జాతి ప్రయోజనాల కోసం రోడ్డెక్కండి

జాతి ప్రయోజనాల కోసం రోడ్డెక్కండి
  • జాతి ప్రయోజనాల కోసం రోడ్డెక్కండి
  • దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయండి.. పాకిస్తానీలకు ఇమ్రాన్​ పిలుపు
  • ఇయ్యాల్నే పాక్​ నేషనల్​ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​

ఇస్లామాబాద్: ప్రధాని కుర్చీలోంచి తనను దింపేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని, కొన్ని విదేశాలకూ ఇందులో భాగం ఉందని పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​శనివారం ఆరోపించారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా, జాతి ప్రయోజనాలు కాపాడుకోవడానికి పాకిస్తానీలంతా రోడ్డెక్కి ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ‘మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చేయండి’ అంటూ ఇమ్రాన్​ ఖాన్​ ప్రజలను కోరారు. శనివారం ఓ టీవీ చానెల్​తో ఇమ్రాన్​ మాట్లాడారు. ‘నాపై కుట్రలు పన్నుతున్న వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా.. ఎలా ఎదుర్కుంటానో రేపు(ఆదివారం) మీరే చూస్తారు. నా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటా. ఇలాంటి కుట్ర వేరే ఏ దేశంలోనైనా జరిగితే అక్కడి ప్రజలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తారు’ అని పేర్కొన్నారు.

తీర్మానంపై గెలిస్తే ముందస్తుకు..
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తాను గెలిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్తానని ఇమ్రాన్ ​ఖాన్​ స్పష్టంచేశారు. ఫిరాయింపుదారులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపలేమన్నారు. ‘ఎస్టాబ్లిష్​మెంట్’ తనకు 3ఆప్షన్లు ఇచ్చిందని, అందులో ఒకటి రాజీనామా చేయడం, రెండు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం, మూడు ముందస్తు ఎన్నికలకు పోవడం అని పేర్కొన్నారు. అయితే.. ‘ఎస్టాబ్లిష్​మెంట్’​ అంటే ఏమిటో ఇమ్రాన్​ఖాన్​ చెప్పకపోయినప్పటికీ.. అది పాక్​లోని పవర్​ఫుల్​ మిలిటరీ గురించేనని స్పష్టమవుతున్నది. అవిశ్వాసంలో ప్రతిపక్షాలు ఓడిపోయి తాము గెలిస్తే ముందస్తు ఎన్నికలకు మార్గం మరింత ఈజీ అవుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ప్రతిపక్షాలైన పాకిస్తాన్​ ముస్లిం లీగ్​నవాజ్​ (పీఎంఎల్​ఎన్), పాకిస్తాన్​ పీపుల్స్​ పార్టీ (పీపీపీ) దేశాన్ని అవమానిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

ఓటింగ్​పై ఉత్కంఠ
ఇమ్రాన్​ ఖాన్​పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం నేషనల్​ అసెంబ్లీలో ఓటింగ్​ జరుగనుంది. ఈ ఓటింగ్​పై  పాక్​ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్​ఖాన్​ విజయం సాధించాలంటే నేషనల్​ అసెంబ్లీలో 172 సభ్యుల మద్దతు కావాలి. అయితే.. తమకు 175 మంది సభ్యుల మద్దతుందని, ఇమ్రాన్​ ఖాన్​ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి.