పెద్దపల్లి జిల్లాలో హస్తం స్వీప్​

పెద్దపల్లి జిల్లాలో హస్తం స్వీప్​
  • గత మెజార్టీలను బ్రేక్​ చేసిన కాంగ్రెస్​ అభ్యర్థులు


పెద్దపల్లి, వెలుగు: 2023 ఎన్నికల ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాలో హస్తం పార్టీ స్వీప్​ చేసింది. మొదటి రౌండ్​ నుంచే ఆధిక్యం కనబరిచింది. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో గెలిచింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఓట్ల కౌంటింగ్ పోస్టల్​ బ్యాలెట్​తో స్టార్ట్​ అయింది. పోస్టల్ బ్యాలెట్​ఓట్లలో మూడు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్​ అభ్యర్థులు మెజారిటీ సాధించారు.

పెద్దపల్లి, మంథని 21 రౌండ్ల కౌంటింగ్​ జరిగింది. రామగుండం 19 రౌండ్లతో పూర్తయింది. ఏ ఒక్క రౌండ్​లో కూడా బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఆధిక్యం చూపలేదు. మధ్యాహ్నం 2 గంటల వరకే రామగుండం రిజల్ట్​ వచ్చింది. మంథని 3 గంటల వరకు రాగా, పెద్దపల్లి సాయంత్రం వరకు సాగింది. పెద్దపల్లి నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థి దాసరి మనోహర్​రెడ్డి, కాంగ్రెస్​అభ్యర్థి చింతకుంట విజయరమణారావు చేతిలో 54,682 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అలాగే రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్​ అభ్యర్థి కోరుకంటి చందర్​, కాంగ్రెస్ అభ్యర్థి రాజ్​ఠాకూర్​ మక్కాన్​సింగ్​ చేతిలో 56,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. మంథనిలో అధికార పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్​, కాంగ్రెస్​ అభ్యర్థి, సిటింగ్​ఎమ్మెల్యే శ్రీధర్​బాబు చేతిలో 30,787 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాసరి మనోహర్​రెడ్డి, విజయరమణారావుపై 8 వేల మెజారిటీతో గెలిచారు.

రామగుండంలో ఇండిపెండెంట్​గా పోటీ చేసిన కోరుకంటి చందర్​,  నాటి బీఆర్ఎస్​ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 26,419 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మంథనిలో పుట్ట మధుపై శ్రీధర్​బాబు  16, 230 మెజార్టీతో గెలిచారు.  2018 ఎన్నికల ఫలితాలకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్​ అభ్యర్థులు మూడు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ సాధించారు.