ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రక్షణలు, హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతపు మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం రిజర్వ్ చేసి ఉంచాలి.
కాలక్రమంలో కోట్ల రూపాయల తెలంగాణ మిగులు నిధులను ఆంధ్రకు తరలించారు. తెలంగాణ ప్రాంత రిజర్వు నిధులు, ఆబ్కారీ ఆదాయం తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాల్సి ఉండగా అలాంటి విధానం అమలు జరగలేదు. 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మిగులు నిధులు లెక్క తేల్చడం కోసం కుమార్ లలిత్, వశిష్ట భార్గవ కమిటీలను ఏర్పాటు చేశారు.
కుమార్ లలిత్ నివేదిక
1969, జనవరి 19న కుదిరిన అఖిలపక్ష ఒప్పందం ప్రకారం తెలంగాణలో మిగులు నిధుల లెక్కింపు కోసం అకౌంటెంట్ జనరల్ లలిత్‌ను భారత ఆడిటర్ జనరల్ నియమించింది. 1969 జనవరి 23న అందిన లేఖతో కుమార్ లలిత్ తెలంగాణలోని మిగులు నిధులను లెక్కించడానికి నియామకమయ్యారు.
ఆయన 1969 జనవరి 24న హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం 1969 జనవరి 27న లేఖ ద్వారా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య కేటాయింపులు, ఖర్చులకు సంబంధించి ఆర్థికశాఖ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులను తెలియజేయాల్సిందిగా కోరారు.
1969 జనవరి 31న కుమార్ లలిత్ ప్రభుత్వానికి మరో లేఖ ద్వారా 275వ అధికరణ క్రింద గ్రాంటు కేటాయించే పద్ధతి గురించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఖర్చుకు కేటాయిస్తున్న ప్రాతిపదిక గురించి, చట్టబద్ధమైన బోర్డులు, కార్పొరేషన్లు మొదలైన సంస్థలకు సంబంధించిన ఒప్పందంలో స్పష్టమైన ఉద్దేశాల గురించి తెలపాల్సిందిగా కోరారు.
Also Read :- ఎయిర్‌క్వాలిటీ లైఫ్ఇండెక్స్–2024
దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 1969 ఫిబ్రవరి 3న కుమార్ లలిత్‌కు లేఖ రాస్తూ 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి రెండు ప్రాంతాల మధ్య రెవెన్యూ రాబడి కేటాయింపు, ఖర్చుల విషయంలో అంగీకరించిన సూత్రాలు గల నకళ్లను అందజేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఖర్చు విషయంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చేసిన కేటాయింపు 1967 ఏప్రిల్ 3న ప్రభుత్వం జారీ చేసి జీవో 104ను కుమార్ లలిత్‌కు లేఖ ద్వారా ప్రభుత్వం పంపింది.
విద్యకు సంబంధించి ప్రభుత్వం 1961 జులై 10న జారీ చేసిన జీవో నెం 2350ను అమలుపర్చమని తెలిపింది. 1969 జనవరి 19న కుదిరిన అఖిలపక్ష ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 28 నాటికి లలిత్ తన నివేదికను పంపాలి. కానీ ప్రభుత్వం కుమార్ లలిత్ కోరిన కొన్ని వివరణలను మార్చి 7న అందజేయడం మూలంగా ప్రభుత్వం కోరిన తేదీకి నివేదిక సమర్పించడం సాధ్యం కాలేదు. ఈ నివేదికను 1969 మార్చి 14న విడుదల చేశారు. ఈ కమిటీ రూ.34.10 కోట్లు మిగులు నిధులుగా తేల్చింది.
ఈ కమిటీ ప్రధాన లక్ష్యం తెలంగాణను ఎంత వరకు నిధుల విషయంలో నిర్లక్ష్యం చేశారో తెలుసుకోవడం. 1969 ఏప్రిల్ 11న ప్రధాని ఇందిరాగాంధీ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కమిటీని నియమించారు.
వశిష్ట భార్గవ కమిటీ
తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన మిగులు నిధుల నికర మొత్తాన్ని నిర్ణయించడం కోసం 1969 ఏప్రిల్ 23న భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూ ర్తి వశిష్ట భార్గవ నేతృత్వంలో ఒక ఉన్నత అధికార సంఘాన్ని నియమించారు. ఈ కమిటీలో ఆసియా విద్యా సంస్థ డైరెక్టర్ ప్రొ. మకుట్ నిహారీ మధుర్, అడిషనల్ డిప్యూటీ కంట్రోలర్, ఆడిటర్ జనరల్ హరిభూషణ్ భార్ సభ్యులు కాగా, సభ్య కార్యదర్శిగా టి.కృష్ణ స్వామి వ్యవహరించారు.
పరిశీలించిన అంశాలు
తెలంగాణ మిగులు నిధులు వినియోగానికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందాలు. 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు మిగులు నిధులకు సంబంధించిన వివిధ అంచనాలను, ఖర్చు కాకుండా ఉన్న మిగులు నిధులను, ఈ అంచనాల పై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించడం.
ఉభయ ప్రాంతాల పెద్దల మధ్య జరిగిన ఒప్పందాలను అనుసరించి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సి ఉన్న మొత్తం ఎంత మేరకు ఉంటుందో కూడా ఈ కమిటీ నిర్ధారించడం.
1968 మార్చి 31 నాటికి ఖర్చు కాకుండా ఎంత మిగులు నిధులు ఉన్నాయో లెక్క కట్టడం.. విశిష్ట భార్గవ కమిటీ 1968 మార్చి 31 వరకు ఖర్చు కాని మిగులు నిధుల మొత్తం 2834.31 లక్షలు(28.34కోట్లు)గా నిర్ధారించారు.
కుమార్ లలిత్ కమిటీ నిర్ధారించిన రూ.34.10కోట్లు తక్కువగా తేల్చింది. భార్గవ కమిటీ నివేదికను తెలంగాణ ప్రాంత నాయకులు, ప్రాంతీయ కమిటీ వ్యతిరేకించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 1970 ఫిబ్రవరి 18న వశిష్ట భార్గవ కమిటీ నివేదికను ఆమోదించి తెలంగాణ ప్రాంత మిగులు నిధులు ఖర్చు పెట్టకపోవడం మూలంగా తెలంగాణ అధికంగా వెనుకబడి పోయిందని తెలిపింది.
1968 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై నాలుగో పంచవర్ష ప్రణాళిక ముగిసే లోపు రూ.45కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ రూ.45కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంటుగా మంజూరు చేసింది. దీంతో మిగులు నిధులు అంతమయ్యాయి.
కుమార్ లలిత్, భార్గవ నివేదికలపై స్పందన
ఈ నివేదికను తెలంగాణ ప్రాంతీయ కమిటీ, మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యులు, ఆర్థిక శాస్త్రవేత్త సి.హెచ్.హనుమంతరావులు ఆమోదించలేదు.
కుమార్ లలిత్ ఇచ్చిన నివేదికలోని రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయాలకు సంబంధించిన మిగులు నిధులు లెక్కగట్టే విషయంలో ప్రొ. హనుమంతరావు మూడు అంశాలపై విభేదించారు.
-
తెలంగాణ మిగులు నిధులను 1968 నాటి రూపాయి విలువ ప్రకారం లెక్కకట్టాలి లేదా మిగులు నిధులకు వడ్డీ కలపాలి. కాని కమిటీ ఈ పద్ధతులను అనుసరించలేదు.
-
లలిత్ కమిటీ, భార్గవ కమిటీ పెట్టుబడి వ్యయంలో తెలంగాణ వాటాను మూడింట ఒక వంతుగా గుర్తించారు. జనాభాను, వెనుకబాటుతనాన్ని పాతిపదికగా తీసుకుంటే తెలంగాణ వాటా పెరుగుతుంది. జనాభా ఆధారంగా వెనుకబాటుతనాన్ని చూస్తే తెలంగాణకు దక్కాల్సిన భాగం 37.5శాతం అవుతుందని ప్రొ. హనుమంతరావు లెక్క కట్టారు.
-
ఆంధ్ర ప్రాంతానికి దక్కాల్సిన వాటా కంటే అదనంగా చేసిన ఖర్చులో సగం తెలంగాణకు కూడా రావాలి. కాబట్టి రెవెన్యూ ఖాతాలో ఆంధ్ర లోటులో సగం తెలంగాణ మిగులుగా పరిగణించాలి. ఈ మూడు అంశాలను పరిగణిస్తే తెలంగాణ మిగులు పెరుగుతుంది.
ఈ పద్ధతుల ప్రకారం లెక్క కట్టినట్లయితే తెలంగాణ మిగులు నిధులు 117.45 కోట్లు ఉంటాయని ప్రొ. హనుమంతరావు తెలిపారు.