ఆదిలాబాద్ జిల్లాలో 28 నుంచి జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

ఆదిలాబాద్ జిల్లాలో 28 నుంచి జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
  •     భైంసా నుంచి  ఖానాపూర్ వరకు రూట్​మ్యాప్​ ఖరారు
  •     భారీ జనసమీకరణ కోసం లీడర్ల ప్రయత్నాలు
  •     వివిధ పార్టీల లీడర్ల చేరికపై ఫోకస్​

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ కోసం లీడర్లు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 28న భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​సారంగాపూర్ మండలం ఆడెల్లి మహా పోచమ్మను దర్శించుకొని భైంసాలో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. యాత్రకు జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్యకర్తలు, లీడర్లు తరలివచ్చే అవకాశం ఉంది. పాదయాత్రలో భాగంగా జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్ లో బహిరంగ సభల్లో బండి సంజయ్​ మాట్లాడనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రి లక్ష్యంగా సభలు ఉంటాయని లీడర్లు పేర్కొంటున్నారు. 

ఎనిమిది రోజుల యాత్ర...

భైంసాలో ప్రారంభమయ్యే యాత్ర జిల్లాలో ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. మాగామ, లింబ, ఓల, కుంటాల, అంబకంటి, నర్సాపూర్, నిర్మల్ పట్టణంలోని శాంతినగర్, వెంకటాపూర్, లక్ష్మణచాందా, మామడ, ఖానాపూర్ వరకు పాదయాత్ర ఉంటుంది. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ కాషాయం కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. పెంబి ఎంపీపీ భూక్య కవిత ఆమె భర్త టీఆర్ఎస్ సీనియర్ లీడర్​ గోవిందు బీజేపీలో చేరే అవకాశం ఉంది. 

తెలంగాణ ప్రజల ఆశయం నెరవేరలేదు

తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కార్​నడుచుకోవడంలేదని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామ్​నాథ్​ఆరోపించారు. బుధవారం ఆయన నిర్మల్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజలను జాగృతం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్​పాలనలో అందరూ మోసపోయారన్నారు. ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకుంటే... సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయకుండా అడ్డుకున్న ఘనత కేసీఆర్​కే దక్కిందన్నారు. రాష్ట్ర వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నిర్మల్ జిల్లాలో మంత్రి, ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన మహాసంగ్రామ యాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో లీడర్లు సాదం అర్వింద్, రాచకొండ సాగర్, తోట సత్యనారాయణ, అల్లం భాస్కర్, రామోజీ నరేశ్, ముడారపు దిలీప్, ఒడ్నాల రాజు,  దేవేందర్, ఒడిసెల శ్రీనివాస్, అయ్యన్నగారి రాజేందర్, రచ్చ మల్లేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.