ఇంటర్, డిగ్రీ, గురుకుల కాలేజీల్లో సెకండ్​ లాంగ్వేజీగా సంస్కృతం

ఇంటర్, డిగ్రీ, గురుకుల కాలేజీల్లో సెకండ్​ లాంగ్వేజీగా సంస్కృతం
  • పోస్టుల వివరాలు పంపాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్, డిగ్రీ, గురుకుల కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా సంస్కృతం సబ్జెక్టును పెట్టే విషయంలో సర్కారు వెనక్కి తగ్గడం లేదు. ఇంటర్ లోనే ఈ ప్రయోగం చేస్తారని నిన్నటి వరకూ అంతా అనుకున్నారు. తాజాగా డిగ్రీ కాలేజీలతో పాటు అన్ని గురుకులాల్లోనూ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతం సెకండ్ లాంగ్వేజీగా హిందీ, ఉర్దూ, అరబిక్.. తదితర సబ్జెక్టులున్నాయి. గత నెలలో అన్ని సర్కారు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజీగా అమలు చేయాలని బోర్డు సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఉత్తర్వుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిఫరెన్స్ అని పేర్కొనడం గమనార్హం. దీనిపై తెలుగు భాషా సంఘాలు, లెక్చరర్ల సంఘాలు ఆందోళనకు దిగడంతో అమలు చేయబోమని ఇంటర్ బోర్డు హామీనిచ్చింది. కానీ తాజాగా హయ్యర్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రటరీ ఉత్తర్వుల్లో ఇంటర్​తో పాటు డిగ్రీ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోనూ అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రొఫార్మా ప్రకారం సంస్కృతం పోస్టుల వివరాలను పంపించాలని ఆర్థికశాఖ ఇప్పటికే ఇంటర్మీడియట్, కాలేజీ విద్యాశాఖ కమిషనర్లను ఆదేశించారు. దీంతో ఎక్కడెక్కడ పోస్టులు అవసరమనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.  
తెలుగుపై ఎఫెక్ట్ 
టెన్త్ వరకూ అన్ని స్కూళ్లలో తెలుగు సబ్జెక్టు చెప్పాలని 2018లో  ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ స్కూళ్లతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల స్కూళ్లలోనూ దీనిని అమలు చేస్తున్నారు. అయితే ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా సంస్కృతాన్ని పెట్టడం తెలుగు సబ్జెక్టుకు ఇబ్బందేనని లెక్చరర్లు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోయినా, నాలుగైదు ఏండ్లలో దీని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని లెక్చరర్లు, తెలుగు భాషాభిమానులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత రికమెండేషన్ లెటర్ తో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.    

సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నం 
ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్​ తీసుకున్న నిర్ణయానికి ఇది పూర్తి వ్యతిరేకం. కేంద్రమే మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చి, జేఈఈని తెలుగులో పెడ్తామని, బీటెక్ తెలుగులో బోధిస్తామని ప్రకటించింది. అయితే సంస్కృతంపై సర్కారుకు ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో చెప్పాలె. సర్కారు నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నం.                                     – మధుసూదన్​రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్