ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

   ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కవితను వెంటనే బర్తరఫ్​ చేయాలి
టీఆర్ఎస్ దిష్టి బొమ్మను  దహనం చేసిన బీజేపీ

తిమ్మాపూర్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు వెల్లడి కావడంతో ఆమెను ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్​చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేశారు. మండల బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై టీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడితే తన కుటుంబ సభ్యులైనా జైలుపాలు కావాల్సిందేనని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్​ఇపుడు కవితపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న విషయంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవితను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో మండల ప్రధాన కార్యదర్శి అనిల్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మోహన్, బీజేవైఎం అధ్యక్షుడు  అరుణ్, లీడర్లు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా కేసీఆర్‌‌ పాలన 
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ  

ముస్తాబాద్, వెలుగు : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ పేర్కొన్నారు. గురువారం ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోందన్నారు. కేంద్రం పంపిస్తున్న నిధులన్నీ రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్​చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున్, గోపీ, సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.

రైతుబీమాతో ఆర్థిక భరోసా
 చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ 

గంగాధర, వెలుగు : రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని, రైతుబీమాతో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోందని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ అన్నారు. మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి వెంకటమ్మ ఇటీవల చనిపోగా ఆమె కుటుంబానికి రైతుబీమా ప్రొసీడింగ్ కాపీని గురువారం ఆయన అందజేశారు. రైతు బాగోగుల గురించి ఆలోచించేది కేసీఆర్ మాత్రమేనన్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.10 వేలు, 24 గంటల ఉచిత కరెంట్​ను అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వడ్లూరి అనిత-, మల్లేశం, ఆత్మ చైర్మన్ మల్లారెడ్డి, కొండగట్టు ఆలయ డైరెక్టర్​ నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.  

జమ్మికుంటను అభివృద్ధి చేస్తాం
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ 

జమ్మికుంట, వెలుగు : హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, నిధులకు కొరత లేదని రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్​ రావు, కౌన్సిలర్లు వినోద్​ను కలిసి అభివృద్ధి పనుల కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీకి గతంలో మంజూరు చేసిన  రూ.13కోట్లు డిసెంబర్​లో విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్​పర్సన్ కె. విజయ, సింగిల్ విండో చైర్మన్​సంపత్, లీడర్లు పాల్గొన్నారు.  

2 ఎకరాల భూమి ఒడ్డెరలకే..

జమ్మికుంట పట్టణ శివారులోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒడ్డెర కులస్తులకు ఇండ్ల పట్టాలుగా ఇస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ భూమిని కొద్దిరోజుల క్రితం దళిత బంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులకు కేటాయించారు. ఒడ్డెరలు ఆందోళన చేయడంతో అధికార యంత్రంగం తిరిగి వారికే భూమిని ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒడ్డెరలు హర్షం వ్యక్తం చేశారు.  

అధికారమే లక్ష్యంగా పని చేయాలి
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గౌతంరెడ్డి

ఇల్లందకుంట, వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని హుజూరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గౌతమ్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇల్లందకుంట మండల సంస్థాగత ఇన్​చార్జి కరుణాకర్, శ్రీనివాస్, సాంబయ్య, షఫీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంగ్రామ యాత్రను విజయవంతం చేయండి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి 

గంగాధర, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను మండల ప్రజలు, లీడర్లు విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కోరారు. గురువారం మండలంలోని మధురానగర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 15,16 తేదీల్లో గంగాధర మండలంలో నిర్వహించే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందన్నారు. లీడర్లంతా కో ఆర్డినేషన్ తో పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​గౌడ్​, చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్​ శ్రావణ్​కుమార్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్, మండలాధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్​గౌడ్ పాల్గొన్నారు.

 బడి భూమి కబ్జా..
కాపాడాలని గ్రామస్తుల ఆందోళన

కోనరావుపేట, వెలుగు: బడి భూమి ఆక్రమణకు గురైందని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిని గ్రామానికి చెందిన గెంటె శ్రీనివాస్ ఆక్రమించి సాగుచేసుకుంటున్నాడని, ఆ భూమిని స్కూల్​కు చెందేలా చూడాలని తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా సర్వే చేయడంలేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వారిలో మాజీ సర్పంచ్ ఉప్పుల శ్రీనివాస్, బాదవేని బాలరాజు, రొక్కం దేవారెడ్డి, సాసాల రాజిరెడ్డి, రాజు, మల్లేశం, తిరుపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.