కేరళలో కాంగ్రెస్‌‌ జోష్‌

కేరళలో కాంగ్రెస్‌‌ జోష్‌
  • కేరళలో పోటీతో కేడర్ హేపీ
  • గట్టిపోటీ ఇస్తున్న ఎల్డీఎఫ్ కేండిడేట్స్
  • బీజేపీ సైతం బలంగానే

కేరళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వయనాడ్‌‌ లోక్‌‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో పార్టీ క్యాడర్‌ ఉత్సాహంగా ఉంది. గెలుపు ధీమాను పార్టీ వ్యక్తం చేస్తోంది. అధికారంలో ఉన్న లెఫ్ట్‌‌  కూటమికూడా వీలైనన్న ఎక్కువ సీట్లు గెలుచుకోడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.రాష్ట్రంలోని 20 లోక్‌‌సభ సీట్లలో గెలుపు కోసం బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్‌‌ జోష్‌ మీదుంది. వయనాడ్‌ లో కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ రాహుల్‌ గాంధీ పోటీచేయనుండడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాహుల్‌ రాకతో రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలోనూ ఎక్కువ సీట్లు సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్‌ ఎంట్రీతో పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన శత్రువు బీజేపీ మీద పోరాడకుండా తమ పార్టీని ఎదుర్కొనడాన్ని లెఫ్ట్‌‌ సీనియర్‌ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. అయితే రాహుల్‌ మాత్రం లెఫ్ట్‌‌ పార్టీలు తన్నెంతగా దూషించినా..వాళ్లను మాత్రం పల్లెత్తు మాట కూడా అననని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలోని 20 లోక్‌‌సభ స్థానాలకు ఈనెల 23న మూడో దశలో పోలింగ్‌ జరగనుంది.

విజయం కోసం బీజేపీ ఆశలు

ప్రధాన పోటీ యూడీఎఫ్ , ఎల్డీఎఫ్‌‌ కూటమి మధ్య ఉన్నా బీజేపీ మూడో శక్తిగా గట్టిపోటీ ఇస్తోంది. 2004 లోక్‌‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒ. రాజ్‌ గోపాల్‌ బీజేపీ టికెట్ పై విజయం సాధించారు. గత అసెంబ్లీ ( 140 సీట్లు )ఎన్నికల్లో ఒక సీటుతో ఖాతాను తెరిచింది.ఈసారి లోక్‌‌సభ ఎన్నికల్లో మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని ఆపార్టీ భావిస్తోంది. ఎల్డీఎఫ్‌‌ ముందుగానే ప్రచారం ప్రారంభించినా ఈసారి పదిసీట్లను గెలుచుకుంటామని కాంగ్రెస్‌‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ ముల్లపల్లి రామచంద్రన్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2004నాటి పరిస్థితి కాంగ్రెస్‌‌కు ( హస్తం పార్టీకిఆ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాలేదు)మళ్లీ వస్తుందని సీపీఎం స్టేట్‌ సెక్రటరీ కె.బాలకృష్ణ అంచనా వేస్తున్నారు. అనూహ్య విజయాలు తమకు ఉంటాయని బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ పి.ఎస్ శ్రీధరన్‌ పిళ్లై చెప్పారు.2014 లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరువనంతపురం నియోజకవర్గంలో రెండోస్థానంలో ఉండగా, మిగిలిన చోట్ల మూడో ప్లేస్‌‌ లో ఉంది. ఈసారి మాత్రం కమలం పార్టీ కాంగ్రెస్‌‌, లెఫ్ట్ కూటమికి గట్టిపోటీ ఇస్తుందని మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నా రు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌‌ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు రాష్ట్రంలో సుడిగాలిలా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఎల్డీఎఫ్‌ కు అనుకూల అంశాలు

  • ప్రజలకు మంచి పాలన అందించడం.
  • ఆరోగ్యం, విద్య, విమెన్‌‌ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు అమలుతీరు బాగున్నాయని ప్రజల ప్రశంసలు.
  • కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద అంశాలనుజనంలోకి తీసుకెళ్లడంలో విజయం సాధించడం.

రాహుల్‌ వయనాడ్‌‌ ఎంట్రీ కాం గ్రెస్‌ కు ఎంత లాభం?

  • ఈ ప్రాంతంలో కోల్పోయిన బలాన్నిమళ్లీ పెంచుకోవచ్చు.
  • దక్షిణాదిలో ఎక్కువ సీట్లనుగెలుచుకోవచ్చు.
  • ఎల్డీఎఫ్‌‌ను ఓడించేందుకుఇది మంచి అవకాశం.

పార్టీల ప్రచారాస్త్రాలు

  • 10-–50 ఏళ్ల మధ్య వయసున్న ఆడాళ్లు శబరిమల ఆలయప్రవేశానికి సంబంధించిన వివాదం.
  • ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ తీరునుఎల్డీఎఫ్‌‌, యూడీఎఫ్‌‌ నేతలు తప్పుపడుతున్నారు.
  • ఉత్తర కేరళలో రాజకీయ గొడవలు.
  • గత ఏడాది వచ్చిన వరదల నేపథ్యంలో ఎల్డీఎఫ్‌‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.