కొండగట్టుపై కానరాని ఏర్పాట్లు

కొండగట్టుపై కానరాని ఏర్పాట్లు
  •     రేపటి నుంచి హనుమాన్ చిన్న జయంతి వేడుకలు 
  •     అసంపూర్తి పనులతో భక్తులకు ఇక్కట్లు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఏటా నిర్వహించే హనుమాన్ చిన్న, పెద్ద జయంతి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈసారి సోమవారం నుంచి మూడు రోజులపాటు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, ఏర్పాట్లు నత్తనడకన సాగుతుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఈ నెల 8న కొండగట్టు అధికారులతోపాటు రెవెన్యూ,హెల్త్, పంచాయతీరాజ్, పొలీసు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.

అన్నీ అలాగే వదిలేశారు.. 

ఉత్సవాలకు ఆలయాన్ని సుందరంగా అలంకరించి, భక్తులకు సౌకర్యాలు కల్పించవలిసిన అధికారులు.. పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడంతో శనివారం రాత్రి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గుట్టపై ప్రత్యేక షవర్లు, మహిళల డ్రెసింగ్ రూమ్​లు ఇంకా ఏర్పాటే కాలేదు. స్వాగత తోరణాలను నిర్లక్ష్యంగా వదిలేయడంతో బోసిపోయాయి.

ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ స్థలంలో షవర్లు పెడుతున్నారు. భక్తులకు ఎండవేడిమి నుంచి ఉపశమనాన్ని కల్పించే చలవ పందిర్లు, చలివేంద్రాల ఏర్పాటులోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.

ఆర్జిత సేవలు రద్దు

కొండగట్టులో పలు రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. గురువారం నుంచి యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయన్నారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం 

చిన్న జయంతి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాం. రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. వారి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం.
-  ఈఓ చంద్రశేఖర్