ఇనుము దొంగతనం చేశారనే అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

ఇనుము దొంగతనం చేశారనే అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

పట్నా : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇనుప ముక్కలు దొంగతనం చేశారనే కారణంతో ఇద్దరు వ్యక్తులను స్తంభానికి కట్టేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలేం జరిగింది..? 
ముజఫర్‌పూర్‌ సమీపంలో కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ ఇనుప షెడ్లు వేశారు. గత వారం రోజుల నుంచి ఆ షెడ్లలో ఉన్న ఇనుమును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దర్ని స్థానికులు గుర్తించారు. పారిపోతున్న వారిని పట్టుకున్నారు. ఓ స్తంభానికి కట్టేసి.. ఇద్దర్ని చితకబాదారు.

పోలీసుల తీరుపై విమర్శలు 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దర్ని విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిద్దరు ఆ ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దర్ని స్తంభానికి కట్టేసి కొట్టడం ప్రారంభించిన గంట తర్వాత గానీ పోలీసులు అక్కడికి చేరుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.