పాక్‎కు IMF​ షాక్..​EFF​ నిధుల విడుదలకు 11 షరతులు

పాక్‎కు IMF​ షాక్..​EFF​ నిధుల విడుదలకు 11 షరతులు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‎కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) షాక్​ఇచ్చింది. ఎక్స్‌‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్​) కింద 1 బిలియన్‌‌ డాలర్ల నిధులను (దాదాపు 8,540 కోట్లు) మంజూరు చేసిన ఐఎంఎఫ్​.. వీటి విడుదలకు 11 షరతులు విధించింది. భారత్‎తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాకిస్తాన్‎కే ఎక్కువ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. పొరుగు దేశంతో ఘర్షణలు దేశంలో ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని తెలిపింది. 

భారత్​– పాకిస్తాన్​మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్‌‌ మార్కెట్‌‌ మొదట నష్టాల్లోకి వెళ్లినా.. ప్రస్తుతం స్టెబుల్‎గా ఉన్నాయని పేర్కొన్నది. కాగా, పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి డిఫెన్స్​బడ్జెట్‌‌ను రూ.2.414 ట్రిలియన్‌‌గా ప్రణాళిక వేస్తున్నది. ఇది నిరుడితో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్‌‌ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తున్నది. ఈ 11తో కలిసి పాక్​పై ఐఎంఎఫ్​ విధించిన కండిషన్స్​సంఖ్య 50కి చేరింది.

ఐఎంఎఫ్ తాజా​కండిషన్స్​ఇవే..

ఈ జూన్​లోగా ఐఎంఎఫ్‌‌ లక్ష్యాలకు అనుగుణంగా 2026  బడ్జెట్‌‌ను పాకిస్తాన్​పార్లమెంట్​ ఆమోదించాలి.  జూన్ లోపు 4 రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని ఐఎంఎఫ్​సూచించింది. 2026 ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఈ మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. ఐఎంఎఫ్‌‌ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్​మెంట్​ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే గవర్నమెంట్​ యాక్షన్​ ప్లాన్​ను ప్రచురించాలి.  

2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్లాన్​రూపొందించాలి. ఈ నెలాఖరు నాటికి క్యాప్టివ్ పవర్ లెవీ ఆర్డినెన్స్‌‌ను శాశ్వతంగా మార్చడానికి పార్లమెంటు చట్టాన్ని కూడా ఆమోదించాలని ఐఎంఎఫ్​ తెలిపింది. పరిశ్రమలను జాతీయ విద్యుత్ గ్రిడ్‌‌కి మార్చేలా ప్రభుత్వం ఖర్చును పెంచిందని వెల్లడించింది.  ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని సూచించింది.  2035 నాటికి స్పెషల్​ టెక్నాలజీ జోన్స్, ఇండస్ట్రియల్​ పార్కులకు ఇచ్చే సబ్సిడీలను పూర్తిగా తొలగించాలని సూచించింది. 

జులై చివరి నాటికి వినియోగించిన మోటారు వాహనాల వాణిజ్య దిగుమతిపై ఉన్న అన్ని  పరిమితులను  ఎత్తివేయడానికి అవసరమైన చట్టాలను పార్లమెంట్​కు సమర్పించాలని   కోరింది.  ఐఎంఎఫ్​ విధించిన కొత్త కండిషన్స్​తో పాక్​లో టెన్షన్​ మొదలైంది. పాకిస్తాన్​కు విడుదల చేసే ప్రతి రూపాయి టెర్రర్​ ఫండింగే అంటూ భారత్​ ఇటీవల వ్యాఖ్యానించింది. ఆ దేశానికి నిధులు విడుదలపై ఓసారి 
పునరాలోచన చేయాలని ఐఎంఎఫ్​ను కోరింది.