కాగజ్ నగర్ డివిజన్లోని ప్రాణహిత దాటించి పశువుల అక్రమ రవాణా..18 పశువులతో వెళ్తున్న బొలెరో వాహనం పట్టివేత

కాగజ్ నగర్ డివిజన్లోని ప్రాణహిత దాటించి పశువుల అక్రమ రవాణా..18 పశువులతో వెళ్తున్న బొలెరో వాహనం పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువుల రవాణా ఆగడం లేదు. అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాదారులు రూటు మార్చి ప్రాణహిత నది గుండా పశువులు దాటించి అడవీ మార్గం గుండా తరలిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి కాగజ్ నగర్ డివిజన్​లోని కర్జెల్లి రేంజ్ కోసిని అడవి ప్రాంతంలోని రోడ్డు గుండా అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్​ను ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. 

మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటించి సోమవారం అర్ధరాత్రి 18 పశువులను బొలెరోలో తరలిస్తుండగా సీజ్ చేసి రేంజ్ ఆఫీస్ కు తరలించారు. వాటిని తీసుకెళ్తున్న భైంసాకు చెందిన అమన్ ఖాన్, మోబిన్, గంగాపూర్​కు చెందిన నారాయణ​పై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ తెలిపారు. 

రూటు మార్చి ప్రత్యామ్నాయ మార్గాల గుండా..

కొన్నేళ్లుగా ఈ పశువుల అక్రమ రవాణా దందా అడ్డుకట్ట లేకుండా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జి సమీపంలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయగా అక్కడ నుంచి సైతం వాహనాలు గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే చెక్ పోస్ట్ రూటు కాకుండా ఇదే మండలంలో ప్రత్యామ్నాయ మార్గాల గుండా పశువుల రవాణా చేసేందుకు అక్రమరవాణా దారులు ప్రాణహిత నదిని ఎంచుకుంటున్నారు. మహారాష్ట్ర లోని గ్రామాల్లో దళారుల నుంచి కొనుగోలు చేయించి ప్రాణహిత నది దాటించి అక్కడే ఉన్న అటవీ ప్రాంతంలో పొద్దంతా మేపుకుని రాత్రి వేళ వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.