లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ రాజ్యాంగ విరుద్ధం.. ప్రెసిడెంట్‌‌‌‌గా ఇంట్లో కూర్చోలేను

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ రాజ్యాంగ విరుద్ధం.. ప్రెసిడెంట్‌‌‌‌గా ఇంట్లో కూర్చోలేను
  • ముస్లింలపై బ్యాన్ ను ఎత్తేస్తా.. దేశంలో వివక్షను అంతం చేస్తా: బిడెన్  
  • వేర్వేరుగా టౌన్ హాల్ మీటింగ్స్ లో పాల్గొన్న ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు  

గ్రీన్ విల్లే (యునైటెడ్ స్టేట్స్): అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ లు గురువారం ఒకే సమయంలో వేర్వేరుగా టౌన్ హాల్ మీటింగ్స్ నిర్వహించారు. గురువారం రాత్రి జరగాల్సిన సెకండ్ డిబేట్ వాయిదా పడిన నేపథ్యంలో టౌన్ హాల్ మీటింగ్స్ జరిగాయి. ట్రంప్ మీటింగ్ ను ఎన్ బీసీ న్యూస్ చానెల్ మియామీలో, బిడెన్ మీటింగ్ ను ఏబీసీ న్యూస్ చానెల్ పెన్ సిల్వేనియాలో నిర్వహించాయి. ఎన్ బీసీకి చెందిన సవన్నా గుత్రీ, ఏబీసీకి చెందిన జార్జ్ స్టెఫానోపోలస్ మీడియేటర్లుగా వ్యవహరించారు. ముందుగా ఎంపిక చేసిన కొంత మంది ఓటర్లు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానాలు ఇచ్చారు.ట్రంప్ మాస్క్ పెట్టుకోకుండానే మీటింగ్ లో పాల్గొనగా.. బిడెన్ మాత్రం మాస్క్ తో కనిపించారు. ఇద్దరి మధ్య ఫైనల్ డిబేట్ ఈ నెల 22న నాష్​ విల్లేలో జరగనుంది.

బిడెన్ కరప్టెడ్​ పొలిటీషియన్

కరోనా విపత్తు సమయంలో ఎన్నికల ప్రచారాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. దేశ ప్రెసిడెంట్ గా తాను రూంలో లాక్ చేసుకుని ఉండిపోలేనని, రిస్కులు ఉన్నా.. జనంలోకి వెళ్తానన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ లు రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ కారణాలతోనే లాక్ డౌన్ లు పెట్టారని విమర్శించారు. కానీ లాక్ డౌన్ లతో ముందుకెళ్లడం సరికాదన్నారు. తాను మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. వర్జీనియా గవర్నర్ రాల్ఫ్ నార్థమ్, సెనెటర్ థామ్ టిల్లీస్ ఎప్పుడూ మాస్క్ పెట్టుకునేవారని, అయినా వాళ్లకు కరోనా అంటుకుందన్నారు. చైనా పంపిన ఈ వైరస్ చాలా మందికి అంటుకుంటోందని దానిని ప్రపంచం నుంచి  పారదోలాలన్నారు. జో బిడెన్ కరప్ట్ పొలిటీషయన్ అని ట్రంప్ ఆరోపించారు. తమ స్వార్థం తాము చూసుకుని, తాము మాత్రమే ఎదిగేలా చూసుకునే నాయకుల కోవలోని వారని విమర్శించారు.

కరోనా కట్టడిలో ట్రంప్ ఫెయిల్

కొన్ని ముస్లిం దేశాల ప్రజలు అమెరికాకు రాకుండా ట్రంప్ విధించిన బ్యాన్ ను తాను ప్రెసిడెంట్ అయితే ఎత్తేస్తానని జో బిడెన్ ప్రకటించారు. ముస్లిం అమెరికన్లకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో జాతి వివక్ష నేరాలను కట్టడి చేసేందుకు చట్టం తెస్తామని వెల్లడించారు. తన కూతురు ట్రాన్స్ జెండర్ అని, అలాంటి వారి కోసం ఏం చేస్తారంటూ ఓ మహిళా ఓటర్ అడిగిన ప్రశ్నకు బిడెన్ జవాబిస్తూ.. ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడతామని, దేశంలో ఎవరి పట్లా వివక్ష ఉండకుండా.. జీరో డిస్క్రిమినేషన్ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నా ట్రంప్ వినియోగించుకోలేదని విమర్శించారు. ట్రంప్ అన్నీ అబద్ధాలే
చెప్పారన్నారు.