ప్రజాదరణ ఉన్న నేతలపై కమలం ఫోకస్​

ప్రజాదరణ ఉన్న నేతలపై కమలం ఫోకస్​
  • ఉద్యమనేతలతో బీజేపీ చేరికల కమిటీ మంతనాలు
  •    టీఆర్​ఎస్​లో నామినేటెడ్​ పోస్టులు రాకపోతే బీజేపీలోకి సీనియర్ల జంప్​!
  • జోరుగా బీజేపీ ఆకర్ష్​

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో  బీజేపీ ఆపరేషన్​ ఆకర్ష్​ జోరందుకుంది. టీఆఎస్ సీనియర్ ​ లీడర్లపై, తెలంగాణ ఉద్యమ నేతలపై బీజేపీ ఫోకస్​ పెట్టింది. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో   పాగా వేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే టీఆర్​ఎస్​లో కీలక  నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు   పావులు కదుపుతోంది. బోధన్ నియోజకవర్గానికి చెందిన కీలక టీఆర్​ఎస్​ నేత మోహన్ రెడ్డి బీజేపీలోకి చేరేందుకు రెఢీ అయ్యారు. టీఆర్ఎస్​కు బుధవారం ఆయన రాజీనామా చేసి, నాలుగైదు రోజుల్లోనే బీజేపీలోకి చేరనున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతారని  చెప్పాడు. బోధన్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్  కు వ్యతిరేకత  ఉందని ఓ సర్వేలో తేలడంతో బీజేపీ ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు  చూస్తోంది. మోహన్​రెడ్డి కి మూడు మండలాల రైతులతో సత్సంబంధాలు ఉండడం, బోధన్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటం, ఆర్థికంగా కూడా పటిష్టంగా ఉండటంతో అతనికి బీజేపీ లోకి  గ్రీన్​ సిగ్నల్​ అందింది. 

నామినేటెడ్​ పోస్టులే కారణమా?

2020 జనవరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో 28 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో గెలిచి బీజేపీ పట్టుకు ప్రయత్నిస్తోంది. అయితే 28 మంది కార్పొరేటర్లలో ఇప్పటివరకూ పది మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్​లో చేరారు. దీంతో ఇరుపార్టీల మధ్య ఆపరేషన్​ ఆకర్ష్​ తీవ్ర స్థాయి చేరింది. దాన్ని సీరియస్​గా తీసుకున్న బీజేపీ తన క్యాడర్​ను పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రెండునెలల కిందట ఆర్మూర్ నియోజక వర్గంలో 15 మంది టీఆర్​ఎస్​ నాయకులు బీజేపీలో చేరారు. పోటాపోటీగా మార్చి చివరివారంలో ఇద్దరు కార్పొరేటర్లు, 4 రోజల కిందట బీజేపీ కార్పొరేటర్​ మల్లేశ్​ యాదవ్​ టీఆర్​ఎస్​ కండువా కప్పుకున్నారు.  కాంట్రాక్ట్ లు, డబ్బులు ఎర చూపి తమ కార్పొరేటర్లను టీఆర్​ఎస్​  ప్రలోభ పెడుతోందని బీజేపీ నాయకులు సీరియస్​ అవుతున్నారు. 

బలం పెంచుకునేందుకు నాయకుల కసరత్తు.. 

అయితే ఎన్నికల వాతావరణం, అన్ని రాజకీయ పార్టీల్లో చేరికల నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు వ్యక్తిగతంగా బలాన్ని పెంచుకునేందుకు  ఆలోచిస్తున్నారు. అలాంటి వారిపైనే పార్టీలు నజర్​ పెట్టడంతో ఎవరి బలం ఎంత అన్నదే ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ చేరికల కమిటీ జిల్లాలోని ముఖ్య నేతలు, ఉద్యమ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

పదవులు రాకపోతే.. అంతా పోవుడే !

ఉద్యమ నేతలు, టీఆర్​ఎస్​ సీనియర్​ నేతలకు నామినేటెడ్ పోస్ట్ లు కొద్ది రోజుల్లో లభించకపోతే బీజేపీలోకి వెళ్లాలని ఇటీవల తెలంగాణ ఉద్యమనాయకులు సమావేశమైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన ఇతర పార్టీ నాయకులకు బీజేపీలోనైనా ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, తమ అనుచర వర్గానికే నామినేటెడ్ పోస్ట్ లు ఇవ్వడం, తెలంగాణ ఉద్యమ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అసంతృప్తికి గురిచేసింది. ఎమ్మెల్యేల తీరుతో టీఆర్ఎస్​లో తమకు మనుగడ ఉండదని ఉద్యమ నాయకులు భావిస్తున్నారు. దీంతో పదవులిచ్చే పార్టీలో ఉండటమే మేలని అనుకుంటున్నారు.