మంత్రులకు శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

మంత్రులకు శాఖలు కేటాయించిన  మహారాష్ట్ర సీఎం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు హోం, ఫైనాన్స్ శాఖలు కేటాయిస్తూ సీఎం ఏక్నాథ్ షిండే ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరే ఉన్న మహారాష్ట్ర కేబినెట్లో ఇటీవలే మరో 18మంది చేరారు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, మైనారిటీ, రవాణా, విపత్తు నిర్వహణ శాఖలను షిండే తన వద్దే ఉంచుకున్నారు. రాధాకృష్ణ పాటిల్ కు రెవెన్యూ శాఖ, సుధీర్ ముంగంటీవార్ కు అటవీ శాఖలను కేటాయించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అయిన చంద్రకాంత్ పాటిల్కు ఉన్నత, సాంకేతిక విద్య, దీపక్ కేసర్కర్కు పాఠశాల విద్య, అబ్దుల్ సత్తార్కు వ్యవసాయ శాఖలను కేటాయించారు.  

ఈ నెల 9న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగింది. బీజేపీకి నుంచి 9, శివసేన నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ పాటిల్, రవీందర్ చౌహన్, మంగళ్ ప్రభాత్, విజయ్ కుమార్, అతుల్ సవే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక శివసేన నుంచి దాదా బహుసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, అబ్దుల్ సత్తర్, ఉదయ్ సమంత్, గులాబ్ రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, సందీపన్, తానాజీ సవంత్ మంత్రలుగా ప్రమాణం చేశారు. 

కాగా జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎంగా..ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అప్పటినుంచి ఇద్దరితోనే కేబినెట్ కొనసాగుతోంది. అయితే నెల రోజులకుపైగా ఇద్దరితోనే కేబినెట్ కొనసాగడంపై పలు విమర్శలు రావడంతో మంత్రి వర్గాన్ని విస్తరించారు సీఎం షిండే.