
కొందరు "ఎందుకూ పనికిరాం" అనుకుంటారు. ఇంకొందరు" నా వల్లకాదు". "నాకు టైం లేదు" అని ఫీలవుతుంటారు. మరికొందరు “నా తలరాత ఇంతే" అంటూ సోమరులుగా తయారవుతుంటారు. నిజానికి ఆ మాటలే వాళ్లను ముంచుతున్నాయని, పదిమందిలో ఎందుకు పనికిరానివాళ్లగా నిలబెడుతున్నాయని గుర్తించలేరు.
నావల్లకాదు
"నేను చేయలేను. నావల్లకాదు" అన్నది తమలో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించలేని వాళ్లు చెప్పే మాట. పని తప్పించుకోడానికి చెప్పే ముచ్చట. ఇతరులు చేసే పని "నేనెందుకు చేయలేను? నావల్ల ఎందుకు కాదు?" అని ప్రశ్నించుకోకుండా తమని తాము తక్కువ చేసుకోవటం వల్ల ఇలాంటి మాటలు వాడతారు. వీటివల్ల జీవితంలో వెనుకడుగు వేయడమే తప్ప ముందడుగు వేయలేరు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. మనుసుపెట్టి పనిచేస్తే... ఎవరూ మరొకరికంటే తక్కువకాదు, ఎక్కువ కాదు.
టైం లేదు
"నాకు టైం లేదు. ఉంటేనా...!" అని చెప్పడం పచ్చి అబద్ధం. విజయం సాధించిన వాళ్లకు, ఓడిపోయిన వాళ్లకూ... ఎవరికైనా ఉండేది 24 గంటలే. సమయాన్ని సరిగా వాడుకున్న వాళ్లు ముందుకెళ్తారు. వేస్ట్ చేసుకున్న వాళ్లు వెనకే ఉండిపోతారు. ఊహల్లో, మాటల్లో కాలాన్ని వృథా చేస్తే ఎవర్ని వాళ్లు మోసం చేసుకున్నట్లే....! టైం సెన్స్ లేకపోతే దేనికీ గ్యారెంటీ ఉండదు. సమయం విలువ తెలుసుకుంటే... "టైం లేదు" అనే అబద్ధాన్ని ఎవరూ వాడరు.
కలిసిరాదు
"నాకు ఏదీ కలిసిరాదు. నేను దురదృష్టవంతుడ్ని" అని చెప్పుకుంటూ, ఏ పనీ చేయకుండా కూర్చోవటం సోమరితనం. "నా బతుకు ఇంతే.. నాకు ఇలా రాసిపెట్టి ఉంటే. ఏవరేం చేస్తారు?" అని తమని తాము కించపరుచుకునే వాళ్లు పైకి ఎదగలేరు. అదృష్టాన్ని నమ్మేవాళ్లు అట్టడుగునే ఉండిపోతారు. పనిచేసినవాళ్లకు ఫలితం తప్పకుండా వస్తుంది. ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో లోపం ఉంటుందే కానీ, రాత కలిసిరాక కాదు. "నా నుదిటి రాత ఇంతే" అన్నది లోపాన్ని కప్పిపుచ్చుకోడానికి చెప్పే మాట. వందకు వందశాతం నిజం కాదు.
►ALSO READ | జ్యోతిష్యం : గురుడు.. శుక్రుడు.. కలయిక.. వ్యాపారస్తులకు అదృష్టయోగం.. ఎప్పటి వరకంటే..!
మాటలే శక్తి
మాటలతో మోసం చేసుకునే వాళు ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు. నమ్మకం పోగొట్టుకొని అందరిలో ఒంటరిగా మిగిలిపోతారు. ఒక మాట చెప్పే ముందు పదిసార్లు ఆలోచించాలి. మాట వ్యక్తిత్వానికి ప్రతిరూపం. ఉత్తకబుర్లు చెప్పుకునే వాళ్లు తమ గుంతను తాము తవ్వుకున్నట్లే.! మాట. నడతలో నిజాయితీ ఉండాలి. మాటలతో ఒక్కసారి చేతగానివాళ్లుగా ముద్రపడితే ఇక అంతే...! "మాటలు పాజిటివ్గా ఉంటే పనులూ పాజిటివ్ ఉంటాయి" అంటారు. సైకాలజిస్టులు.