కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలో మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (ఆగస్ట్ 17న) దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ మెడికల్ సేవలను బంద్ చేయాలని ఐఎంఏ నిర్ణయించింది. అర్థమయ్యేలా చెప్పాలంటే.. దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు తప్ప ఇతరత్రా వైద్య సేవలు 24 గంటల పాటు నిలిచిపోనున్నాయి. మెజారిటీ డాక్టర్లు ఆగస్ట్ 17న స్రైక్లో ఉంటారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కాబోతున్నాయి. ఆగస్ట్ 17 ఉదయం 6 గంటల నుంచి ఆగస్ట్ 18 ఉదయం 6 గంటల వరకు వైద్యులు విధులను బహిష్కరించనున్నారు. హాస్పిటల్లో ఓపీడీలు నడిచే పరిస్థితి ఉండదు. సాధారణ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
కోల్కత్తాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ను ఓ దుర్మార్గుడు కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా వైద్యులు ఈ దారుణ ఘటనపై నిరసనగళం వినిపించారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం అయినప్పటికీ ఆరోజు కూడా వైద్యులు నిరసనలను కొనసాగించారు. హత్యను నిరసిస్తూ ఆగస్ట్ 13న దేశవ్యాప్తంగా ఓపీడీ సేవలను బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ఆగస్ట్ 9న నగ్నంగా లేడీ ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. పోస్టమార్టం చేసిన అనంతరం ఆమెని అత్యాచారం చేసి హత్య చేశారని తేలింది. ఆమె అదే హాస్పిటల్లో ట్రైనీగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ డాక్టర్గా గుర్తించారు. ఆమె శరీర అవయవాలపై గాయాలు, ప్రైవేట్ పార్ట్స్లో రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. కోల్‌కతాలోని ప్రాథమిక పోస్ట్‌మార్టంలో హత్యకు ముందు ఆమె లైంగిక వేధింపులకు గురైందని తేలింది.
