
- షాంఘైలో లాక్‌డౌన్ ఎఫెక్ట్
- ఇండ్లకు పోకుండా ఆఫీసుల్లోనే నిద్రించాలని ఆదేశాలు
- 20 వేల మంది వర్కర్లు అక్కడే పడుకుంటున్నరు
షాంఘై: చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ దేశంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ సిటీ అయిన షాంఘైలో సోమవారం నుంచి లాక్‌డౌన్ విధించారు. దీంతో సిటీలో ఉన్న 2.6 కోట్ల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. ఫైనాన్షియల్ సిటీ కావడంతో ఆర్థికంగా నష్టం కలగకుండా, వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా జరిగేందుకు పలు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లకుండా రాత్రిపూట ఆఫీసుల్లోనే పడుకొనే ఏర్పాట్లు చేశాయి. షాంఘైలో లాక్‌డౌన్ విధించడానికి ముందు కొన్ని కంపెనీలు తమ హెడ్‌లను, ఉద్యోగులను పిలిపించి రాత్రిపూట ఇక్కడే ఉండాలని ఆదేశాలిచ్చాయి. రాత్రిళ్లు ఉండేందుకు అవసరమైన స్లీపింగ్ బ్యాగ్‌లు, ఇతర సామగ్రిని సిద్ధం చేశాయి. అలాగే మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను 2 టీమ్‌లుగా చేసి, రొటేషన్ పద్ధతిలో పనిచేయిస్తున్నాయి. షాంఘైలోని లూజియాజుయ్ జిల్లాలో 285 ఆఫీసు టవర్లలో 20 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో బ్యాంక్ ఉద్యోగులు, ట్రేడర్స్, ఇతర వర్కర్లు ఉన్నారు. వీరందరూ ఆఫీసుల్లోనే నిద్రిస్తున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్‌లో కూడా ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరికొంత మంది వైట్‌కాలర్ కార్మికులు, శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని ఆ జిల్లా పరిపాలన విభాగం వెల్లడించింది. తమ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, అలాగే కీలకమైన ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఆఫీసుల్లోనే నిద్రపోతున్నారని, వ్యాపార కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూసుకుంటున్నారని అముంది బీవోసీ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది.