సిటీ మార్కెట్లలో భారీగా తగ్గిన ఆకు కూరలు

సిటీ మార్కెట్లలో భారీగా తగ్గిన ఆకు కూరలు
  • ఆకుకూరలు మస్త్​ పిరం
  • వరుస వానలకు దెబ్బతిన్న తోటలు
  •  సిటీ మార్కెట్లకు భారీగా తగ్గిన దిగుమతులు
  • హోల్​సేల్ ​మార్కెట్లో ఆకుకూరల బాక్స్ రూ.600
  •  కట్ట సైజును బట్టి రూ.10 నుంచి 50 వరకు అమ్మకాలు 
  •  మార్కెట్​కు తెచ్చిన రెండు గంటల్లో సరుకు ఖాళీ

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​లోని మార్కెట్లకు ఆకుకూరల దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. వరుస వానలతో జిల్లాల్లోని తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల్లోనే ఆకుకూరలు కుళ్లిపోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న కొద్దిపాటి సరుకుకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చలకూర, మెంతికూర, కొత్తిమీర, సోయకూర, గంగవాయిలి కూర, పుదీనల ధరలు మండిపోతున్నాయి. కట్ట సైజును బట్టి రూ.10 నుంచి 50 వరకు అమ్ముతున్నారు. నెలరోజుల క్రితం రూ.10కి చిన్నచిన్న కట్టలు ఐదారు వచ్చేవని, ఇప్పుడు ఒకటి, రెండు ఇస్తున్నారని జనం వాపోతున్నారు. అన్ని రకాల ఆకుకూరల ధరలు ఇలాగే ఉన్నాయని చెబుతున్నారు. జోరువానలకు ఉన్న తోటలు దెబ్బతినడం, కొత్తగా మళ్లీ వేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని మార్కెట్ల అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు. సిటీలోని హోల్ సేల్ మార్కెట్లు, రైతుబజార్లు, బయటి మార్కెట్లకు దాదాపు  150 టన్నుల డిమాండ్ ఉండగా ప్రస్తుతం డైలీ 80 టన్నులు మాత్రమే దిగుమతి అవుతున్నట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.

సగానికి తగ్గినయ్​

సిటీలోని మాదన్నపేట, గుడిమాల్కాపూర్, శంషాబాద్ మార్కెట్లకు 12 రకాల ఆకుకూరలు ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అత్యధికంగా మాదన్నపేట మార్కెట్ కు డైలీ 35 నుంచి 40 టన్నులు వచ్చేవి. కానీ కొద్దిరోజులుగా 20 నుంచి 25 టన్నులు మాత్రమే వస్తున్నాయి. గుడిమల్కాపూర్ మార్కెట్​కు ఇదే పరిస్థితి ఉంది. గతంలో డైలీ10 టన్నులకు వస్తుండగా ప్రస్తుతం 5 నుంచి 6 టన్నులు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. శంషాబాద్, ఎల్​బీనగర్ మార్కెట్లకు ఐదారు టన్నులకు గాను మూడు టన్నులు వస్తున్నట్లు హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్లకు కూడా దిగుమతులు సగానికి తగ్గాయి. 

శివారు నుంచీ పెద్దగా రావట్లే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్, బాలాపూర్, షాబాద్, షాద్ నగర్, మేడ్చల్‌‌, కీసర, ఘట్‌‌కేసర్‌‌, శామీర్‌‌పేట, వికారాబాద్ ప్రాంతాల్లోని గ్రామాల నుంచి సిటీ మార్కెట్లకు ఆకుకూరలు ఎక్కువగా వస్తాయి. వీటితోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతాయి. భారీగా వర్షాలకు కోతకు వచ్చిన ఆకుకూరలు ఎక్కడికక్కడ కుళ్లిపోయాయి. దీంతో అన్నిచోట్ల నుంచి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. వచ్చిన కొద్దిపాటి సరుకు 2 గంటల్లో అయిపోతుంది. అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. 

ఇంకో నెల ఇలాగే ఉండొచ్చు

వానలకు ఆకుకూరల తోటలు దెబ్బతిన్నాయి. నీళ్లు నిలవడంతో పొలాల్లోనే కుళ్లిపోయాయి. దిగుమతులు పెరగడానికి ఇంకో నెల పట్టేలా ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా, బెంగళూరు, మహారాష్ట్ర, ఏపీల నుంచి ఆకుకూరలు వస్తున్నాయి. డిమాండ్ కి సరిపడా వస్తుందా? లేదా? అన్న వివరాలు ప్రభుత్వానికి పంపితే సాగు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు.
– రాంరెడ్డి, మాదన్నపేట మార్కెట్ రైతు సంఘం అధ్యక్షుడు

దిగుమతులు లేక రేట్లు పెరిగాయ్

డిమాండ్​కు తగ్గట్టుగా దిగుమతులు లేకపోవడంతో ఆకుకూరల రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 20 రోజుల క్రితం పాలకూర బాక్సు రూ.200 ఉండేది. ఇప్పుడు రూ.600 అయ్యింది. ఒక్కో బాక్సులో 45 నుంచి 50 కట్టలు ఉంటాయి. ఇలా అన్ని ఆకుకూరల రేట్లు అమాంతం పెరిగాయి.  - రాజేశ్, హోల్​సేల్ షాపు నిర్వాహకుడు, గుడిమల్కాపూర్ మార్కెట్