
- 60 స్థానాల్లో 32 సీట్లు గెలుచుకున్న కమలం
- సీట్లు, ఓట్లలో మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్
- కేవలం 5 స్థానాల్లో విజయం
- 7 సీట్లు సాధించిన ఎన్ పీపీ, జేడీయూ
ఇంఫాల్: మణిపూర్‌లో బీజేపీ విజయపు బావుటా ఎగరవేసింది. ఈ ఎన్నికల్లో 32 సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 31 సీట్ల కంటే ఒకటి ఎక్కవే గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని బీజేపీ స్టేట్ఆఫీసు ముందు పటాకులు పేల్చి, మిఠాయిలు పంచారు. సీఎం బీరెన్ సింగ్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు సంబురాల్లో పాల్గొని.. సంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో బీజేపీ 37.8 శాతం ఓట్లు సాధించింది. 17.3 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలుచుకొని మేఘాలయా సీఎం కొన్రాడ్కె సంగ్మాకు చెందిన నేషనల్‌పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 16.8 శాతం ఓట్లతో కేవలం ఐదు సీట్లను మాత్రమే గెలుచుకొని మూడో స్థానానికి పరిమితమైంది. బీహార్సీఎం నితీశ్కుమార్నేతృత్వంలోని జనతాదళ్(యూ) 10.8 శాతం ఓట్లు మాత్రమే సాధించినప్పటికీ ఆరు సీట్లు గెలుచుకోవడం గమనార్హం. 2017 మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జేడీయూ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు సాధించింది. 8.1 శాతం ఓట్లతో నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) ఐదు సీట్లలో విజయం సాధించింది. కుకీ పీపుల్స్ అలయెన్స్రెండు సీట్లు గెలుచుకుంది. ఇతరులు మూడు చోట్ల విజయం సాధించారు.
సీఎం విజయం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ విజయం సాధించారు. హింగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీ శరత్‌చంద్ర సింగ్‌పై 18,271 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజయం సాధించన తర్వాత బీరేన్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ నిర్ణయిస్తుందని తెలిపారు. థౌబల్నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్సీఎం అభ్యర్థి ఓంకార్ఇబోబీ సింగ్ తన సమీప ప్రత్యర్తి బీజేపీ అభ్యర్థిపై కేవలం 2,543 ఓట్ల స్వల్ప మెజారిటీలో గెలుపొందారు.
2017లో తక్కువ సీట్లు వచ్చినా..
2017 మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలిచింది. బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. కానీ నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్)కు చెందిన నలుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్‌పీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 31కు చేరుకుంది. బీరెన్ సింగ్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీరేన్ సింగ్ మళ్లీ సీఎం అవుతారా?
మణిపూర్ లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేన్ని సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే బీరేన్ సింగ్మళ్లీ సీఎం అవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. 28 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి పూర్తి మెజారిటీ వచ్చింది. అయితే సీఎం బీరేన్ సింగ్‌పై ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే ఈసారి ఆయనకు ఛాన్స్ ఉండదని పేర్కొంటున్నారు. ఇటీవలే ఎన్‌పీపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. బీరేన్ తీరు నచ్చకే వీరందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆయన్ను మార్చాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ జోక్యం చేసుకొని, సర్దుబాటు చేసింది. ఎన్‌పీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా చేసిన జోయ్‌కుమార్ సింగ్‌తోపాటు, బీజేపీకే చెందిన టీజీ విశ్వజిత్ సింగ్‌తో విబేధాలున్నాయి.