ఈస్ట్‌ యూపీలో అఖిలేశ్‌పైనే ఆశలు

ఈస్ట్‌ యూపీలో అఖిలేశ్‌పైనే ఆశలు

ఉత్తరప్రదేశ్‌‌ తూర్పు ప్రాంతంలో వచ్చే రెండు విడతల్లో జరగబోయే లోక్‌‌సభ ఎన్నికలు ఎస్పీ చీఫ్‌‌ అఖిలేశ్‌‌ యాదవ్‌‌కు పెద్ద పరీక్ష కాబోతోంది.  ఈనెల 12న 14 సీట్లలో, 19న 13 సీట్లలో మొత్తం  27 స్థానాలకు   పోలింగ్‌‌  జరగనుంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిలో భాగంగా  బీఎస్పీ ఈ రీజియన్‌‌ నుంచి 17 మంది కేండిడేట్లను బరిలోకి దింపింది. ఈ నియోజవర్గాల పరిధిలోని ఓబీసీ ఓట్‌‌ బ్యాంక్‌‌ను అఖిలేశ్‌‌ యాదవ్‌‌ బీఎస్పీకి ఎలా ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యేలా చేస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకుముందున్న శత్రుత్వాన్ని  పక్కనపెట్టాలని,  దళితులు, ఓబీసీ మధ్య గల విభేదాలు  మరిచిపోవాలని అఖిలేశ్‌‌ పార్టీ కేడర్‌‌కు చెబుతున్నారు. సంప్రదాయ ఓటు బ్యాంకును ఎస్పీ చీఫ్‌‌ ఏమేరకు  బీఎస్పీకి బదిలీచేస్తారన్నదానిపైనే  ఆపార్టీ కేండిడేట్ల గెలుపు అవకాశాలు ఆధారపడతాయని  రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఈ 27 స్థానాల్లో బీఎస్పీ రూరల్‌‌ నియోజకవర్గాల్లో, ఎస్పీ అర్బన్‌‌ నియోజకవర్గాల్లో తమ కేండిడేట్లను బరిలోకి దింపింది.  కూటమికి ముఖ్యంగా బీఎస్పీ కేండిడేట్లకు తప్పకుండా ఓటేయాలంటూ అఖిలేశ్‌‌ యాదవ్‌‌   తన కులంవారిని  కోరుతున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడకుంటే ఇవే ఆఖరు ఎన్నికలని కూడా పార్టీ నాయకులకు వార్నింగ్‌‌ ఇస్తున్నారు. ఎస్పీకి రాజీనామా చేసి ఖలీలాబాద్‌‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌ టికెట్‌‌పై పోటీచేస్తున్న  భాల్‌‌ చంద్‌‌ యాదవ్‌‌కు కొంతమంది యాదవ నాయకులు  పనిచేస్తున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే అఖిలేశ్‌‌ అక్కడకు వెళ్లి పెద్ద సభను పెట్టారు.  ఆ వేదిక నుంచే  కాంగ్రెస్‌‌కు సపోర్ట్‌‌చేసే నాయకులకు గట్టిగా  వార్నింగ్‌‌ ఇచ్చారు. మాయావతి కూడా దళిత ఓట్లను ఎస్పీకి ట్రాన్సఫర్‌‌ చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. మొదటిసారిగా పాతశత్రువైన ములాయమ్‌‌ సింగ్‌‌ యాదవ్‌‌ను తన ప్రచారంలో బీఎస్పీ చీఫ్‌‌ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.