
- పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పెట్టుకొని 80 కి.మీ నుంచి డ్రింకింగ్ వాటర్
- మిషన్ భగీరథ స్కీం చిత్రాల్లో ఇదొకటి
- క్వాలిటీ లేని మోటర్లు, పైప్ లైన్లకు తరుచూ రిపేర్లు
- తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న జనాలు
జగిత్యాల, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పక్కనే గోదావరి నది పారుతూ ఉంటుంది. ఎల్లంపల్లి నిర్మాణంతో బ్యాక్‌వాటర్ అంతా ఈ టెంపుల్ టౌన్ ను ఆనుకొనే ప్రవహిస్తోంది. ఇక్కడ ఏ కాలంలో చూసినా నీళ్లు కనిపిస్తాయి. కానీ, ధర్మపురి పట్టణంలోని నల్లాల్లో మాత్రం వారానికోసారి కూడా నీళ్లు రావట్లేదు. మిషన్ భగీరథ స్కీంలో ప్లానింగ్ లోపమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. పట్టణాన్ని ఆనుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉన్నా దానిని పక్కనపెట్టి సుమారు 80 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ సప్లై చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. అంత దూరం నుంచి నీళ్లను సప్తై చేసే క్రమంలో తరుచూ పైపులు పగులుతూ రిపేర్లవుతుండడంతో రోజుల తరబడి ధర్మపురి గొంతెండుతోంది. దీంతో గుక్కెడు నీటి కోసం జనం బిందెలు, డ్రమ్ములను రోడ్లకు అడ్డంగా పెట్టి, ఆందోళనలు చేయాల్సి వస్తున్నది.
ఇక పాత స్కీమే దిక్కా?
ధర్మపురితో పాటు మండలంలోని 50 గ్రామాలకు తాగునీరుందించేందుకు 2008లో రక్షిత మంచినీటి పథకం కింద అప్పటి ప్రభుత్వం కమలాపూర్ బొల్లెం చెరువు వద్ద ఫిల్టర్ బెడ్స్ , పైప్‌లైన్ నిర్మాణానికి సాంక్షన్ ఇచ్చింది. ఇందుకోసం రూ.16 కోట్లు మంజూరు చేయగా రూ.8 కోట్లు రిలీజయ్యాయి. ఈ ఫండ్స్‌తో ఫిల్టర్‌బెడ్, కొంతదూరం పైపులైన్ వేశాక నాటి ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రస్తుతం డబ్బా నుంచి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ తరచూ డ్యామెజ్ అవుతుండడంతో ఆ నీళ్లపై ఆశలు వదిలేసుకున్న ఆఫీసర్లు బొల్లెం చెరువు నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ కు లింక్ పనులను రూ. 2 కోట్ల తో పూర్తి చేశారు. కానీ, ఈలోగా చెరువు ఎండిపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో బొల్లెం చెరువును గోదావరి నీటితో నింపేందుకు కొత్త పైప్ లైన్ వేయాలని ధర్మపురికి చెందిన
కౌన్సిలర్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా ఆఫీసర్లు ఎలాంటి ప్రపోజల్స్ పంపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
భగీరథ ప్లానింగ్ లోపం.. ధర్మపురికి శాపం..
మిషన్ భగీరథ స్కీం ప్లానింగ్ లోపాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. పట్టణాలతో పాటు వివిధ హ్యాబిటేషన్ల చుట్టుపక్కల ఉన్న నీటివనరులను వదిలిపెట్టి ఒకే సోర్స్ నుంచి నియోజకవర్గం మొత్తానికి వాటర్ సప్లై చేయాలనే సర్కారు నిర్ణయం కొత్త సమస్యలు తెచ్చిపెడ్తున్నది. ధర్మపురిలో ఇటీవల తలెత్తిన తాగునీటి సమస్యకు ఇదే కారణంగా కనిపిస్తోంది. జగిత్యాల జిల్లాకు సరఫరా చేసే మిషన్‌భగీరథ వాటర్ మొత్తం కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని డబ్బాలో ఏర్పాటుచేసిన వాటర్ గ్రిడ్ ద్వారా జరుగుతోంది. ఈ జిల్లాలో భగీరథ స్కీమ్కింద 1,130 కిలో మీటర్లు ట్రంక్ పైప్ లైన్, 2,200 కిలోమీటర్లు ఇంటర్నల్ పైప్ లైన్ వేశారు. ధర్మపురికి సైతం డబ్బా వాటర్ గ్రిడ్ నుంచే వాటర్ సప్లై చేసేందుకు 80 కిలో మీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేశారు. 13 వేలకు పైగా జనాభా ఉన్న ధర్మపురికి రోజుకు 15.5 లక్షల లీటర్ల నీళ్లు అవసరం కాగా, అంతదూరం నుంచి ఆ స్థాయిలో వాటర్ సప్లై జరగడం లేదు. మోటర్లు తరుచూ రిపేర్‌కు రావడం, క్వాలిటీ లేని పైపులు పగులుతుండడంతో ధర్మపురి టౌన్‌కు వారాలకొద్దీ సప్లై నిలిచిపోతోంది. ముఖ్యంగా నక్కల పేట్, కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ కాలనీ, 8వ వార్డు, బ్రాహ్మణవాడ, తెనుగు వాడ కాలనీలో సమస్య తీవ్రంగా ఉంది.
వారానికి నాలుగు రోజులు నీళ్లు బంద్
వారంలో మూడు, నాలుగు రోజులు భగీరథ నీళ్లు వస్తలేవు. మంచినీళ్ల కోసం తిప్పలు పడుతున్నం. ఊళ్లో ఉన్న బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. ఫిల్టర్ నీళ్లను ఒక్కో డబ్బా రూ. 20 పెట్టి కొనుక్కుని తాగాల్సి వస్తోంది. మున్సిపల్ కమిషనర్, పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా సమస్య తీరలేదు. నాలుగేండ్లుగా ఇదే గోస. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలి.
- నాగలక్ష్మి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ధర్మపురి
బొల్లెం చెరువుకు పైప్ లైన్ వేయాలి
కమీషన్ల కోసమే 80 కిలోమీటర్ల నుంచి భగీరథ పైప్ లైన్ వేశారు. నాసిరకం పైపులు వేయడం వల్ల లీకేజీలు, డ్యామేజీలు జరుగుతున్నాయి. ఇటీవల కమలాపూర్ బొల్లెం చెరువు ఫిల్టర్ బెడ్ కు మిషన్ భగీరథ పైప్ లైన్ అనుసంధానం చేసినా చెరువు ఎండిపోయి నీటిసరఫరా జరగడంలేదు. గోదావరి నీటిని చెరువులో నింపేందుకు పైపులైన్ వేయాలి.
- అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ ప్రెసిడెంట్