
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన మహిళా హక్కులు గురించి ఇక్కడ చర్చిద్దాం
1. మాతృత్వ ప్రయోజనాల చట్టం :
మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం మహిళలు డెలివరీ తర్వాత 6 నెలల సెలవు తీసుకోవచ్చు. ఈ కాలంలో వారి జీతంలో ఎలాంటి మినహాయింపు ఉండదు. తరువాత తిరిగి పనిలో చేరే హక్కును కూడా కలిగి ఉంటారు.. ఒక మహిళ గర్భవతి అయితే 26 వారాల పాటు సెలవు తీసుకునే హక్కు ఉంటుంది.
2. రాత్రిపూట అరెస్టు చేసే హక్కు :
1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 46లోని సబ్‌సెక్షన్ (4) ప్రకారం ఏ పోలీసు అధికారి సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి సమయంలో స్త్రీలను అరెస్టు చేయరాదు. మహిళ ఏ చట్టాన్ని ఉల్లంఘించినా పోలీసులు ఉదయం వరకు వేచి ఉండాల్సిందే. ఒక మహిళను అరెస్టు చేయాలంటే పోలీసులు ముందుగా కోర్టు నుండి ప్రత్యేక అధికారాన్ని పొందాలి.
3. ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు:
అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైన మహిళలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును భారత రాజ్యాంగం ఇచ్చింది. బాధిత మహిళ పోలీసు స్టేషన్‌లోని SHO నుండి సహాయం పొందవచ్చు. న్యాయవాదిని ఏర్పాటు చేయడానికి SHO చట్టపరమైన అధికారానికి తెలియజేస్తుంది.
4. పేరు, గుర్తింపును గోప్యంగా ఉంచే హక్కు :
మహిళల నేరాలకు సంబంధించి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. అత్యాచారం లేదా లైంగిక వేధింపుల విషయంలోబాధితురాలి పేరు, ఫోటోను గోప్యంగా ఉంచే హక్కు ఉంది. లైంగిక వేధింపుల విషయంలో గోప్యతను కాపాడేందుకు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు ఉంటుంది. మహిళలు తమ ఫిర్యాదులను నేరుగా జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసుకోవచ్చు. అలాగే మహిళ ఎవరనే విషయాన్ని వెల్లడించే హక్కు పోలీసులకు, మీడియాకు, అధికారులకు లేదు.
5. సమాన వేతనం :
మహిళలకు సమాన వేతనం పొందే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. సమాన వేతన చట్టం ప్రకారం, లింగం ఆధారంగా వేతనాలలో ఎలాంటి వివక్ష ఉండదు. సమాన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని నిబంధన ఉంది.