
- తొమ్మిదేండ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెల్ఫేర్‌కు రూ.1.35 లక్షల కోట్ల కేటాయింపు
- చేసిన ఖర్చు అందులో సగమే
- నాలుగు వర్గాలకు ఏటా ఖర్చు రూ.9 వేల కోట్లు దాటలే
- ప్రకటనలే తప్ప.. పనుల్లేవ్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల ప్రగతి పండగ అంటూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న సర్కార్.. ఈ 9 ఏండ్లలో సంక్షేమానికి చేసిన ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది. ప్రకనల్లో ఉన్న గొప్ప.. అమలులో లేదన్నది ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు.. వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం వివరాలు పరిశీలిస్తే అసలు సంగతి అర్థమైతుంది. సంక్షేమంపై చేసిన ఖర్చు వివరాలతో ఇటీవల ఒక రిపోర్ట్ తయారు చేశారు. దీంట్లో మొన్న మార్చి వరకు ఒక్కో వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లో ఎన్ని ఫండ్స్ఖర్చు చేశారో పొందుపరిచారు. దీని ప్రకారం రాష్ట్రంలో వెల్ఫేర్‌ను సక్కగ పట్టించుకోలేదనేది తెలుస్తున్నది. నాలుగు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో దేంట్లోనూ ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.5 వేల కోట్లు దాటి ఖర్చు పెట్టలేదు. పోయినేడాది మాత్రమే అదీ దళిత బంధు కొంతమేర అమలు చేసినందుకు ఎస్సీ వెల్ఫేర్ ఖర్చు పెరిగింది. 2014–15 నుంచి 2022–23 వరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌కు మొత్తం రూ.1.35 లక్షల కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేసింది. అయితే ఇందులో రిలీజ్చేసిన నిధులు సగం మాత్రమే. మొత్తం రూ.79 వేల కోట్లు ఖర్చు చేసింది. అంటే ప్రతి ఏడాది యావరేజ్‌గా నాలుగు డిపార్ట్మెంట్లలో రూ.9 వేల కోట్ల ఖర్చు
చేసింది.
ఎక్కువ శాతం ఉన్నోళ్లను పట్టించుకోలే
రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ప్రభుత్వం ప్రతిఏటా బడ్జెట్లో చేస్తున్న కేటాయింపులు 4% మించడం లేదు. కేటాయించిన మొత్తంలో ఖర్చు చేస్తున్నది 2% నుంచి 3 శాతమే ఉంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ సంక్షేమానికి మొత్తంగా రూ.37,862 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో ఖర్చు చేసింది రూ.24,487 కోట్లు మాత్రమే. అనేక సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోలేదు. సబ్సిడీ స్కీములు అటకెక్కాయి. కల్యాణ లక్ష్మీ, ఫీజు రియింబర్స్‌మెంటుకు తూతూమంత్రంగా నిధులు విడుదల చేశారు. స్కాలర్‌షిప్‌ల కోసం రెండేండ్లు ఆగాల్సిన పరిస్థితి ఉంది.
ఎస్సీ వెల్ఫేర్ దారుణం
రాష్ట్రంలో దళితులకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు. మూడెకరాల భూమి, సబ్సిడీ లోన్లు.. ఇట్ల సర్కారు ఇచ్చిన హామీలన్నీ పత్తా లేకుండా పోయాయి. దళితబంధు అని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ పైలెట్‌ప్రాజెక్టు మినహా.. స్కీమ్ ముందుకు పడ్తలేదు. స్కీములు ప్రకటించడం, బడ్జెట్లో నిధులు కేటాయించడం తప్ప.. ఫండ్స్రిలీజ్చేసి వాటిని అమలు చేయడం లేదని దళితులు మండిపడుతున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారెజ్ ఇన్సెంటివ్స్ ఇస్తలేరు. ఎస్సీ డెవలప్మెంట్ కింద రూ.55,655 కోట్ల కేటాయించగా, రూ.29,188 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
ఎస్టీ, మైనార్టీల సంక్షేమం అంతంతే
ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు నామమాత్రంగా ఉన్నది. ఈ రెండు శాఖలకు కలిపి ఏటా చేస్తున్న యావరేజ్ ఖర్చు రూ.2,500 కోట్లు దాటడం లేదు. ఎస్టీలకు ఈ తొమ్మిదేండ్లలో రూ.25,453 కోట్లు కేటాయించగా, రూ.16,503 మాత్రమే ఖర్చు కోట్లు చేశారు. నెలకు వంద యూనిట్ల ఉచిత కరెంట్ అమలుకావడం లేదు. గిరిజన బంధు ఇస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్‌ను పక్కకు పెట్టారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే తప్ప వాటికి కనీస సౌలతులను కల్పించలేదు. మైనార్టీ వెల్ఫేర్‌లో షాదీ ముబారక్, రంజాన్ పండుగలకు చేసే ఖర్చులు, హజ్ యాత్ర అంతకు మించి ఇంకా ఏమి చేయడం లేదు.