్యవహారంలో రూలింగ్ పార్టీకి చెందిన లీడర్లు ఎంటర్  కావడంతో సీన్ మారింది. ఒండ్రును రైతుల పొలాలకు కాకుండా, ఇటుక బట్టీలు, ఇతర పనులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 

వచ్చిన దాంట్లో అందరికీ వాటాలు..

మహబూబ్​నగర్ చుట్టూ 18 ఇటుక బట్టీలున్నాయి. ఈ బట్టీలకు ఒండ్రు మట్టి అమ్మి క్యాష్  చేసుకునేందుకు రూలింగ్  పార్టీకి చెందిన మహబూబ్​నగర్  నియోజకవర్గ లీడర్  అనుచరుడు రంగంలోకి దిగాడు. ఆయన అపోజిషన్  పార్టీకి చెందిన మరో లీడర్​ను కాంటాక్ట్ కాగా, ఆయన ద్వారా 15 మంది ఇటుక బట్టీల వ్యాపారులతో డీల్ కుదుర్చుకున్నాడని తెలిసింది. ఒక్కొక్కరి నుంచి ఒక్కో విధంగా రూ.19 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున రూ.6 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. వచ్చిన దాంట్లో తలా కొంత పంచుకున్నట్లు తెలుస్తోంది. పెద్దచెరువు కమిటీలో కొందరికి డబ్బులు ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయి.

సహకరిస్తున్న అపోజిషన్  లీడర్లు..

డీల్ మొత్తాన్ని అపోజిషన్  పార్టీకి చెందిన ఓ లీడర్  సెట్  చేయగా, ఒండ్రు తరలించేందుకు మరో లీడర్ వాహనాలను సమకూర్చారు. చెరువులో మొత్తం 40 టిప్పర్లు ఉండగా, అందులో 10 టిప్పర్లు జిల్లా కేంద్రానికి చెందిన ఓ అపోజిషన్  లీడర్​వి కావడం విశేషం. మరో ఎనిమిది బండ్లు రూరల్  మండలానికి చెందిన లీడర్ కి చెందినవి.

నాలుగు ఫీట్ల వరకు తవ్వుతున్రు..

రెండు ఫీట్ల వరకే ఒండ్రు తవ్వుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నా, చెరువులో నాలుగు నుంచి ఐదు ఫీట్ల వరకు తవ్వుతున్నారు. దీంతో చెరువు దిగువన ఉన్న బోర్లు వట్టిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద 4,200 బోర్లు ఉండగా, వీటి ఆధారంగా మర్లు, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, మైత్రినగర్, శివశక్తినగర్, బాలాజీనగర్, హబీబ్​నగర్, నూర్​నగర్, పాతపాలమూరు, క్రిస్టియన్​ పల్లి ప్రాంతాల్లో ప్రజలు నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. చెరువులో పెద్ద మొత్తంలో పూడిక తీయడం వల్ల ఈ బోర్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. 

డ్రైవర్ల ర్యాష్  డ్రైవింగ్..

ఒక ట్రిప్పుకు రూ.వెయ్యి చొప్పున డ్రైవర్​కు​బత్తా  ఇస్తుండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కో టిప్పర్​తో 10 నుంచి 15 ట్రిప్పులు కొడుతున్నారు. ఈ లెక్కన డ్రైవర్లకు బత్తా కింద రోజుకు రూ.15 వేల వరకు వస్తున్నాయి. బత్తా డబ్బులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో డ్రైవర్లు పోటీ పడి టిప్పర్లు తోలుతున్నారు. స్కూళ్లు, కాలేజీల వద్ద, ట్రాఫిక్ పోలీసుల ముందు నుంచి దూసుకుపోతున్నా చర్యలు తీసుకోవడం లేదు.

ఇటుక బట్టీలకు తలించొద్దని చెప్పాం..

పెద్ద చెరువు కెపాసిటీ పెంచడానికి, అక్కడ డెవలప్​మెంట్  పనులు చేస్తున్న వారికే సిల్ట్ తీయాలని చెప్పాం. సిల్ట్​ ఐదు కిలోమీటర్ల రేడియస్​లో ఎక్కడన్నా డంప్ చేయొచ్చు. కానీ, ఇటుక బట్టీలకు తరలించొద్దు. ఈ విషయంపై కాంట్రాక్టర్​తో మాట్లాడాం. ఇటుక బట్టీలకు మట్టిని తరలించొద్దని స్పష్టంగా చెప్పాం.
–వెంకటయ్య, ఇరిగేషన్ ఈఈ, మహబూబ్​నగర్