గ్రేటర్ ​వరంగల్​లో..‘డబుల్’ ఇండ్ల లొల్లి!

గ్రేటర్ ​వరంగల్​లో..‘డబుల్’ ఇండ్ల లొల్లి!
  • పూర్తయిన 592 ఇండ్లను పంచని గత ప్రభుత్వం
  • ఏండ్లుగా ఎదురు చూస్తున్న గుడిసె వాసులు
  • ఇటీవల ప్రభుత్వం మారగానే ఆక్రమించుకునే ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. ఇండ్ల వద్ద కొనసాగుతున్న పహారా

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్​పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్​ఇండ్ల కోసం నిరుపేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇండ్ల కోసం గుడిసెలు ఖాళీ చేసిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కండ్ల ముందు పూర్తయిన ఇండ్లు కనిపిస్తున్నా.. వాటిని పొందలేకపోతున్నారు. కొన్నేండ్లుగా వాటి కోసం కొట్లాడుతూనే ఉన్నారు. గుడిసె వాసుల కోసమే డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కడుతున్నామని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ పంపిణీ చేయడంలో తాత్సారం చేసింది. అర్హులైన పేదలకు పంచక ముందే ప్రభుత్వం మారిపోయింది. ఇండ్ల కోసం ఎదురు చూసి.. చూసి.. విసిగిపోయిన గుడిసెవాసులు ఇటీవల ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం రాగానే బలవంతంగా గృహ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇండ్ల వద్ద పోలీస్​పహారా కొనసాగుతోంది. చేసేదేం లేక గుడిసెవాసులు మళ్లీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని, సర్వే చేసి లబ్ధిదారులందరికీ ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు.

కేసీఆర్​హామీతో గుడిసెలు ఖాళీ

2015 జనవరిలో కేసీఆర్ మొదటిసారి సీఎం హోదాలో వరంగల్ వచ్చారు. మూడు రోజుల పాటు ఇక్కడే బస చేశారు. సిటీలోని లక్ష్మీపురం, ప్రగతినగర్, గాంధీనగర్, గరీబ్ నగర్, ఎస్.ఆర్.​నగర్, గిరిప్రసాద్ నగర్, దీన్ దయాల్ నగర్, అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్​నగర్ తదితర స్లమ్ ఏరియాల్లో పర్యటించారు. గుడిసెలన్నీ తొలగించి అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో గుడిసెవాసులంతా సంబురపడ్డారు. బాలసముద్రం పరిధి1066 సర్వే నంబర్ లోని స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్న అంబేద్కర్​నగర్, జితేంద్రనగర్ వాసులందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఆ వెంటనే రెండు కాలనీల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న 600 కుటుంబాలు స్థలాన్ని ఖాళీ చేశాయి. కొందరు ఇతర ప్రాంతాల్లోని కిరాయి ఇండ్లకు వెళ్లగా, మిగిలినవారంతా పక్కనే ఉన్న ప్రైవేట్​స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

2018లోనే ఇస్తమన్నరు.. కానీ

అంబేద్కర్​నగర్​లో 37 బ్లాకుల్లో 16 ప్లాట్ల చొప్పున మొత్తం 592 ఇండ్ల నిర్మాణం చేపట్టి 2018లోనే పనులన్నీ పూర్తి చేశారు. 2018 ఎన్నికలకు ముందే పంపిణీ చేస్తామని చెప్పారు. తర్వాత ఎన్నికల కోడ్​ను సాకుగా చూపి లబ్ధిదారులకు కేటాయించలేదు. మరోసారి బీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చినా, ఇండ్లు పంచలేదు. బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ నిరుపేదలంతా గుడిసెల్లోనే మగ్గుతున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు చెందిన కొందరు లీడర్లు డబుల్​బెడ్ రూమ్​ఇండ్లను అమ్ముకోవడంతోనే పంపిణీ ముందుకుసాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గుడిసె వాసులు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఎవరూ స్పందించడం లేదు. 2022 ఏప్రిల్ 20న వరంగల్ సిటీకి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ గుడిసెవాసుల్లో ఓ ఆరుగురికి ఇండ్లు కేటాయిస్తూ ఆర్డర్​ కాపీలు ఇచ్చారు. మిగతా వాళ్లకు లోకల్ లీడర్లు ఇస్తారని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఏ ఒక్కరికీ అలాట్​మెంట్ కాపీలు అందలేదు. ఆర్డర్ కాపీ పొందినవాళ్లను కూడా ఇండ్లలోకి అనుమతించలేదు. దాంతో అప్పట్లో గుడిసెవాసులంతా ఆందోళనకు దిగారు.

ఇండ్లకు పోలీసుల కాపలా

బీఆర్ఎస్​ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన గుడిసెవాసులు ఇటీవల మూకుమ్మడిగా ఇండ్లను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఓడిపోయారని తెలిసిన తర్వాత రోజే ఇండ్ల వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఇండ్లు కేటాయించేలా చూస్తామని సర్ది చెప్పి కలెక్టర్​ను కల్పించారు. అయితే ఇంతవరకు వారికి ఇండ్లు దక్కలేదు. ఎవరూ ఆక్రమించుకోకుండా పోలీసులు 24 గంటలూ కాపలా ఉంటున్నారు.

తూర్పులో కూడా ఇదే పరిస్థితి

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,250 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తి కాకపోగా.. ఇంటర్నల్​ వర్క్స్ అన్నీ పెండింగ్​లోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండ్ల ముందు వరకు పెయింటింగ్స్ వేసి, ఓట్ల కోసం వాటిని పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్​ చేద్దామనుకున్నా షెడ్యూల్ బిజీ కారణంగా ఓపెనింగ్​చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో అక్కడి ఇండ్లు కూడా లబ్ధిదారులకు దక్కలేదు.

ఇండ్ల కోసం కొట్లాడుతూనే ఉన్నం

గుడిసెలు ఖాళీ చేయించి నిర్మించిన ఇండ్లను అర్హులకు కేటాయించాలి. ఈ విషయమై కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నాం. గత ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. ఎవరూ స్పందించలేదు. ఇండ్లు ఇస్తలేరు. కాంగ్రెస్​ప్రభుత్వ పెద్దలు, అధికారులైనా కనికరించాలి. నిరుపేదలకు ఇండ్లు పంపిణీ చేయాలి.
- ఎర్ర చంద్రమౌళి, అంబేద్కర్ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు

ఎనిమిదేండ్లుగా ఎదురు చూస్తున్నాం

డబుల్​బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామంటే అప్పటికప్పుడు ఇండ్లు ఖాళీ చేసినం. దగ్గర్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నం. 8 ఏండ్లుగా అక్కడే ఇబ్బందులు పడుతున్నాం. ఇండ్లు పూర్తయినా పంచుతలేరు. బీఆర్ఎస్ హయాంలో కొంతమందికి ఇండ్లు ఇస్తామని లెటర్లు ఇచ్చిన్రు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. ఒక్కరికీ ఇల్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా చొరవ తీసుకోవాలి. గుడిసెలు ఖాళీ చేసిన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి.

- శిల్ప, స్థానికురాలు, అంబేద్కర్​నగర్